ఖజానాకు పచ్చ గండి | ports the auction syndicates tenders win tdp leaders | Sakshi
Sakshi News home page

ఖజానాకు పచ్చ గండి

Published Tue, Mar 29 2016 12:39 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

ఖజానాకు పచ్చ గండి - Sakshi

ఖజానాకు పచ్చ గండి

రేవుల వేలంలో సిండికేట్లు
టెండర్లు దక్కించుకున్న తమ్ముళ్లు
మాదిపాడు బల్లకట్టుకు దాఖలు కాని టెండర్లు
జెడ్పీకి రూ.76 లక్షల 35 వేలు ఆదాయం

 
గుంటూరు వెస్ట్
: పచ్చచొక్కాల నాయకులంతా ఒక్కటై ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపెట్టారు. జిల్లా పరిషత్ నిర్దేశించిన ధరలకు మాత్రమే పాటలు పాడి మమ అనిపించారు. సిండికేట్‌గా మారిన కాంట్రాక్టర్లు పాటలను ముందుకు సాగకుండా చేసి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. పాటల్లో పాల్గొన్నవారి నోళ్లను నోట్ల కట్టలతో కట్టేసిన నాయకులు టెండర్లు దక్కించుకున్న అనంతరం వారికి నగదు పంచారు.

2016-17 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని రేవులకు ఈ నెల 2న పాటలు నిర్వహించగా మిగిలిపోయిన మూడు బల్లకట్టులు, ఆరు పడవ రేవులకు టెండర్లు స్వీకరణ, బహిరంగ వేలం నిర్వహించేందుకు అధికారులు సోమవారం తగిన ఏర్పాట్లు చేశారు. మాచవరం మండలంలోని గోవిందాపురం, దాచేపల్లి మండలంలోని రామాయగూడెం బల్లకట్టులకు మాత్రమే వేలంపాటలు జరిగాయి. గోవిందాపురం బల్లకట్టుకు ఉదయం 10 గంటల నుంచి టెండర్లు స్వీకరించారు. అనంతరం 12 గంటల నుంచి బహిరంగ వేలం నిర్వహించారు.

 తక్కువ ధరలకే....
జెడ్పీ డిప్యూటీ సీఈవో జి.జోసఫ్‌కుమార్, అక్కౌంట్స్ ఆఫీసర్ సిహెచ్.రవిచంద్రారెడ్డి, వివిధ విభాగాల పర్యవేక్షకులు జె.శోభారాణి, మహేష్, త్యాగరాజు, విజయ్‌కుమార్, సిబ్బంది కుమార్‌రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, మూర్తి, జి.శ్రీనివాస్ తదితరులు టెండర్లు, వేలం ప్రక్రియను నిర్వహించారు. గోవిందాపురం బల్లకట్టుకు జెడ్పీ పాటగా రూ.45 లక్షలుగా నిర్ణయించింది. 20 మంది వరకు పాటలో పాల్గొనేందుకు డిపాజిట్లు చెల్లించారు.

అమరావతి మండలం జూపూడికి చెందిన వై.రామకోటేశ్వరరావు రూ.45 లక్షల 30 వేలకు టెండరును దక్కించుకున్నారు. జెడ్పీ నిర్దేశించిన పాటకు కేవలం రూ.30 వేలు మాత్రమే పెంచి కాంట్రాక్ట్ దక్కించుకోవడం వెనుక చాలాతతంగమే నడిచింది. పాటలో పాల్గొన్న ఏ ఒక్కరూ కూడా నోరుమెదపకపోవడం గమనార్హం. తెలంగాణా రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జరిగిన వేలంపాటలో ఆ జిల్లావాసులు ఈ బల్లకట్టును రూ.65 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు. దానితోపోల్చితే ఇక్కడివాళ్లు రూ.15 లక్షల వరకు తక్కువకు పాడుకున్నారు.

రామాయగూడెం బల్లకట్టుకు 39 మంది డిపాజిట్లు:
దాచేపల్లి మండలం రామాయగూడెం బల్లకట్టుకు మధ్యాహ్నం 3 గంటల నుంచి బహిరంగ వేలం నిర్వహించారు. జెడ్పీ పాటగా రూ.31 లక్షలు నిర్ణయించారు. వేలంలో పాల్గొనేందుకు 39 మంది డిపాజిట్లు చెల్లించారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన ఎం.వెంకటేశ్వరరెడ్డి రూ.31 లక్షల 5 వేలకు బల్లకట్టును దక్కించుకున్నారు.  ఈ రెండు బల్లకట్టుల ద్వారా జెడ్పీకి రూ.76 లక్షల 35 వేలు ఆదాయం వచ్చింది. ఈనెల 2వ తేదీన వేలంపాటలు నిర్వహించగా తాడువాయి, మాదిపాడు, గింజుపల్లి, పుట్టపల్లి, వల్లభాపురం పడవ రేవులు మాత్రమే పూర్తయ్యాయి. అచ్చంపేట మండలంలోని చామర్రు, చింతపల్లి, మాదిపాడు(బల్లకట్టు), దాచేపల్లి మండలం రామాపురం, గురజాల మండలం దైద తదితర రేవులు వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement