- ట్రిపుల్‌ఐటీ సూపర్ న్యూమరీ సీట్లకు జీవో ఏదీ
- అయోమయంలో 88 మంది విద్యార్థుల భవితవ్యం
- 27న కౌన్సెలింగ్‌కి పిలిచినా.. నేటికీ విడుదల కాని జీవో
- వేరే జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఇబ్బందులు
నూజివీడు : నూజివీడు ట్రిపుల్‌ఐటీకి మంజూరుచేసిన సూపర్ న్యూమరీ సీట్లకు సంబంధించి ప్రభుత్వం ఇంతవరకు జీవోను విడుదల చేయకపోవడంతో 88 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కౌన్సెలింగ్ సమయానికి కూడా ప్రభుత్వం ఈ సీట్ల గురించి ఏవిధమైన ఉత్తర్వులూ జారీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఒకవేళ ట్రిపుల్‌ఐటీలో సీటు రాకపోతే తమ పిల్లల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఈ నెల 27న కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 28న మధ్యాహ్నం రెండు గంటల వరకు నూజివీడు ట్రిపుల్‌ఐటీలోనే ఉండి తమ సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ నెల ఒకటిన ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇన్ని రోజులు గడిచినా జీవో విడుదల చేసేలా చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. తమ చేతిలో ఏమీలేదని, ప్రభుత్వం జీవో ఇవ్వగానే కబురుచేస్తామని వారికి ఇన్‌చార్జి డెరైక్టర్ కె.హనుమంతరావు స్పష్టంచేశారు. దీంతో చేసేదేమీ లేక వారంతా వెనుదిరిగారు.
ఒకటో తేదీనే ప్రకటన...
ట్రిపుల్ ఐటీలోని ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి గాను ఎంపిక చేసిన జాబితాను ఈ నెల ఒకటో తేదీన ప్రకటించిన సమయంలోనే సూపర్ న్యూమరీ సీట్ల గురించి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నూజివీడు ట్రిపుల్‌ఐటీకి 113 సీట్లు సూపర్ న్యూమరీ సీట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఆంధ్రా రీజియన్‌లో 96 మండలాల నుంచి ఒక్కరు కూడా ఎంపిక కాకపోవడంతో ట్రిపుల్‌ఐటీల లక్ష్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఆయా మండలాల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సీట్లను ప్రకటించారు. వీటి కోసం ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, సర్టిఫికెట్లతో హాజరుకావాలని ట్రిపుల్‌ఐటీ అధికారులు కబురు చేశారు.
దీంతో 113 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని రాగా, వారి సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేసిన అధికారులు.. ప్రభుత్వం నుంచి జీవో రాగానే కబురు చేస్తామని, అప్పుడు మీ పిల్లలను తీసుకుని రావాలని చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, విద్యార్థులు జీవో రాకుండా కౌన్సెలింగ్ ఎందుకు పిలిచారని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం కచ్చితంగా జీవో ఇస్తుందని చెప్పినా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వినకుండా సోమవారం రాత్రంతా ట్రిపుల్ ఐటీలోనే ఉన్నారు. మంగళవారం ఉదయం కూడా అధికారులు పదేపదే చెప్పడంతో అక్కడినుంచి వెనుదిరిగారు. వేరే జిల్లాల నుంచి కౌన్సెలింగ్ కోసం వచ్చిన వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
గంటా.. ఇదేమి తంటా?
Published Wed, Jul 29 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement