ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్
- రూ. 1.90 లక్షల నగదు స్వాధీనం
- ఉప్పల్‌లోని ఇంటి నుంచి మరో రూ.8.87 లక్షలు..
భోలక్‌పూర్: లంచం తీసుకుంటూ ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నజ్ముద్దీన్ ఏసీబీకి సోమవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.90 వేలతో పాటు టేబుల్ సొరుగులో ఉన్న మరో రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ సిటీ రేంజ్-1 డీఎస్పీ ఎస్.కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం.. 1998 బ్యాచ్‌కు చెందిన మహ్మద్ నజ్ముద్దీన్ (52) ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా 15 నెలల క్రితం బదిలీపై వచ్చారు.
పద్మారావునగర్‌కు వెళ్లేదారిలో ఉన్న ఎస్.వి.కె వైన్స్‌లోని పర్మిట్ రూమ్ కొనసాగించేలా చూస్తానని, దుకాణానికి సంబంధించి లెసైన్సు ఫీజు చెల్లింపులో కూడా సహకరిస్తానని ఇందుకు షాపు యజమాని ధర్మేందర్‌రెడ్డిని రూ.1.20 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో ధర్మేందర్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ సిటీ రేంజ్-1 డీఎస్పీ నేతృత్వంలో సోమవారం సాయంత్రం షాపు యజమానికి రూ.90 ఇచ్చి కార్యాలయంలో ఉన్న ఇన్‌స్పెక్టర్ వద్దకు పంపించారు.
ధర్మేందర్‌రెడ్డి నుంచి నగదు తీసుకుంటుండగా నజ్ముద్దీన్‌ను పట్టుకున్నారు. టేబుల్‌లో దొరికిన ఎలాంటి లెక్కా లేని రూ.లక్షతో పాటు ఉప్పల్‌లోని ఇన్‌స్పెక్టర్ ఇంటి నుంచి మరో రూ.8.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నజ్ముద్దీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడిలో ఏసీబీ సీఐలు నాగరాజు, శ్రీనివాస్, రాజేష్, కాశయ్య, ఎస్‌ఐ రాజవర్ధన్ పాల్గొన్నారు.