ఖమ్మం/ఇల్లెందు : ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు రావాలి. అందుకోసం నూతన సిలబస్ ప్రవేశపెట్టాం. దీంతో బట్టీ విధానానికి స్వస్తి చెప్పి కృత్యాధార పద్ధతిలో బోధన జరుగుతుంది’ అని చెప్పిన ఉన్నతాధికారులు దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయడం లేదు. బోధనోపకరణాల కోనుగోలు, పాఠశాలల నిర్వహణ, ఇతర అవసరాలకు రావాల్సిన నిధుల జాడే లేదు.
ప్రతి ఏటా పాఠశాల ప్రారంభంలోనే ఇచ్చే ఈ నిధులు మూడు నెలలు గడిచినా రాకపోవడంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో బోధనోపకరణాలు కొనుగోలు చేసి పాఠాలు చెపుతుండగా, మరికొన్ని పాఠశాలల్లో మూస పద్ధతిలోనే బోధిస్తున్నారనే అరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు నిధులు విడుదల కాకపోవడంతో పాఠశాలలకు సున్నాలు వేయడం, ఇతర ఫర్నిచర్ మరమ్మతు, స్టేషనరీ కొనుగోలు కూడా చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పాఠశాలలో టీఎల్‌ఎం(బోధనోపకరణాలు) గ్రాంట్స్ కింద ఒక్కో ఉపాధ్యాయుడికి ఏడాదికి రూ.500, ముగ్గురు ఉపాధ్యాయులుంటే రూ.2 వేలు విడుదల చేస్తారు. ఈ నిధులతో ఉపాధ్యాయులు బోధనకు అవసరమయ్యే సామగ్రి, పలు రసాయనాలు కొనుగోలు చేసి బోధనోపకరణాలు తయారు చేసి విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కృత్యాల తయారీ, ఇతర వస్తువుల తయారీలో విద్యార్థులను భాగస్వాములను చేస్తే పాఠ్యాంశం చదవడం ద్వారా సాధించే లక్ష్యాలను సులువుగా అర్థం చేరుకుంటారని విద్యానిపుణులు చెపుతున్నారు.
ఈ నిధుల కింద 2011-12 విద్యా సంవత్సరానికి రూ. 45,63,500 విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఈ నిధుల విషయమే మర్చిపోయారు. అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం నాటికి భవనాలను సుందరంగా తయారు చేయాలని, బడిపండుగ కార్యక్రమంలో పాఠశాలకు సున్నాలు వేయడం, విరిగిపోయిన ఫర్నిచర్ మరమ్మతు చేయించి నూతన విద్యాసంవత్సరానికి స్వాగతం పలకాలి.
ఇందుకోసం మెయింటెనెన్స్ గ్రాంట్ కింద ఒక్కో పాఠశాలకు మూడు గదులు ఉంటే రూ. 5వేలు, అంతకంటే ఎక్కువ గదులు ఉంటే రూ.10 వేలు మంజూరు చేస్తారు. 2013-14 విద్యాసంవత్సరానికి రూ. 2,23,30,000 గత సంవత్సరం జులైలోనే అందజేశారు. ఇక నిర్వహణ ఖర్చుల కింద ప్రాథమిక పాఠశాలకు రూ. 5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 12 వేలు, ఉన్నత పాఠశాలకు రూ. 7 వేలు మంజూరు చేస్తారు. ఈ నిధులు గత విద్యాసంవత్సరంలో రూ. 2,04,47,000 జులై నెలలోనే విడుదల చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదు.
ఈ నిధులు పాఠశాలల పునఃప్రారంభం నాటికే అందజేస్తే తరగతి గదులకు సున్నాలు వేయించడం, రంగుల అలంకరణ, విద్యుదీకరణ వంటి పనులు పూర్తిచేసి పాఠశాలలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే అవకాశం ఉండేదని పలువురు ఉపాధ్యాయులు అం టున్నారు. ఈ ఏడాది ఇంతవరకూ ఈ నిధులు రాకపోవడంతో వాటికోసం వేచ్చి చూడాల్సి వస్తోందని, చేతిలో నయాపైసా లేకుంటే పాఠశాలల నిర్వహణ కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూసపద్ధతిలోనే బోధన..
బోధనోపకరణాల నిధులు మంజూరు చేయకపోవడంతో జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో మూస పద్ధతిలోనే బోధిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు గుణాత్మక విద్యను అందించాలని, పాఠశాల స్థాయినుంచే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవగాహన పెంపొందించాలని, అందుకోసం కృత్యాలు, బోధనోపకరణాలు, ప్రయోగాలు చేయించాలని విద్యానిపుణులు భావించారు.
దీనికి అనుగుణంగా సిలబస్‌లో కూడా మార్పు చేశారు. అయితే టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో పలువురు ఉపాధ్యాయుల తమ సొంత ఖర్చులతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అలా చేయలేని వారు పాత బోధనా పద ్ధతినే అవలంభిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి టీఎల్‌ఎం, స్కూల్ గ్రాంట్స్, మెయింటెనెన్స్ గ్రాంట్స్ విడుదల చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బో‘ధన’మేది..?
Published Sat, Sep 13 2014 1:52 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
Advertisement
Advertisement