పార్లమెంట్ చివరి సమావేశాలు ముగిసేందుకు మిగిలింది ఐదు రోజులే. సోమవారం నుంచి జరుగనున్న చివరి విడత సమావేశాలే తెలంగాణ భవితవ్యాన్ని తేల్చనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచి జిల్లా క్రియాశీల పాత్ర నిర్వహిస్తోంది. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో లోక్‌సభలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గట్టిగా తమ వాణిని వినిపించారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పాటు అంశం క్లైమాక్స్‌కు చేరుకున్న సందర్భంగా యావత్తు జిల్లా ప్రజల దృష్టి ఢిల్లీ మీదకు మళ్లింది.
సాక్షి, కరీంనగర్: జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, వివేకానంద సభలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలను నిలువరించడానికి గట్టిగా ప్రయత్నించారు. లగడపాటి ప్రయోగించిన పెప్పర్‌స్ప్రేతో పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నుంచి జరిగే సమావేశాల్లోనూ జిల్లా ఎంపీలు ఫ్లోర్ మేనేజ్‌మెంటులో కీలక పాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పరిణామాలను జిల్లా ప్రజలంతా ఉద్విగ్నంగా గమనిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్, విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, గంగుల కమలాకర్, నాయకులు బి.వినోద్‌కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించేందుకు అవసరమయిన మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లా జేఏసీ, ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులు హమీద్, నరసింహస్వామి, సుద్దాల రాజయ్య కూడా ఢిల్లీలోనే మకాం వేశారు. జాతీయ నాయకులను కలుస్తూ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు న్యాయవాదులు కూడా అక్కడే ఉండి తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం కూడా ఢిల్లీలోనే మకాం వేసి వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు.
ఢిల్లీలో ఎప్పడేం జరుగుతుందో... ఏ పార్టీ ఎప్పడు ఏ వైఖరి తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో తెలంగాణ భవితవ్యం మీద సందిగ్ధం నెలకొంది.
సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో సమైక్య ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల ప్రభావం తెలంగాణ అంశం మీద ఎలా ఉంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సమైక్య ఆందోళనల ప్రభావంతో తెలంగాణ వెనక్కి పోకుండా మరింత పట్టుదలతో కృషి చేయాలని తెలంగాణవాదులు భావిస్తున్నారు.
మంగళవారంగానీ, బుధవారంగానీ బిల్లు మీద చర్చ జరిగే అవకాశం ఉండడంతో ఈ రెండు రోజులే కీలకంగా మారాయి.
టీ-టెన్షన్
Published Mon, Feb 17 2014 3:59 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement