నిమ్మలంగా తాగేసేయ్
సాక్షి, హైదరాబాద్: గ్రామమైనా.. పట్టణమైనా.. చివరికి నగరమైనా.. వైన్‌షాపు ఏర్పాటు చేసే మద్యం వ్యాపారి దానికి అనుబంధంగా ‘పర్మిట్ రూమ్’ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ప్రకటించిన మద్యం విధానంలో 5 వేల జనాభా దాటిన గ్రామంలో ఏర్పాటు చేసే వైన్‌షాపు లెసైన్స్‌తో పాటు పర్మిట్ రూమ్‌కు కూడా అనుమతి తీసుకోవలసిందేనని ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చేనెల 1 నుంచి ప్రారంభమయ్యే ఎక్సైజ్ సంవత్సరం నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటి వరకు పర్మిట్ రూమ్‌లు వైన్‌షాపు యజమానుల ఇష్టంపైనే ఆధారపడి ఉండేవి. ఇకనుంచి వాటిని చూపించిన వారికే వైన్‌షాపు లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయించారు.
లెసైన్స్ ఫీజు రూ.2లక్షలు: వైన్‌షాపుతో పాటు ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్ లెసైన్స్ ఫీజు ఏటా రూ. 2 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో 2,216 వైన్‌షాపులకు పర్మిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈనెల 14న నోటిఫికేషన్ జారీ చేసింది. 5 వేల జనాభా కన్నా తక్కువగా ఉన్నచోట వైన్‌షాపులు ఏర్పాటు చేయడమే అరుదు. హైవేలు, పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం షాపుల్లో దాదాపు 2 వేల దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు తప్పనిసరి కానున్నాయి. ఈ లెక్కన ఎక్సైజ్ శాఖకు కేవలం పర్మిట్ రూంలపైనే రూ. 40 కోట్ల ఆదాయంగా రానుందన్న మాట!
భవిష్యత్తులో బార్‌కోడ్..: తెలంగాణలో అమలులోకి వచ్చే కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం ప్రతి మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్‌లోనే కొత్తగా 2డీ బార్‌కోడ్ ఏర్పాటు చేస్తారు. ఆ బార్‌కోడ్‌లోనే మద్యం ధర ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే కంప్యూటరైజ్డ్ బిల్లు వస్తుంది. జూలై 1 నుంచి ఈ విధానం ద్వారానే మద్యం అమ్మకాలు సాగుతాయి. అయితే ఈసారి కేవలం ఐఎంపీఎల్ మద్యానికే బార్‌కోడ్ విధానాన్ని అనుసంధానం చేసినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం ‘సాక్షి’కి తెలిపారు. బీర్లకు హోలోగ్రామ్ ఉంటుందే తప్ప బార్‌కోడ్ ఉండదని, భవిష్యత్‌లో వాటికి కూడా బార్‌కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బార్‌కోడ్ విధానం ద్వారా డ్యూటీ పెయిడ్ మద్యాన్ని మాత్రమే వైన్‌షాపులో అమ్ముతారని, అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన చెప్పారు.
దరఖాస్తు ఫారం రుసుము రూ.25 వేలు
మద్య దుకాణాల లెసైన్స్‌లు పొందేందుకు ఈనెల 21లోగా ఆయా జిల్లాల్లోని ఎక్సైజ్ సూపరింటెం డెంట్ కార్యాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం రుసుము రూ.25 వేలు. ఒక దుకాణానికి ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈనెల 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు.