ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం తహశీల్దారుగా పనిచేస్తున్న కె.భవనమోహన్(59) శనివారం సాయంత్రం తన కార్యాలయంలోనే గుండెపోటుతో కన్ను మూశారు. దీర్ఘకాలంగా ఆయన లంగ్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ కార్యక్రమం ముగించుకొని సాయంత్రం కార్యాలయానికి చేరుకున్నారు. కాఫీ తెప్పించుకుని తాగుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుర్చీలోంచి వెనక్కు పడిపోతుండగా అక్కడే ఉన్న వీఆర్వో సీతారామస్వామి ఆయన్ను ఒడిసి పట్టుకున్నారు. తహశీల్దారు కార్యాలయ ఆవరణలో ఉన్న క్యాంప్ కార్యాలయంలోని గదికి తరలించి, వైద్యులను హుటాహుటిన తీసుకు వచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే కార్యాలయ సిబ్బంది సర్వేయర్ కాంతారావు తదితరులు కార్యాలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఎంపీడీఓ పి.రామకృష్ణ, పట్టణ ప్రముఖులు, వివిధ విభాగాల అధికారులు కార్యాలయానికి చేరుకొన్నారు.
సిబ్బంది వారిస్తున్నా...
తీవ్ర ఆనారోగ్యంగా ఉన్నప్పటికీ జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతున్న తహశీల్దారును సిబ్బంది వద్దని వారించినా ఆయన వినలేదు. రెండు మెట్లు ఎక్కితేచాలు విపరీతమైన ఆయాసం వచ్చేదని, విశ్రాంతి తీసుకోవాలని తాము కోరినా ప్రభుత్వ కార్యక్రమానికి ఎలా దూరంగా ఉంటామంటూ సున్నితంగా తిరస్కరించారని సర్వేయర్ కాంతారావు చెప్పారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు గత ఏడాదే వివాహం చేశారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం. టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని పరిశీలించారు. బౌతిక కాయాన్ని శ్రీకాకుళం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రముఖుల సంతాపం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇచ్చాపురం తహశీల్దారు కె.భువనమోహన్ ఆకస్మిక మృతి పట్ల జిల్లా నేతలు, అధికారులు సంతాపం తెలిపారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రవికుమర్, జిల్లా కలెక్టర్ పి.లక్ష్మినారాయణ, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ 2 పి.రజనీకాంతరావు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ఇంకా రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కాళీ ప్రసాద్, శ్రీకాంత్, ఎన్.వెంకట్రావు, జల్లెపల్లి రామారావు, శ్రీహరి తదితరులు కూడా సంతాపం తెలిపారు.
గుండెపోటుతో తహశీల్దారు మృతి
Published Sun, Jun 7 2015 12:15 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement