breaking news
permit room
-
చెప్పేది ఒకటి.. చేసేది ఇంకోటి. బాబు తీరు మారదా?
నిర్ణయాలు తీసుకోవడానికి ముందు నాటకీయంగా వ్యవహరించడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టైల్! ప్రజా వ్యతిరేకత వస్తుందనుకుంటే.. ఆ నిర్ణయానికి తానూ అనుకూలం కాదన్న బిల్డప్ ఇస్తారు. ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తున్నట్లు ప్రచారం కల్పిస్తారు. కొన్ని రోజుల క్రితం టీవీ ఛానళ్లలో చంద్రబాబు పేరుతో వచ్చిన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. ఎక్సైజ్ శాఖ సమీక్షలో చంద్రబాబు మాట్లాడుతూ తనకు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అన్నట్లు ఛానెళ్ల స్క్రోలింగ్‌లలో కనిపించింది. ఎందుకబ్బా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనుకుంటూ ఉండగానే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు చంద్రబాబు స్టైల్! ప్రజా ఆరోగ్యం ముఖ్యమని అనుకుంటే పర్మిట్ రూమ్‌లకు అనుమతులిస్తారా? ఇది ఏపీ ప్రజల ఆరోగ్యానికి ఏ విధంగా మంచిదో చంద్రబాబే చెప్పాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సొంతంగా మద్యం షాపులను నిర్వహించి బెల్ట్ షాపులు లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే మద్యం అమ్మకాలు మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. అదనంగా వెయ్యి దుకాణాలు అనుమతించడంతోపాటు 99 శాతం టీడీపీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలకే దక్కేలా చేసింది. ఇక బెల్ట్ షాపులు సరేసరి. బెల్ట్ షాపు పెడితే తాట తీస్తానని, రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు కానీ.. ఆచరణలో జరిగింది మాత్రం శూన్యం. అధికార కూటమి స్థానిక ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో వేలాది బెల్ట్ షాపుల నిర్వహణకు వేలం పాటలు కూడా వేశారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్‌లు తీసుకు వస్తున్నారు. చంద్రబాబు అంతకుముందు చేసిన ప్రకటనేమిటి? ఇప్పుడు జరిగిందేమిటి? ఆదాయం ముఖ్యం కాదంటూనే వాటిని పెంచుకునేలా మద్యం విధానాన్ని తయారు చేశారన్నది వాస్తవం. పర్మిట్ రూమ్‌ల ద్వారా సుమారు 180 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.26 వేల కోట్ల ఆదాయం వస్తుంటే దానిని రూ.35 వేల కోట్లకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంత ఆదాయం పెరుగుతుందన్నది వేరే విషయం. కాని దీనికి ప్రభుత్వం కాని, వారికి మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా కాని ఇచ్చిన వాదన చూడండి. ఒకప్పుడు మద్య నిషేధం కోసం ఉద్యమం చేసిన ఈనాడు దినపత్రిక ఇప్పుడు మద్యం వ్యాపారానికి అండగా ఉన్నట్లుగా కథనాలు ఇస్తుండడం విశేషం. రోడ్లపై మద్యం తాగకుండా పర్మిట్ రూమ్‌లు తెచ్చారట.బహిరంగ ప్రదేశాలలో మద్యపానంతో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయట. ఈ క్రమంలో 2.7 లక్షల కేసులు నమోదు అయ్యాయట. దానిని నియంత్రించేందుకు పర్మిట్ రూమ్‌లు అనుమతిచ్చేలా నిర్ణయం చేశారట. అంతే తప్ప మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు ఇవ్వడం వల్ల మరింతగా మద్యపానం చేస్తారని, కుటుంబాలు నాశనం అవుతాయని వీరు రాయడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో పర్మిట్ రూమ్‌లకు సంబంధించి హెడింగ్ కూడా పెట్టకుండా జాగ్రత్తపడింది.. కొత్త పాలసీలో 840 బార్లు వస్తున్నాయి. ప్రస్తుతం 3736 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ఈ పర్మిట్ రూమ్‌లు వస్తున్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే బహిరంగంగా మద్యం తాగడం వల్ల కేసులు వస్తున్నాయట. ఒకే. అది నిజమే అనుకుందాం. ఆ రకంగా శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఒప్పుకున్నట్లే కదా! పోనీ పర్మిట్ రూమ్‌లలో తాగిన మందుబాబులు రోడ్లపైకి వచ్చి మళ్లీ అల్లరి చేయరని ఎలా గ్యారంటీ ఇస్తారో తెలియదు. కాగా రూ.99లకే మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయంలో కూడా విఫలమైంది. బాటిల్‌పై ఉన్న ధరకన్నా రూ.పది ఇరవై అదనంగా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కొందరిని పోలీసులు కూడా పట్టుకున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తామంటూ చిత్రమైన ప్రచారం చేసిన ఘనత కూడా చంద్రబాబు బృందానిదే. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమని చెప్పవలసిన ప్రభుత్వం అలా చేయకపోగా, ఇప్పుడేమో ఊరూరికి బార్, వైన్ షాపు, పర్మిట్ రూమ్, బెల్ట్ షాపు అన్న చందంగా వ్యవహరించడం దురదృష్టకరం. మద్యం వల్ల కుటంబాలు నాశనం అవుతాయి. అందులోను మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. తాగిన మైంలోనే మహిళలపై అకృత్యాలు జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మద్యం విషయంలో ప్రజల ప్రయోజనాలను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. 2014-19 మధ్యలోనూ ప్రమాణ స్వీకారం రోజున చంద్రబాబు బెల్ట్ షాపులను రద్దు చేస్తున్నామంటూ ఫైల్ పై సంతకం చేశారు. కాని ఆ తర్వాత మాత్రం వేలాది బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడిచిపోయాయి. అవి సుమారు 40 వేలకు పైగా అప్పట్లో చేరాయంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటన్నిటిని దాదాపు లేకుండా చేయడమే కాకుండా, షాపులను తగ్గించి, ఊరికి బయట అవి ఉండేలా చర్యలు తీసుకుంది. మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యథాప్రకారం మద్యాన్ని విస్తారంగా పారిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయిన ఎన్.టి.రామారావు తన హామీ ప్రకారం మద్యాన్ని నిషేధించారు. ఆ టైమ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎవరైనా అక్రమ మద్య వ్యాపారం చేస్తుంటే, వారిపై సైతం కేసులు పెట్టడానికి వెనుకాడవద్దని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలుత తాము మరింత గట్టిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఆ తర్వాత అసలు సినిమా చూపించారు. టీడీపీ ఎమ్మల్యేలు ఇష్టం వచ్చినట్లు అక్రమ మద్య వ్యాపారం చేసినా చూసిచూడనట్లు పోయారు. పైగా దీనిపై అసెంబ్లీలో ఒక నివేదిక పెట్టారు. అక్రమ మద్యాన్ని అరికట్టలేక పోతున్నామని ప్రకటించారు.అలా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో కొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ తెలిపి కొందరి పేర్లు వెల్లడించడం సంచలనమైంది. తదుపరి మద్య నిషేధం ఉంచాలా ?వద్దా ? అన్నదానిపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఒక తంతు నిర్వహించారు. ఆ పిమ్మట మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. పైకి తనకు ఇష్టం లేకపోయినా మద్య వ్యాపారాన్ని అనుమతించాల్సి వస్తున్నట్లు పిక్చర్ ఇస్తారన్నమాట. అప్పట్లో మద్యం స్కామ్ లు జరిగాయని విపక్షం ఆరోపించేది. అది వేరే కథ. ఇంకో మాట చెప్పాలి. సంపూర్ణ మద్య నిషేధం చేయాల్సిందే అంటూ ఉద్యమం చేసిన ఈనాడు గ్రూప్ అదినేత రామోజీరావు మద్య నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక సంపాదకీయం రాసేసి చేతులు దులుపుకున్నారు. అందులో కూడా చంద్రబాబును పెద్దగా తప్పు పట్టుకపోవడంపై రామోజీని పలువురు విమర్శించేవారు. రామోజీ ఫిలిం సిటీ, డాల్ఫిన్ హోటల్ తదితర వ్యాపారాలు కలిగిన ఈనాడు మీడియా కూడా చంద్రబాబు మాదిరే డబుల్ గేమ్ ఆడిందన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చేవి. అప్పటి మాదిరే ఇప్పుడు కూడా పర్మిట్ రూమ్‌లు, మద్యం షాపుల దందాను టీడీపీ మీడియా సమర్థిస్తున్న తీరు అసహ్యంగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా తనకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డు పెట్టుకుని ఈ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని పారించడం ప్రజల కోణంలో దుర్మార్గమే అవుతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీ లిక్కర్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు!
సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పర్మిట్ రూమ్‌ల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసిన చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని, రూ.99కే చీప్ లిక్కర్ ఇస్తానని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక మద్యం బ్రాండ్ల రేట్లు తగ్గించకపోగా మరింత పెంచారు. బెల్టు షాపులు భారీ ఎత్తున అధికారిక,అనధికారిక అనుమతులిచ్చారు.ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో, ప్రతి ఊళ్లో, కుగ్రామంలో సైతం మద్యం షాపులు వెలిశాయి. వీధి వీధినా కిరాణా కొట్లతో పోటీ పడుతూ బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన మద్యం షాపులు 3,396 మాత్రమే ఉండగా.. వాటికి అనుబంధంగా కూటమి నేతల కనుసన్నల్లో అనధికారికంగా ఏర్పాటైన బెల్ట్‌షాపులు గత బాబు పాలనలో ఉన్న 43 వేలకు మించి ఉండటం విస్తుగొలుపుతోంది. తద్వారా కింది స్థాయిలో ఎమ్మెల్యే మొదలు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మద్యం విధానాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారనే విమర్శలు కూటమి ప్రభుత్వంపై వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలో విచ్చల విడిగా తాగి తూగడానికి మద్యం షాపులు పక్కనే పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇచ్చే చర్యలకు చంద్రబాబు ఉపక్రమించారు. గతంలో ఉన్న 4500 పర్మిట్ రూమ్‌లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది.కానీ ఇప్పుడు నేరాలు, ప్రమాదాలకు కారణమైన పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వాటిని తెరపైకి తెచ్చింది. -
వైన్ షాపు పర్మిట్‌రూమ్‌లో గొడవ.. యువకుడి మృతి
మూసాపేట(హైదరాబాద్): వైన్ షాపు పర్మిట్ రూములో జరిగిన చిన్నపాటి గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారానికి చెందిన ఆకుల ధనుష్ గౌడ్ (20) ఓ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగియటంతో ఏప్రిల్ 5న తన స్నేహితులు అభినవ్ గౌడ్ (22), నాగిరెడ్డి(21)లతో కూకట్‌పల్లిలోని దారువాలా వైన్ షాపులో మద్యం తాగడానికి వెళ్లారు. కావటి కేశవ్ (25) మూసాపేటలో ఉంటూ బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కావటి కేశవ్ కూడా తన స్నేహితులతో పర్మిట్‌రూమ్‌లో మద్యం తాగుతున్నారు. అతడిని కొంచెం పక్కకు జరగాలని ధనుష్ గౌడ్ స్నేహితులు కోరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి తారస్థాయికి వెళ్లింది. కావటి కేశవ్ ధనుష్ గౌడ్, అతని స్నేహితులను పిడిగుద్దులు గుద్దాడు. ధనుష్గౌడ్కు కడుపులో బలంగా తగలటంతో అక్కడి నుంచి బయటకు వెళ్లారు. మరుసటి రోజు ఉదయం కడుపు నొప్పిగా ఉందంటూ వాళ్ల అమ్మకు చెప్పటంతో వెంటనే కేపీహెచ్‌బీ కాలనీలోని రెమెడీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పెద్ద పేగు పగిలి ఇన్ఫెక్షన్ అయ్యిందని వైద్యులు తెలిపారు. సర్జరీ చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కావటి కేశవ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. -
ఫుల్లు ‘ఫుల్లు’గా హైదరాబాద్‌లో పర్మిట్ రూమ్‌లు
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ వైన్‌షాపు పర్మిట్‌రూమ్ వద్ద మద్యం తాగేందుకు వచ్చిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. పర్మిట్‌రూమ్‌లో స్నాక్స్ విక్రయించే వ్యాపారులే అతన్ని కొట్టి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ పోలీసులు అతడు గుండెపోటుతో చనిపోయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా మద్యం దుకాణాలు నిర్వహించే పర్మిట్ రూమ్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయనేందుకు ఈ సంఘటన నిదర్శనం. లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా సడలించిన అనంతరం గ్రేటర్లో బార్లతో పాటే పర్మిట్ రూమ్‌లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏ ఒక్క పర్మిట్ రూమ్‌లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలు ఎక్కడ? ⇔ ఎక్సైజ్‌శాఖ నిబంధనల మేరకు పర్మిట్ రూమ్‌లో మద్యంతాగేందుకు మాత్రమే ఏర్పాట్లు ఉండాలి. ⇔ కూర్చొనేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్ సదుపాయాలు ఉండాలి. ఇంతవరకు మాత్రమే అనుమతినిచ్చారు. ⇔ అలాగే పర్మిట్ రూమ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. నిరంతరం నిఘా కొనసాగించాలి. ప్రతి వ్యక్తిపైన పర్యవేక్షణ ఉండాలి. ⇔ కానీ అన్ని పర్మిట్రూమ్లలోనూ అక్రమ వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంచినీళ్లు, సోడా, వెజ్, నాన్‌వెజ్ స్నాక్స్, వివిధ రకాల చిరుతిళ్ల అమ్మకాలతో ఒక్కో పర్మిట్ రూమ్‌లో కనీసం 15 రకాల వ్యాపారాలకు కేంద్రంగా మారాయి. ⇔ వైన్ షాపు నిర్వాహకులే ఈ అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు. మద్యం అమ్మకాలతో పాటు, చిరుతిళ్ల అమ్మకాలు రూ.లక్షల్లో సాగుతున్నాయి. ఏదీ భౌతిక దూరం... ⇔ గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 480 వైన్ షాఫులు ఉన్నాయి. 280 వరకు బార్లు ఉన్నాయి. కొత్తగా మరో 55 బార్లకు ఇటీవల ప్రభుత్వం అనుమతినిచ్చింది. ⇔ ప్రతి రోజు సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, వీకెండ్స్‌లో రూ.20 కోట్ల వరకు విక్రయాలు ఉంటాయి. ⇔ లాక్డౌన్ నిబంధనల సడలింపుతో మద్యం అమ్మకాలు కట్టలు తెంచుకున్నాయి. పర్మిట్ రూమ్‌లు కిటకిటలాడుతున్నాయి. ⇔ భౌతిక దూరం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మాస్క్‌లు తొలగిపోయాయి. ⇔ ఆహార పదార్థాలు, చిరుతిళ్ల అమ్మకాల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ⇔ నిత్యం మందుబాబులతో కిక్కిరిసి ఉండే పర్మిట్ రూమ్‌లు రెండో దశ కోవిడ్ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం... ⇔ ఎక్సైజ్ అధికారులు మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లను ఏ మాత్రం నియంత్రించడం లేదు. వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉండవలసిన గదులు కొన్ని చోట్ల విశాలమైన బార్లను తలపిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదు. నేరాలకు, నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు. చదవండి: రూ.48 లక్షల ‘చమురు’ వదిలింది! కేటీఆర్ సీఎం కానున్నారు.. ప్రకటనల కోసం డబ్బులివ్వండి -
మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. సుదీర్ఘ పాదయాత్రలోనూ, అనంతరం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఎక్సైజ్ విధానంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే 25 శాతం మద్యం దుకాణాలు, బార్లు తగ్గించామని, మద్యం విక్రయాల వేళల్లోనూ మార్పులు చేశామన్నారు. జిల్లాల్లో డీ–అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించామన్నారు. భారీ జరిమానాలు... మద్యపానం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నైతిక విద్యలో బోధనాంశాలు చేర్చాలని విద్యాశాఖను ఆదేశించినట్లు సీఎం జగన్ తెలిపారు. అక్రమ మద్యం, తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేసి కనీసం ఆరు నెలల జైలుశిక్షతోపాటు తొలిసారి రూ.రెండు లక్షలు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. రెండోసారి కూడా ఇలాంటి తప్పులు చేస్తే జరిమానా రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. బార్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే రెండు రెట్ల ఫీజు అపరాధ రుసుము కింద వసూలు చేస్తామని, రెండోసారి ఇదే నేరం చేస్తే నిర్మొహమాటంగా లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చట్టంలో సవరణలు చేస్తున్నట్లు తెలిపారు. టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు.. ’’మేం ఎక్సైజ్ పాలసీని 2019 అక్టోబరు 1న ప్రకటించాం. రాష్ట్రంలో అంతకుముందు 43 వేల బెల్టు షాపులుండేవి. గతంలో ప్రభుత్వ పాలసీ ఎలా ఉండేదంటే విక్రయాలు నెలకు 15 శాతం చొప్పున పెరగాలని టార్గెట్ విధించేవారు. అలా విక్రయాలు పెంచితే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేవారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అలా టార్గెట్లు పెట్టడంతో ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి ఉండేది. షాపులు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో విక్రయాలు పెంచేందుకు యథేచ్ఛగా బడి, గుడి.. ఎక్కడబడితే అక్కడ కనీసం 10 బెల్టు షాపులు నడిపించే వారు. అలా రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులు నడిపారు. మద్యం అమ్మకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రతి మనిషిని తాగుబోతుగా చేయాలనే ఆలోచనతో జరిగిన ప్రక్రియ అది. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశామని సభా వేదికగా గర్వంగా చెబుతున్నా. కారణం ఏమిటంటే ఇంతకు ముందు ప్రైవేట్ వ్యక్తులు షాపులు నడిపేవారు. వాళ్లు లాభాపేక్షతో, అమ్మకాలు పెంచుకుంటే ఇంకా లాభాలు పెరుగుతాయని గ్రామాల్లోకి బెల్టు షాపులు విస్తరించారు’’ అని సీఎం అన్నారు. ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఇవీ వాస్తవాలు.. 2018తో పోల్చితే 2019లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) సెప్టెంబరు 2018లో 34.20 లక్షల కేసులు అమ్ముడు కాగా అవి సెప్టెంబరు 2019 నాటికి 22.26 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే ఐఎంఎల్ అమ్మకాలు 34.92 శాతం తగ్గాయి. అదే సమయంలో అంటే 2018 సెప్టెంబరులో బీర్లు 22.19 లక్షల కేసులు అమ్ముడు పోగా 2019 సెప్టెంబరులో అవి 16.46 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే బీర్ల అమ్మకాలు 34.84 శాతం తగ్గాయి. ► ఐఎంఎల్ అమ్మకాలు 2018 అక్టోబరులో 32.28 లక్షల కేసులు కాగా 2019 అక్టోబరులో అవి 24.18 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే 25.11 శాతం అమ్మకాలు తగ్గాయి. 2018 అక్టోబరులో 23.86 లక్షల కేసుల బీరు అమ్ముడు పోగా 2019 అక్టోబరులో కేవలం 10.59 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడైంది. అంటే బీర్ల అమ్మకాలు 55.62 శాతం తగ్గాయి. ► 2018 నవంబరులో ఐఎంఎల్ 29.62 లక్షల కేసులు అమ్ముడుపోగా, 2019 నవంబరులో కేవలం 22.62 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఆ సమయంలో లిక్కర్ అమ్మకాలు 23.63 శాతం తగ్గాయి. ఇక బీర్ల అమ్మకాలు 2018 నవంబరులో 17.80 లక్షల కేసులు కాగా సరిగ్గా ఏడాది తర్వాత 2019 నవంబరులో కేవలం 8.15 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే బీర్ల అమ్మకాలు 54.22% తగ్గాయి. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే... లాభాపేక్ష లేకుండా రద్దు చేశాం.. ‘మేం అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని ప్రోత్సహించరాదని షాపులను కుదించి ప్రభుత్వమే స్వయంగా నడపడం మొదలు పెట్టింది. లాభాపేక్ష లేకుండా మొత్తం 43 వేల బెల్టుషాపులు రద్దు చేశాం. పర్మిట్ రూమ్‌లు రద్దు మద్యం షాపులు తగ్గించడమే కాకుండా పర్మిట్ రూమ్‌లను ఎత్తివేశాం. గతంలో మద్యం షాపుల పక్కన పర్మిట్‌రూమ్‌లో తాగుబోతులంతా కూర్చొని తాగుతుంటే ఆ పక్క నుంచి ఒక అక్క కానీ, చెల్లెమ్మ కానీ నడుచుకుంటూ వెళ్లాలంటే వెళ్లగలరా? ఓ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లగలదా? చంద్రబాబు హయాంలో అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేం అధికారంలోకి వచ్చాక షాపులు తగ్గించాం. బెల్టు షాపులు లేకుండా చేశాం. పర్మిట్ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం. విక్రయాల వేళలు కుదింపు మేం మద్యం అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలని చెబుతూ రాత్రి 11, 12 గంటల వరకు కూడా విక్రయించేవారు. ఇవాళ ప్రభుత్వం మద్యం షాపులను ఉదయం 11 నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకే తెరుస్తోంది. మద్యం కొనుగోళ్లపై నిబంధన గతంలో ఒక వ్యక్తికి ఒకేసారి ఆరు బాటిళ్ల వరకూ విక్రయించే వారు. మేం దానిని మూడు బాటిళ్లకు కుదించాం. లిక్కర్ రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటాయని నా పాదయాత్ర సందర్భంగా చెప్పా. ఇవాళ అక్షరాలా అదే అమలు చేస్తున్నానని గర్వంగా చెబుతున్నా. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు. జిల్లాకో డీ అడిక్షన్ కేంద్రం ప్రతి జిల్లాలో డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది సెప్టెంబరు 25న జీవో ఇచ్చాం. మద్యపానం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నైతిక బోధనాంశం చేర్చాలని విద్యాశాఖకు కూడా సెప్టెంబరు 25న ఆదేశాలు జారీ చేశాం. సచివాలయాల్లో మహిళా పోలీసులు ఇవాళ 14 వేలకు పైగా మహిళా పోలీసులు గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్నారు. వాళ్లు గ్రామాల్లో పోలీసింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం, బెల్టు షాపులు, కల్తీ మద్యం ఉంటే వెంటనే రిపోర్ట్ చేస్తారు. నిఘా కోసం అదనపు డీజీ సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించాం. గ్రామ మహిళా పోలీసు నుంచి ఫోన్ రాగానే ఒక టీమ్ అక్కడికి చేరుకుంటుంది. ఇలా గ్రామాల్లో ఎక్కడా అక్రమ మద్యం లేకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రతి అడుగూ మద్య నియంత్రణ దిశగా మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేశాం. లక్ష్మణరెడ్డి మార్గనిర్దేశంలో ఈ కార్యక్రమం సాగుతోంది. ప్రతి అడుగు మద్య నియంత్రణ దిశగా వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ చట్టం చేస్తున్నాం. గతంలో 840 బార్లు ఉండగా వాటిని 487కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ చర్యలన్నీ ప్రజలను క్రమంగా మద్యానికి దూరం చేస్తాయని, తద్వారా సత్ఫలితాలు వస్తాయని, దీర్ఘకాలంలో వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నా’ అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం దశలవారీ మద్య నిషేధంతో సత్ఫలితాలు: మంత్రి నారాయణస్వామి తొలి సంతకం పేరుతో బాబు మోసం : రోజా చంద్రబాబు మద్యం ఏరులై పారించారు : భూమన 28 శాతం మరణాలకు మద్యమే కారణం : రజని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లులపై చర్చలో సభ్యులు సాక్షి, అమరావతి: దశల వారీగా మద్య నిషేధం, నియంత్రణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలిస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె. నారాయణస్వామి అన్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయం, రవాణా చేసే వారిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో పలు సవరణల చేసింది. ఇందుకు సంబంధించి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా సభలో పలువురు సభ్యులు మాట్లాడారు. బిల్లు ఉద్దేశ్యాలపై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యం దుకాణాలు తగ్గించడం, వాటి సమయాలు కుదించడం, ధరలు పెంచడం వంటి చర్యలు ఆశించిన దానికంటే ఎక్కువే విజయవంతమయ్యాయన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని.. ఫలితంగా నేరాలు తగ్గడంతోపాటు సామాజికంగానూ సానుకూల పరిణామాలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. చర్చలో ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే.. చంద్రబాబుది ‘విత్త’శుద్ధి : భూమన మద్యం నిషేధం విషయంలో చంద్రబాబుది విత్త (ఆదాయం)శుద్ధి అయితే సీఎం వైఎస్ జగన్‌ది చిత్తశుద్ధని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎన్టీ రామారావు విధించిన మద్య నిషేధాన్ని తొలగించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేసింది చంద్రబాబేనని ఆయన విమర్శించారు. పేదల బతుకుల్లో ఆయన మద్యం చిచ్చు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. కానీ, ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదంటూ వైఎస్ జగన్ మద్యం మహమ్మారిని అరికట్టేందుకే నిర్ణయించారన్నారు. చంద్రబాబుది బ్రాందీ పాలన : రోజా రాష్ట్రంలో చంద్రబాబు బ్రాందీ పాలన సాగించగా... ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ గాంధీ పాలన తీసుకువచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అధికారం చేపట్టగానే చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో బెల్టు దుకాణాల తొలగింపు ఫైలుపై ఒకటి చేశారని ఆమె గుర్తుచేశారు. కానీ, 2019లో ఆయన అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులున్నాయంటే ఆయన తొలి సంతకం పేరుతో ప్రజల్ని ఎంతగా మోసం చేసిందీ తెలుస్తోందన్నారు. కానీ, వైఎస్ జగన్ 43 వేల బెల్టు దుకాణాలను తొలగించడంతోపాటు మద్యం దుకాణాలు 43 శాతం, బార్లు 40 శాతం తగ్గించారని రోజా చెప్పారు. ‘పులిహోరా తింటే పులి కాలేరని.. టీడీపీ నేతలు అంతా పులిహోరా బ్యాచ్’ అని ఆమె ఎద్దేవా చేశారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలు : రజిని మద్య నిషేధానికి ప్రభుత్వం చేసిన చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వి. రజిని ప్రభుత్వాన్ని కోరారు. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 28 శాతం మద్యపానం కారణంగానే జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించిందని ఆమె అన్నారు. టీడీపీ పాలనలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయిగానీ మద్యం దొరకని ఊరులేదని విమర్శించారు. -
పర్మిట్ రూంలో క్లీనర్ హత్య
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో షేక్ హైమద్(55) అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. ఎస్‌హెచ్‌వో రాఘవేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రంగచారి నగర్‌కు చెందిన హైమద్ పాత ప్రాంతంలో గల కవిత వైన్స్‌కు సంబంధించిన పర్మిట్‌రూంలో క్లీనర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా షేక్ హైమద్ శనివారం çపర్మిట్‌రూంలో పని చేసేందుకు వెళ్లాడు. రాత్రి గడస్తున్నా పర్మిట్ రూం నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికారు. కాగా షేక్ హైమద్ ఆదివారం ఉదయం పర్మిట్ రూంలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఏసీపీ శివకుమార్, ఎస్‌హెచ్‌వో రాఘవేందర్, ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరుకొని హత్య వివరాలపై ఆరాతీశారు. గుర్తు తెలియని వ్యక్తులు షేక్ హైమద్‌ను చితకబాది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు జిల్లా కేంద్రం నుంచి తీసుకువచ్చిన జాగిలాలతో ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, 5 కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఎజాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. -
పర్మిట్ రూమ్‌లో వ్యక్తి మృతదేహం
సదాశివనగర్:సదాశివనగర్ మండల కేంద్రంలో గల సెవెన్ హిల్స్ వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్‌లో ఓ వ్యక్తి శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన మడిపెద్ది నారాయణ(52) అనే వ్యక్తి వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్‌కు మద్యం సేవించడానికి వచ్చాడు. మద్యం సేవించిన అనంతరం ఎవరో వ్యక్తులు తలపై కొట్టడంతోనే అక్కడిక్కడే మృతి చెందాడని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. పర్మిట్ రూమ్‌లో వ్యక్తి మృతి చెందినట్లు తెలిసి న వైన్స్ దుకాణాన్ని ఎలా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తు దుకాణాన్ని మూసివేశారు. పర్మిట్ రూమ్‌లో ఘర్షణ జరగడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ప్రతా ప్ లింగం పరిశీలించారు. ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులను సముదాయించారు. అయినా వారు వైన్స్ నిర్వాహకులు వచ్చే వరకు శవాన్ని తీసే ది లేదని బీష్మించారు. ఈ విషయమై ఎస్సైని వివరణ కోరగా తలకు గాయమైన మాట వాస్తవమేపపి, వ్యక్తి మ ద్యం సేవించి కింద పడి చనిపోయాడా? ఏమైన ఘర్షణ జరిగిందా? అనే విషయాలను పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వెలుగు చూస్తాయని అన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
రూ. 1.90 లక్షల నగదు స్వాధీనం ఉప్పల్‌లోని ఇంటి నుంచి మరో రూ.8.87 లక్షలు.. భోలక్‌పూర్: లంచం తీసుకుంటూ ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నజ్ముద్దీన్ ఏసీబీకి సోమవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.90 వేలతో పాటు టేబుల్ సొరుగులో ఉన్న మరో రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్-1 డీఎస్పీ ఎస్.కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. 1998 బ్యాచ్‌కు చెందిన మహ్మద్ నజ్ముద్దీన్ (52) ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా 15 నెలల క్రితం బదిలీపై వచ్చారు. పద్మారావునగర్‌కు వెళ్లేదారిలో ఉన్న ఎస్.వి.కె వైన్స్‌లోని పర్మిట్ రూమ్ కొనసాగించేలా చూస్తానని, దుకాణానికి సంబంధించి లెసైన్సు ఫీజు చెల్లింపులో కూడా సహకరిస్తానని ఇందుకు షాపు యజమాని ధర్మేందర్రెడ్డిని రూ.1.20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ధర్మేందర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సిటీ రేంజ్-1 డీఎస్పీ నేతృత్వంలో సోమవారం సాయంత్రం షాపు యజమానికి రూ.90 ఇచ్చి కార్యాలయంలో ఉన్న ఇన్స్పెక్టర్ వద్దకు పంపించారు. ధర్మేందర్‌రెడ్డి నుంచి నగదు తీసుకుంటుండగా నజ్ముద్దీన్ను పట్టుకున్నారు. టేబుల్లో దొరికిన ఎలాంటి లెక్కా లేని రూ.లక్షతో పాటు ఉప్పల్‌లోని ఇన్స్పెక్టర్ ఇంటి నుంచి మరో రూ.8.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నజ్ముద్దీన్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, రాజేష్, కాశయ్య, ఎస్ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు. -
నిమ్మలంగా తాగేసేయ్
సాక్షి, హైదరాబాద్: గ్రామమైనా.. పట్టణమైనా.. చివరికి నగరమైనా.. వైన్‌షాపు ఏర్పాటు చేసే మద్యం వ్యాపారి దానికి అనుబంధంగా ‘పర్మిట్ రూమ్’ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటికే ప్రకటించిన మద్యం విధానంలో 5 వేల జనాభా దాటిన గ్రామంలో ఏర్పాటు చేసే వైన్‌షాపు లెసైన్స్‌తో పాటు పర్మిట్ రూమ్‌కు కూడా అనుమతి తీసుకోవలసిందేనని ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చేనెల 1 నుంచి ప్రారంభమయ్యే ఎక్సైజ్ సంవత్సరం నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటి వరకు పర్మిట్ రూమ్‌లు వైన్‌షాపు యజమానుల ఇష్టంపైనే ఆధారపడి ఉండేవి. ఇకనుంచి వాటిని చూపించిన వారికే వైన్‌షాపు లెసైన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. లెసైన్స్ ఫీజు రూ.2లక్షలు: వైన్‌షాపుతో పాటు ఏర్పాటు చేసే పర్మిట్ రూమ్ లెసైన్స్ ఫీజు ఏటా రూ. 2 లక్షలు. తెలంగాణ రాష్ట్రంలో 2,216 వైన్‌షాపులకు పర్మిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఈనెల 14న నోటిఫికేషన్ జారీ చేసింది. 5 వేల జనాభా కన్నా తక్కువగా ఉన్నచోట వైన్‌షాపులు ఏర్పాటు చేయడమే అరుదు. హైవేలు, పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన మొత్తం షాపుల్లో దాదాపు 2 వేల దుకాణాలకు పర్మిట్ రూమ్‌లు తప్పనిసరి కానున్నాయి. ఈ లెక్కన ఎక్సైజ్ శాఖకు కేవలం పర్మిట్ రూంలపైనే రూ. 40 కోట్ల ఆదాయంగా రానుందన్న మాట! భవిష్యత్తులో బార్కోడ్..: తెలంగాణలో అమలులోకి వచ్చే కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం ప్రతి మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్లోనే కొత్తగా 2డీ బార్కోడ్ ఏర్పాటు చేస్తారు. ఆ బార్‌కోడ్‌లోనే మద్యం ధర ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే కంప్యూటరైజ్డ్ బిల్లు వస్తుంది. జూలై 1 నుంచి ఈ విధానం ద్వారానే మద్యం అమ్మకాలు సాగుతాయి. అయితే ఈసారి కేవలం ఐఎంపీఎల్ మద్యానికే బార్కోడ్ విధానాన్ని అనుసంధానం చేసినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ అహ్మద్ నదీం ‘సాక్షి’కి తెలిపారు. బీర్లకు హోలోగ్రామ్ ఉంటుందే తప్ప బార్కోడ్ ఉండదని, భవిష్యత్‌లో వాటికి కూడా బార్కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బార్కోడ్ విధానం ద్వారా డ్యూటీ పెయిడ్ మద్యాన్ని మాత్రమే వైన్‌షాపులో అమ్ముతారని, అక్రమ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన చెప్పారు. దరఖాస్తు ఫారం రుసుము రూ.25 వేలు మద్య దుకాణాల లెసైన్స్‌లు పొందేందుకు ఈనెల 21లోగా ఆయా జిల్లాల్లోని ఎక్సైజ్ సూపరింటెం డెంట్ కార్యాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం రుసుము రూ.25 వేలు. ఒక దుకాణానికి ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈనెల 23న జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఎక్సైజ్ కమిషనర్ తెలిపారు.