రెండు విమానాల్లో హస్తినకు టీ బిల్లు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీ, శాసనమండలి లో జరిగిన చర్చల సరళి, సారాంశంతో పాటు సభ్యులు సమర్పించిన అఫిడవిట్లు, వారి అభిప్రాయాలు, సీఎం ప్రతిపాదించిన తీర్మానం ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం రెండు విమానాల్లో సోమవారం హస్తినకు పంపించింది. ఉదయం 6.10 గంటల విమానంలో ఈ బిల్లుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పేషీలో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు నేతృత్వంలో సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ కార్యదర్శి లలితాంబికతో పాటు మరో నలుగురు సెక్షన్ ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లారు.
రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లుతో పాటు సీఎస్ కవరింగ్ లేఖ, సభ్యులు ఉభయ సభల్లో సమర్పించిన అఫిడవిట్లు, క్లాజుల వారీగా ఇచ్చిన సవరణలను 13 బాక్సుల్లో తమ వెంట తీసుకువెళ్లారు. అలాగే ఉభయ సభలకు చెందిన ప్రొసీడింగ్స్, సభ్యులు చర్చ సందర్భంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ముఖ్యమంత్రి తీర్మానం ప్రతులను సాధారణ పరిపాలన శాఖ (హోం) డిప్యూటీ కార్యదర్శి రామరాజు నేతృత్వంలో ఉదయం 9.40 గంటల విమానంలో 20 బాక్సుల్లో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ ప్రతులన్నీ తెలుగు నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసినవి. వీటితో పాటు సీఎస్ ప్రధాన అంశాలపై ఉభయ సభల చర్చల సారాంశంతో ప్రత్యేకంగా రూపొందించిన మూడు పేజీల నివేదికనూ పంపించారు. ఉదయం ఏపీభవన్ చేరుకున్న నివేదిక ప్రతులను మధ్యాహ్నం ఢిల్లీలో హోంశాఖ సంయుక్త కార్యదర్శికి అధికారులు అందజేశారు. వీటిని కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి సోమవారం రాత్రి పంపించినట్టు తెలుస్తోంది.