ఫుల్లుగా తాగించేద్దాం..
ఫుల్లుగా తాగించేద్దాం..
Published Sun, Jun 25 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 2:27 PM
- ఆదాయం కోసం సర్కారు సరికొత్త ఎత్తుగడ
- సుప్రీంకోర్టు ఆదేశాలు తుంగలోకి..
- నగర, పురపాలక సంస్థల్లో యథాస్థానాల్లోనే షాపుల కొనసాగింపు?
- పట్టణాల పరిధిలో ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లను ఎండీఆర్ పరిధిలోకి తీసుకువచ్చే యత్నం
- ఇప్పటికే కేబినేట్ భేటీలో నిర్ణయం
- నేడో, రేపో జీఓ విడుదల
- ఎక్సైజ్ శాఖకు చేరిన మౌఖిక ఆదేశాలు
మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న చంద్రబాబు సర్కారు సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతోంది. ఫుల్లుగా తాగించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మద్యం ద్వారా అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న నగర, పురపాలక సంస్థల్లో.. జాతీయ, రాష్ట్ర రహదారులకు దగ్గరగా ఇప్పుడున్న షాపులను యథాస్థానాల్లోనే కొనసాగించేందుకు సరికొత్త ఎత్తుగడ వేసింది. ఇందుకు సుప్రీం ఆదేశాలు ఆటంకం కావడంతో.. పట్టణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులను మున్సిపల్ డెవలప్‌మెంట్ రోడ్లు(ఎండీఆర్)గా మార్చేందుకు కసరత్తు చేపట్టింది.
మండపేట : రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ (ఎన్‌హెచ్), రాష్ట్ర (ఎస్‌హెచ్) రహదారులకు కాస్త దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీనిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో మద్యం పాలసీ జూలై 1వ తేదీ నుంచి జూన్ 31వ తేదీ వరకు ఉండటంతో జూలై 1వ తేదీ నుంచి అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం 20 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాన్ని నేషనల్, స్టేట్ హైవేలకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. 20 వేలకు పైబడి జనాభా ఉన్న ప్రాంతాలైతే 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి.
సగానికి పైగా వ్యాపారం పట్టణాల్లోనే..
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మద్యం వ్యాపారం ఎక్కువగా జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే. జిల్లావ్యాప్తంగా 555 మద్యం షాపులుండగా, వీటిలో ఆయా నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 126 షాపులతోపాటు 34 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 31, కాకినాడలో 41, అమలాపురం మున్సిపాలిటీలో 7, మండపేటలో 7, రామచంద్రపురంలో 7, పిఠాపురంలో 7, పెద్దాపురంలో 10, సామర్లకోటలో 7, తునిలో 9 మద్యం షాపులున్నాయి. జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు రూ.1.9 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో సగానికి పైగా అమ్మకాలు పట్టణ ప్రాంతాల్లోనే జరగడం గమనార్హం.
మద్యం సిండికేట్ల ఆందోళనతో..
జూలై 1వ తేదీ నుంచి నూతన విధానం అమలులోకి రానుండగా.. కొత్త షాపుల ఏర్పాటు తలకు మించిన భారమవుతుందని, కొత్త నిబంధనలతో అమ్మకాలు తగ్గిపోతాయని మద్యం సిండికేట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రభుత్వ పెద్దలకు భారీగానే ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పాలకులు సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి 220 మీటర్ల లోపే మద్యం షాపులు ఏర్పాటు చేసుకునే వీలుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఈ దూరం రెట్టింపునకు మించి పెరిగిపోతోంది. దూరం తక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, పట్టణాలకు వచ్చేసరికి అమ్మకాలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
సుప్రీం తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా..
సుప్రీంకోర్టు ఎన్‌హెచ్, ఎస్‌హెచ్‌లను మాత్రమే తీర్పులో ఉటంకించడంతో నగర, పురపాలక సంస్థల్లోని జాతీయ, స్టేట్ హైవేలను మున్సిపల్ డెవలప్‌మెంట్ రోడ్లు(ఎండీఆర్)గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. నేడో, రేపో ఈ మేరకు జీఓ విడుదల కావచ్చని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. దీనిపై ఇప్పటికే తమకు మౌఖికంగా సమాచారం అందినట్టు ఒక ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఎండీఆర్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా మద్యం షాపులను ఇప్పుడున్నచోటే కొనసాగించుకునేందుకు వ్యాపారులకు వీలు కల్పించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా సర్కారు చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు తావిస్తున్నాయి.
స్థానిక సంస్థలపై భారం
జాతీయ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి ఇప్పటివరకూ ఆయా శాఖల పరిధిలోనే జరిగేది. జాతీయ రహదారుల అభివృద్ధికి అయ్యే వ్యయాన్ని కేంద్రం భరించేది. రాష్ట్ర రహదారి అయితే ఆర్‌అడ్‌బీ నుంచి నిధుల విడుదల జరిగేది. మద్యం వ్యాపారుల కోసం ఆయా రోడ్లను నగర, పురపాలక సంస్థల పరిధిలోకి తీసుకురానుండటంతో వాటి నిర్వహణ, అభివృద్ధికి అయ్యే కోట్లాది రూపాయలు భారాన్ని ఆయా స్థానిక సంస్థలే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే స్థానిక సంస్థల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండగా.. వీటి రూపంలో కోట్లాది రూపాయల అదనపు భారం పడటంతో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కుంటుపడుతుందని పలువురు విమర్శిస్తున్నారు.
Advertisement
Advertisement