తేలని సమ్మేటివ్-2 ఫలితాలు | T sammetiv -2 results | Sakshi
Sakshi News home page

తేలని సమ్మేటివ్-2 ఫలితాలు

Published Wed, Jan 28 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

తేలని సమ్మేటివ్-2 ఫలితాలు

తేలని సమ్మేటివ్-2 ఫలితాలు

నెల్లూరు (విద్య): జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో తాత్కాలిక పద్ధతులతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు మార్గాలు అన్వేషిస్తున్నారు. నవంబర్ నెలాఖరు వరకు పరీక్ష విధానం ఖరారు కాలేదు. దీంతో కొత్త సిలబస్‌ను మామూలుగా బోధించారు. పాత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారని తెలిసిన తర్వాత విద్యార్థులకు పరీక్షా పద్ధతితో బోధన ప్రారంభించారు. నిరంతర మూల్యాంకన విధానం ద్వారా విద్యార్థి ప్రగతిని అంచనా వేయడం వాస్తవ స్థితికి దూరంగా ఉందని చెప్పక తప్పదు.

పాఠశాలల పునఃప్రారంభం నుంచి 8 నెలలు గడిచిపోయింది. పరీక్షలు ముంచుకొస్తున్నాయి. ఈ సమయంలోనూ విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని విద్యాశాఖ అధికారులే తెలపడం గమనార్హం. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో సమ్మేటివ్-2 (ఆరు నెలల పరీక్షలు) నిర్వహించారు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఆ మూల్యాంకన వివరాలను తెలియజేయాల్సి ఉంది. అయితే ఆ సమాధాన పత్రాలను దుమ్ముదులిపిన ఛాయలు చాలా చోట్ల ఇంతవరకు కనిపించలేదు.

జిల్లాలోని సగానికిపైగా పాఠశాలల్లో సమ్మేటివ్ ఫలితాల వివరాలు అందుబాటులో లేవు. సమ్మేటివ్-1లో విద్యార్థులు డల్‌గా ఉంటారని సమ్మేటివ్-2లో కొంచెం మెరుగవుతారని, ప్రీ పబ్లిక్ నుంచి విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల మూడ్‌లోకి వస్తారని సమ్మేటివ్ ఫలితాలు అడిగితే ఉపాధ్యాయులు చెప్పే డొంకతిరుగుడు సమాధానాలు ఆశ్చర్యం కలిగించకమానవు.
 
జిల్లాలో 694 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 34,684 మంది విద్యార్థులు మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 16,790 మంది తెలుగు మీడియం, 17,890 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్నారు.
 
సమ్మెటివ్ మాటేమిటి..?
విద్యార్థుల నూతన సిలబస్ విధానంలో విద్యార్థుల ఆల్‌రౌండ్ డెవలప్‌మెంట్‌ను నిరంతరం ఉపాధ్యాయులు పర్యవేక్షించి కంటిన్యుయస్ కాంప్రెన్సివ్ ఎవల్యూషన్ (సీసీఈ) పద్ధతి ద్వారా అంచనా వేస్తారు. ఈ క్రమంలో సమ్మెటివ్-1 (మూడు నెలల పరీక్షలు), సమ్మెటివ్-2 (ఆరు నెలల పరీక్షలు) విద్యార్థుల ప్రగతి ఆయా ఉపాధ్యాయులకు, ఆయా పాఠశాలలకు మాత్రమే పరిమితమైంది. మండల స్థాయిలో, జిల్లాస్థాయిలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపే ప్రక్రియ, ఫార్మెట్ లేదు.

దీంతో ఆ పాఠశాలలకే బాగా చదివే విద్యార్థులు, వెనుకబడిన విద్యార్థుల సంఖ్య తెలుస్తోంది. 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను ఏ విధంగా సిద్ధం చేయాలనే అంశం ఆయా పాఠశాలలో ఆ సబ్జెక్టు చెప్పే ఉపాధ్యాయులకు మాత్రమే తెలిసే పరిస్థితి. ఈ క్రమంలో 40 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతుల వల్ల విద్యార్థులకు ముఖ్యంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని పాఠశాలల్లో ఆరు నెలల పరీక్షల పత్రాలను ఇంతవరకు మూల్యాంకనం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
 
సిలబస్ పూర్తికాని వైనం
సిలబస్‌ను డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే పాఠ్యపుస్తకాల్లో ఫిబ్రవరి వరకు సిలబస్‌ను పూర్తి చేయొచ్చని ఉండటంతో కొత్త సిలబస్‌కు పాత పరీక్షా విధానానికి పొంతన కుదరలేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ మారినప్పుడు టీచర్లకు పునరుశ్చరణ తరగతులను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంవత్సరంలో 8 నెలలు గడిచినా కొన్ని మండలాల్లో తూతూ మంత్రంగా ఈ తరగతులు నిర్వహించారనే ఆరోపణలున్నాయి.

హైస్కూల్‌లో 50 శాతం లోపు ప్రగతిపత్రాల(ప్రోగ్రస్ కార్డుల)ను ఇచ్చి ఉంటారని అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఆర్‌వీఎం ఆధ్వర్యంలో ప్రోగ్రస్ కార్డులు పాఠశాలలకు అందజేసేవారు. ప్రస్తుతం స్కూల్ గ్రాంట్‌లోనే ప్రగతి పత్రాలు అందజేయాల్సి ఉండటంతో కార్డులు కనుమరుగవుతున్నాయనేది ఉపాధ్యాయవర్గం తెలుపుతుంది. ప్రాథమిక పాఠశాలలో అసలు ఈ ప్రోగ్రస్ కార్డుల ఊసేలేదనే ప్రస్తుతం వినిపిస్తున్న వాదన.
 
అలాంటి ప్రక్రియ లేదు..:డీఈఓ ఆంజనేయులు
విద్యార్థుల మార్కులను జిల్లాస్థాయిలో మానిటరింగ్ చేసే ప్రక్రియ రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. ఏ పాఠశాలకు సంబంధించి ఆ పాఠశాలలోనే విద్యార్థుల ప్రగతి తెలుస్తుంది. ప్రగతి పత్రాల పరిస్థితి అంతే. మూల్యాంకనం చేయలేదని ఫిర్యాదులు వస్తే ఆ ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటాం. 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.

Advertisement

పోల్

Advertisement