సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’ సోమవారం ఢిల్లీకి వెళుతోంది. ఆదివారం రాత్రి వరకు బిల్లు క్రోడీకరణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం సచివాలయంలో చర్చించి చిన్నచిన్న లోపాలను సరిదిద్దారు. డిసెంబర్ 12వ తేదీ రాత్రి రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి బిల్లు రాగా... దీనిపై జనవరి 30వ తేదీతో చర్చ ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో అసెంబ్లీ నుంచి బిల్లుకు సంబంధించి సభ్యుల ప్రసంగాలు, అభిప్రాయాల క్రోడీకరణ నివేదిక సచివాలయానికి చేరింది. అందులో పలు చోట్ల పెన్నుతో సరిదిద్దడం (కరెక్షన్) వంటివి ఉండడంతో.. దానిని మళ్లీ టైప్ చేయించి, వాటన్నిటిపై అసెంబ్లీ కార్యదర్శితో సంతకాలు తీసుకున్నట్లు తెలిసింది.
చేతి రాతతో చేసిన దిద్దుబాట్లను సచివాలయ అధికారులు సరిచేయవచ్చని అసెంబ్లీ వర్గాలు సూచించినప్పటికీ.. అందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంగీకరించలేదని సమాచారం. దీంతో ఆదివారం సాయంత్రం అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం సచివాలయానికి వచ్చి.. వాటిని టైప్ చేయించి, సంతకాలు చేశారు.
కాగా... శాసనసభ, మండలిలో సభ్యుల అభిప్రాయాలను క్రోడీకరించిన నివేదికతోపాటు అసెంబ్లీ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేర్వేరుగా కవరింగ్ లేఖలను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అందించనున్నారు. కేంద్రానికి ఏమేం పంపిస్తున్నారు? అసెంబ్లీలో చర్చల సరళి ఏమిటి? అనే అంశాలను సీఎస్ తన లేఖలో వివరించనున్నారు. ఈ లేఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తీసుకున్న తరువాతే ఢి ల్లీకి పంపించాలని మహంతి నిర్ణయించారు. కేంద్ర హోంశాఖతో పాటు మరికొందరికి ‘బిల్లు, క్రోడీకరణ’ల ప్రతులను పంపిస్తున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం 9.45 గంటలకు లేదా మధ్యాహ్నం తరువాత ప్రతులతోపాటు సభ్యుల అఫిడవిట్‌లు, సవరణ ప్రతిపాదనలను కూడా పంపనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు, డిప్యూటీ కార్యదర్శులు లలితాంబిక, రామరాజుతో పాటు మరో నలుగురు సెక్షన్ ఆఫీసర్లు వాటిని ఢిల్లీకి తీసుకువెళ్లనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ప్రకారం సోమవారం సాయంత్రంలోగా ఢిల్లీకి ఆ బిల్లును చేర్చాల్సి ఉందని తెలిపాయి. బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం ప్రతిని వేర్వేరుగా కేంద్రానికి పంపించనున్నారు.