ఫుల్లు ‘ఫుల్లు’గా హైదరాబాద్‌లో పర్మిట్‌ రూమ్‌లు | Illegal Activities In Permit Room In Hyderabad | Sakshi
Sakshi News home page

ఫుల్లు ‘ఫుల్లు’గా హైదరాబాద్‌లో పర్మిట్‌ రూమ్‌లు

Published Tue, Feb 23 2021 8:18 AM | Last Updated on Tue, Feb 23 2021 10:33 AM

Illegal Activities In Permit Room In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజుల క్రితం నగరంలోని ఓ వైన్‌షాపు పర్మిట్‌రూమ్‌ వద్ద మద్యం తాగేందుకు వచ్చిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. పర్మిట్‌రూమ్‌లో స్నాక్స్‌ విక్రయించే వ్యాపారులే అతన్ని కొట్టి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ పోలీసులు అతడు గుండెపోటుతో చనిపోయినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వివాదం సంగతి ఎలా ఉన్నా మద్యం దుకాణాలు నిర్వహించే పర్మిట్‌ రూమ్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారుతున్నాయనేందుకు ఈ సంఘటన నిదర్శనం. లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా సడలించిన అనంతరం గ్రేటర్‌లో బార్‌లతో పాటే పర్మిట్‌ రూమ్‌లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం మందుబాబులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏ ఒక్క పర్మిట్‌ రూమ్‌లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదు. 

నిబంధనలు ఎక్కడ? 
⇔ ఎక్సైజ్‌శాఖ నిబంధనల మేరకు పర్మిట్‌ రూమ్‌లో మద్యంతాగేందుకు మాత్రమే ఏర్పాట్లు ఉండాలి.  
 కూర్చొనేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్‌ సదుపాయాలు ఉండాలి. ఇంతవరకు మాత్రమే అనుమతినిచ్చారు.  
 అలాగే  పర్మిట్‌ రూమ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. నిరంతరం నిఘా కొనసాగించాలి. ప్రతి వ్యక్తిపైన పర్యవేక్షణ ఉండాలి.  
 కానీ అన్ని పర్మిట్‌రూమ్‌లలోనూ అక్రమ వ్యాపారాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. మంచినీళ్లు, సోడా, వెజ్, నాన్‌వెజ్‌ స్నాక్స్, వివిధ రకాల చిరుతిళ్ల అమ్మకాలతో ఒక్కో పర్మిట్‌ రూమ్‌లో కనీసం 15  రకాల వ్యాపారాలకు కేంద్రంగా మారాయి.  
 వైన్‌ షాపు నిర్వాహకులే ఈ అక్రమ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నారు. మద్యం అమ్మకాలతో పాటు, చిరుతిళ్ల అమ్మకాలు రూ.లక్షల్లో 
సాగుతున్నాయి.  

ఏదీ భౌతిక దూరం... 
 గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 480  వైన్‌ షాఫులు ఉన్నాయి. 280 వరకు బార్‌లు ఉన్నాయి. కొత్తగా మరో 55 బార్‌లకు ఇటీవల ప్రభుత్వం అనుమతినిచ్చింది.  
 ప్రతి రోజు సుమారు రూ.10 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా, వీకెండ్స్‌లో రూ.20 కోట్ల వరకు విక్రయాలు ఉంటాయి.  
 లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో మద్యం అమ్మకాలు కట్టలు తెంచుకున్నాయి. పర్మిట్‌ రూమ్‌లు కిటకిటలాడుతున్నాయి.  
 భౌతిక దూరం ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మాస్క్‌లు తొలగిపోయాయి.  
 ఆహార పదార్థాలు, చిరుతిళ్ల అమ్మకాల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు.  
 నిత్యం మందుబాబులతో కిక్కిరిసి ఉండే పర్మిట్‌ రూమ్‌లు రెండో దశ కోవిడ్‌ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
అడుగడుగునా నిర్లక్ష్యం... 
 ఎక్సైజ్‌ అధికారులు మద్యం విక్రయాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పర్మిట్‌ రూమ్‌లను ఏ మాత్రం నియంత్రించడం లేదు. వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఉండవలసిన గదులు కొన్ని చోట్ల  విశాలమైన బార్‌లను తలపిస్తున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదు. నేరాలకు, నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు.   

చదవండి: రూ.48 లక్షల ‘చమురు’ వదిలింది!
కేటీఆర్‌ సీఎం కానున్నారు.. ప్రకటనల కోసం డబ్బులివ్వండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement