కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రానున్న లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మూడు సంవత్సరాల కాలాన్ని పూర్తిచేసిన అధికారులను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా నుంచి 45మంది తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే బదిలీపై వెళ్లనున్న తహశీల్దార్ల జాబితాను రూపొందించారు. అయితే కలెక్టర్ శశిధర్ హైదరాబాద్‌లో ఉండటంతో గురువారం ఆయన జిల్లా కేంద్రానికి చేరుకుని జాబితాను సీసీఎల్‌ఏకు పంపనున్నారు.
జాబితాను ఆమోదిస్తూ సీసీఎల్‌ఏ నుంచి వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా నుంచి బదిలీ అవుతున్న తహశీల్దార్లలో నలుగురు చిత్తూరు జిల్లాకు, 20 మంది అనంతపురం జిల్లాకు, 21మంది కర్నూలు జిల్లాకు వెళ్లనున్నారు. 48 మంది కొత్త తహశీల్దార్లు జిల్లాకు చేరుకోనున్నారు. వీరిలో 35మంది చిత్తూరు జిల్లా నుంచి, 13మంది కర్నూలు జిల్లా నుంచి రానున్నారు.
బదిలీల విషయంలో భార్యాభర్తలు,అనారోగ్యం, అసోసియేషన్ ఆఫీస్ బేరర్లకు అడిగిన చోటికి బదిలీ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కడపలోని పీబీసీ భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిణి, జిఎన్‌ఎస్‌ఎస్ భూసేకరణ విభాగం ఎస్‌డిసి చిన్నరాముడు, కోనేరు రంగారావు సిఫార్సుల అమలు కమిటీ డిప్యూటీ కలెక్టర్ ప్రకాశ్ జిల్లా నుంచి బదిలీ అయ్యేవారిలో ఉన్నట్లు తెలుస్తోంది.
తహశీల్దార్ల బదిలీకి రంగం సిద్ధం
Published Thu, Feb 6 2014 2:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement