ఎక్సైజ్ దూకుడు
- 34 బెల్ట్ షాపులు సీజ్
- వేళలు పాటించని 18 షాపులపై కేసులు
- 46 మందిపై బైండోవర్ కేసులు
- 15 చోట్ల కొత్త చెక్‌పోస్టులు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. జిల్లాలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసేందుకు రాజకీయ వర్గాలు వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత పెరిగింది. నేతల ముఖ్య అనుచరులు మద్యం నిల్వ చేసే పనుల్లో బిజీగా వుండడంతో జిల్లా యంత్రాగం ఎక్సై జ్ శాఖను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఒడిశా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి మద్యం, నాటుసారా గిరిజన తండాలకు రవాణా కాకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ బృందాలను, కొత్తగా నియామకమైన సిబ్బందిని మరో 15 చోట్ల చెక్‌పోస్టుల్లో నియమించింది. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లను పల్లెలకు తరలించి అక్రమ మద్యం దుకాణాలపై సర్వే చేయిస్తున్నారు. అనధికారిక దుకాణాలు, సిండికేట్లు, బెల్ట్ షాపుల గుట్టును వీరితో అధికారులు సేకరిస్తున్నారని తెలిసింది. ఇటీవల 124 అక్రమ సారా కేసులు నమోదు చేసి 59 మందిని అరెస్టు చేశారు.
పాడేరు, చింతపల్లి, అరుకు, నర్సీపట్నం వంటి ప్రాంతాలతో బాటు విశాఖ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ దాడులను ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న 1720 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. 18 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ. లక్షల్లో అపరాధ రుసుం వసూలు చేశారు. అక్రమంగా మద్యాన్ని తరలించేవారు, గొడౌన్‌లలో భద్రపరిచేవారు, అక్రమంగా మద్యం అమ్మే అవకాశం ఉందనుకున్న పాత ముద్దాయిలందరిపై బైండోవర్ కేసులు నమోదు చేసేందుకు కూడా ఎక్సైజ్ శాఖ వెనకాడడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి నకిలీ మద్యం తీసుకొచ్చి ఎన్నికల వేళ సొమ్ము చేసుకుంటారన్న అనుమానంతో 46 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు.
గ్రామాల్లో అనధికారిక మద్యం దుకాణాలుగా చెలామణి అవుతోన్న 34 బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి వాటిని సీజ్ చేయడంతో బాటు వాటిని నిర్వహించే 34 మంది చోటా నేతలను అరెస్టు చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ టి. శ్రీనివాసరావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నిఘా బృందాలను నియమించామని దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. మద్యం దుకాణాలన్నీ ఉదయం 11 గంటలకు తెరచి రాత్రి 10 గంటలకల్లా మూసివేయకపోతే కేసులు బుక్ చేస్తామని తెలిపారు.