చిత్తూరులోని కూరగాయల మార్కెట్
ప్రభుత్వ ఖజానాకు గండి కొడదామనుకున్న టీడీపీ కార్యకర్తల పాచిక పారలేదు. వీరికి అండగా నిలబడ్డ ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేసినప్పటికీ భంగపాటు తప్పలేదు. వేలంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు సిండికేట్ కావడంతో చిత్తూరు మార్కెట్ టెండర్ల వేలం వాయిదా పడింది. ఈనెల 15వ తేదీ మూడోసారి మరోమారు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
చిత్తూరు అర్బన్: చిత్తూరులో కూరగాయల మార్కెట్ల నుంచి రుసుము వసూలు చేసుకోవడానికి మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలం మరోమారు వాయిదా పడింది. గతనెల 6న సైతం వాయిదా పడ్డ టెండర్ల ప్రక్రియను అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో రెండోసారి కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. నగరంలో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకునేవారి నుంచి నామమాత్రపు రుసుము (గేటు) వసూలు చేసుకోవడానికి 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్కారువారి పాటను మునిసిపల్ కమిషనర్ ఓబులేసు రూ.65.22 లక్షలుగా నిర్ణయించారు. గత మూడేళ్ల మార్కెట్ టెండర్ల నుంచి సరాసరి ధరను నిర్ణయించడం టీడీపీ నేతలకు నచ్చలేదు. తమనే నమ్ముకున్న కార్యకర్తలకు ఉపాధి చూపిద్దామనుకుంటే ఇష్టానుసారం సర్కారి పాట నిర్ణయించడం ఏమిటని ఏకంగా మునిసిపల్ అధికారులనే నేతలు నిలదీశారు.
అయితే దీనిపై అధికారులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చేజేతులా ఉద్యోగానికే ప్రమాదం తెచ్చుకునే పనులు తాము చేయలేమంటూ అధికారులు నిక్కచ్చిగా తేల్చిచెప్పేశారు. నేతల ఆశీస్సులతో వేలానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు సిండికేట్ అయి వేలంలో పాల్గొనలేదు. వేలానికి సంబంధించిన టెండరు బాక్సు తెరచిచూడగా.. లోకనాధం నాయుడు, జయపాల్ నాయుడు ఇద్దరు మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. అదికూడా ఒకరు రూ.40 లక్షలకు, మరొకరు రూ.41 లక్షలకు టెండర్లు వేశారు. ఇది సర్కారు పాటకు చాలా తక్కువగా ఉండటంతో ఎవరికీ ఇవ్వలేమని, మునిసిపల్ ఖజానాకు నష్టం వాటిల్లే పనులు తాము చేయలేమని చెబుతూ టెండర్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ఓబులేసు ప్రకటించారు. ఇక రూ.8.26 లక్షల కనీస ధర నిర్ణయించిన ఎన్టీఆర్ బస్టాండుకు రూ.5 లక్షలు, రూ.1.57 లక్షలు నిర్ణయించిన జంతువధశాలకు రూ.85 వేలకు బాక్సు టెండర్లు వేయడంతో వీటిని కూడా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. అయితే గతేడాది తొమ్మిది నెలల పాటు గేటు వసూలు చేసుకునేందుకు నిర్వహించిన మార్కెట్ వేలంలో ఏకంగా రూ.90 లక్షలు పలకగా.. ఎన్టీఆర్ బస్టాండుకు రూ.15.27 లక్షలు, జంతువధశాల రూ.2.70 లక్షలు çపలకడం గమనార్హం! ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలే ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment