సీఎం వైఎస్‌ జగన్‌: మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధం | YS Jagan's Speech in Assembly Over Three Phases of Liquor Ban in the State - Sakshi
Sakshi News home page

మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధం

Published Tue, Dec 17 2019 5:13 AM | Last Updated on Tue, Dec 17 2019 12:10 PM

CM YS Jagan Mohan Reddy Says Alcohol ban Andhra Pradesh in three Phases - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు దశల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. సుదీర్ఘ పాదయాత్రలోనూ, అనంతరం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామన్నారు. దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఎక్సైజ్‌ విధానంలో మార్పులు చేస్తూ రూపొందించిన బిల్లుపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే 25 శాతం మద్యం దుకాణాలు, బార్లు తగ్గించామని, మద్యం విక్రయాల వేళల్లోనూ మార్పులు చేశామన్నారు. జిల్లాల్లో డీ–అడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించామన్నారు.

భారీ జరిమానాలు...
మద్యపానం, డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నైతిక విద్యలో బోధనాంశాలు చేర్చాలని విద్యాశాఖను ఆదేశించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అక్రమ మద్యం, తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కింద కేసులు నమోదు చేసి కనీసం ఆరు నెలల జైలుశిక్షతోపాటు తొలిసారి రూ.రెండు లక్షలు అపరాధ రుసుం వసూలు చేస్తామని హెచ్చరించారు. రెండోసారి కూడా ఇలాంటి తప్పులు చేస్తే జరిమానా రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. బార్లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే రెండు రెట్ల ఫీజు అపరాధ రుసుము కింద వసూలు చేస్తామని, రెండోసారి ఇదే నేరం చేస్తే నిర్మొహమాటంగా లైసెన్సు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు చట్టంలో సవరణలు చేస్తున్నట్లు తెలిపారు.


టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు..
’’మేం ఎక్సైజ్‌ పాలసీని 2019 అక్టోబరు 1న ప్రకటించాం. రాష్ట్రంలో అంతకుముందు 43 వేల బెల్టు షాపులుండేవి. గతంలో ప్రభుత్వ పాలసీ ఎలా ఉండేదంటే విక్రయాలు నెలకు 15 శాతం చొప్పున పెరగాలని టార్గెట్‌ విధించేవారు. అలా విక్రయాలు పెంచితే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేవారు. సాక్షాత్తూ ప్రభుత్వమే అలా టార్గెట్లు పెట్టడంతో ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి ఉండేది. షాపులు కూడా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉండడంతో విక్రయాలు పెంచేందుకు యథేచ్ఛగా బడి, గుడి.. ఎక్కడబడితే  అక్కడ కనీసం 10 బెల్టు షాపులు నడిపించే వారు. అలా రాష్ట్రంలో 43 వేల బెల్టుషాపులు నడిపారు. మద్యం అమ్మకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రతి మనిషిని తాగుబోతుగా చేయాలనే ఆలోచనతో జరిగిన ప్రక్రియ అది. మేం అధికారంలోకి వచ్చాక ఒక్క బెల్టు షాపు కూడా లేకుండా చేశామని సభా వేదికగా గర్వంగా చెబుతున్నా. కారణం ఏమిటంటే ఇంతకు ముందు ప్రైవేట్‌ వ్యక్తులు షాపులు నడిపేవారు. వాళ్లు లాభాపేక్షతో, అమ్మకాలు పెంచుకుంటే ఇంకా లాభాలు పెరుగుతాయని గ్రామాల్లోకి బెల్టు షాపులు విస్తరించారు’’ అని సీఎం అన్నారు.

ఐఎంఎల్, బీర్ల విక్రయాలపై ఇవీ వాస్తవాలు..
2018తో పోల్చితే 2019లో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ (ఐఎంఎల్‌) సెప్టెంబరు 2018లో 34.20 లక్షల కేసులు అమ్ముడు కాగా అవి సెప్టెంబరు 2019 నాటికి 22.26 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే ఐఎంఎల్‌ అమ్మకాలు 34.92 శాతం తగ్గాయి. అదే సమయంలో అంటే 2018 సెప్టెంబరులో బీర్లు 22.19 లక్షల కేసులు అమ్ముడు పోగా 2019 సెప్టెంబరులో అవి 16.46 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే బీర్ల అమ్మకాలు 34.84 శాతం తగ్గాయి.

► ఐఎంఎల్‌ అమ్మకాలు 2018 అక్టోబరులో 32.28 లక్షల కేసులు కాగా 2019 అక్టోబరులో అవి 24.18 లక్షల కేసులకు పడిపోయాయి. అంటే 25.11 శాతం అమ్మకాలు తగ్గాయి. 2018 అక్టోబరులో 23.86 లక్షల కేసుల బీరు అమ్ముడు పోగా 2019 అక్టోబరులో కేవలం 10.59 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడైంది. అంటే బీర్ల అమ్మకాలు 55.62 శాతం తగ్గాయి.

► 2018 నవంబరులో ఐఎంఎల్‌ 29.62 లక్షల కేసులు అమ్ముడుపోగా, 2019 నవంబరులో కేవలం 22.62 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఆ సమయంలో లిక్కర్‌ అమ్మకాలు 23.63 శాతం తగ్గాయి. ఇక బీర్ల అమ్మకాలు 2018 నవంబరులో 17.80 లక్షల కేసులు కాగా సరిగ్గా ఏడాది తర్వాత 2019 నవంబరులో కేవలం 8.15 లక్షల కేసుల బీరు మాత్రమే అమ్ముడు పోయింది. అంటే బీర్ల అమ్మకాలు 54.22% తగ్గాయి.


ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే...
లాభాపేక్ష లేకుండా రద్దు చేశాం..
‘మేం అధికారంలోకి వచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యాన్ని ప్రోత్సహించరాదని షాపులను కుదించి ప్రభుత్వమే స్వయంగా నడపడం మొదలు పెట్టింది. లాభాపేక్ష లేకుండా మొత్తం 43 వేల బెల్టుషాపులు రద్దు చేశాం.

పర్మిట్‌ రూమ్‌లు రద్దు
మద్యం షాపులు తగ్గించడమే కాకుండా పర్మిట్‌ రూమ్‌లను ఎత్తివేశాం. గతంలో మద్యం షాపుల పక్కన పర్మిట్‌రూమ్‌లో తాగుబోతులంతా కూర్చొని తాగుతుంటే ఆ పక్క నుంచి ఒక అక్క కానీ, చెల్లెమ్మ కానీ నడుచుకుంటూ వెళ్లాలంటే వెళ్లగలరా? ఓ అమ్మాయి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లగలదా? చంద్రబాబు హయాంలో అంత దారుణమైన పరిస్థితి ఉంటే మేం అధికారంలోకి వచ్చాక షాపులు తగ్గించాం.  బెల్టు షాపులు లేకుండా చేశాం. పర్మిట్‌ రూమ్‌లు పూర్తిగా రద్దు చేశాం.

విక్రయాల వేళలు కుదింపు
మేం మద్యం అమ్మకాల సమయాన్ని కూడా కుదించాం. అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలని చెబుతూ రాత్రి 11, 12 గంటల వరకు కూడా విక్రయించేవారు. ఇవాళ ప్రభుత్వం మద్యం షాపులను ఉదయం 11 నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకే తెరుస్తోంది.

మద్యం కొనుగోళ్లపై నిబంధన
గతంలో ఒక వ్యక్తికి ఒకేసారి ఆరు బాటిళ్ల వరకూ విక్రయించే వారు. మేం దానిని మూడు బాటిళ్లకు కుదించాం. లిక్కర్‌ రేట్లు షాక్‌ కొట్టే విధంగా ఉంటాయని నా పాదయాత్ర సందర్భంగా చెప్పా. ఇవాళ అక్షరాలా అదే అమలు చేస్తున్నానని గర్వంగా చెబుతున్నా. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు.

జిల్లాకో డీ అడిక్షన్‌ కేంద్రం
ప్రతి జిల్లాలో డీఅడిక్షన్‌ కేంద్రాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది సెప్టెంబరు 25న జీవో ఇచ్చాం. మద్యపానం, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా నైతిక  బోధనాంశం చేర్చాలని విద్యాశాఖకు కూడా సెప్టెంబరు 25న ఆదేశాలు జారీ చేశాం.

సచివాలయాల్లో మహిళా పోలీసులు
ఇవాళ 14 వేలకు పైగా మహిళా పోలీసులు గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్నారు. వాళ్లు గ్రామాల్లో పోలీసింగ్‌ చేస్తున్నారు. ఎక్కడైనా అక్రమ మద్యం,  బెల్టు షాపులు,  కల్తీ మద్యం ఉంటే వెంటనే రిపోర్ట్‌ చేస్తారు. నిఘా కోసం అదనపు డీజీ సురేంద్రబాబుకు బాధ్యతలు అప్పగించాం. గ్రామ మహిళా పోలీసు నుంచి ఫోన్‌ రాగానే ఒక టీమ్‌ అక్కడికి చేరుకుంటుంది. ఇలా గ్రామాల్లో ఎక్కడా అక్రమ మద్యం లేకుండా చర్యలు చేపడుతున్నాం.

ప్రతి అడుగూ మద్య నియంత్రణ దిశగా
మద్య విమోచన ప్రచార కమిటీని ఏర్పాటు చేశాం. లక్ష్మణరెడ్డి మార్గనిర్దేశంలో ఈ కార్యక్రమం సాగుతోంది. ప్రతి అడుగు మద్య నియంత్రణ దిశగా వేస్తున్నాం.  ఇందులో భాగంగానే  ఈ చట్టం చేస్తున్నాం. గతంలో 840 బార్లు ఉండగా వాటిని 487కి తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆ మేరకు నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. ఈ చర్యలన్నీ ప్రజలను క్రమంగా మద్యానికి దూరం చేస్తాయని, తద్వారా సత్ఫలితాలు వస్తాయని, దీర్ఘకాలంలో వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నా’

అనుకున్న దానికంటే ఎక్కువ విజయవంతం
దశలవారీ మద్య నిషేధంతో సత్ఫలితాలు: మంత్రి నారాయణస్వామి

తొలి సంతకం పేరుతో బాబు మోసం : రోజా

చంద్రబాబు మద్యం ఏరులై పారించారు : భూమన

28 శాతం మరణాలకు మద్యమే కారణం : రజని

ఎక్సైజ్‌ చట్టం సవరణ బిల్లులపై చర్చలో సభ్యులు

సాక్షి, అమరావతి: దశల వారీగా మద్య నిషేధం, నియంత్రణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలిస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె. నారాయణస్వామి అన్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయం, రవాణా చేసే వారిపై కూడా ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ చట్టంలో  పలు సవరణల చేసింది. ఇందుకు సంబంధించి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా సభలో పలువురు సభ్యులు మాట్లాడారు. బిల్లు ఉద్దేశ్యాలపై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యం దుకాణాలు తగ్గించడం, వాటి సమయాలు కుదించడం, ధరలు పెంచడం వంటి చర్యలు ఆశించిన దానికంటే ఎక్కువే విజయవంతమయ్యాయన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని.. ఫలితంగా నేరాలు తగ్గడంతోపాటు సామాజికంగానూ సానుకూల పరిణామాలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. చర్చలో ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..

చంద్రబాబుది ‘విత్త’శుద్ధి : భూమన

మద్యం నిషేధం విషయంలో చంద్రబాబుది విత్త (ఆదాయం)శుద్ధి అయితే సీఎం వైఎస్‌ జగన్‌ది చిత్తశుద్ధని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎన్టీ రామారావు విధించిన మద్య నిషేధాన్ని తొలగించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారేలా చేసింది చంద్రబాబేనని ఆయన విమర్శించారు. పేదల బతుకుల్లో ఆయన మద్యం చిచ్చు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. కానీ, ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదంటూ వైఎస్‌ జగన్‌ మద్యం మహమ్మారిని అరికట్టేందుకే నిర్ణయించారన్నారు.

చంద్రబాబుది బ్రాందీ పాలన : రోజా

రాష్ట్రంలో చంద్రబాబు బ్రాందీ పాలన సాగించగా... ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ గాంధీ పాలన తీసుకువచ్చారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అధికారం చేపట్టగానే చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాల్లో బెల్టు దుకాణాల తొలగింపు ఫైలుపై ఒకటి చేశారని ఆమె గుర్తుచేశారు. కానీ, 2019లో ఆయన అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో 43 వేల బెల్టు షాపులున్నాయంటే ఆయన తొలి సంతకం పేరుతో ప్రజల్ని ఎంతగా మోసం చేసిందీ తెలుస్తోందన్నారు. కానీ, వైఎస్‌ జగన్‌ 43 వేల బెల్టు దుకాణాలను తొలగించడంతోపాటు మద్యం దుకాణాలు 43 శాతం, బార్లు 40 శాతం తగ్గించారని రోజా చెప్పారు. ‘పులిహోరా తింటే పులి కాలేరని.. టీడీపీ నేతలు అంతా పులిహోరా బ్యాచ్‌’ అని ఆమె ఎద్దేవా చేశారు.

ఉల్లంఘనులపై కఠిన చర్యలు : రజిని

మద్య నిషేధానికి ప్రభుత్వం చేసిన చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వి. రజిని ప్రభుత్వాన్ని కోరారు. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 28 శాతం మద్యపానం కారణంగానే జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించిందని ఆమె అన్నారు. టీడీపీ పాలనలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయిగానీ మద్యం దొరకని ఊరులేదని విమర్శించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement