బాబు ఆత్మరక్షణ యాత్ర | Take the tour's self-defense | Sakshi
Sakshi News home page

బాబు ఆత్మరక్షణ యాత్ర

Published Mon, Sep 2 2013 3:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Take the tour's self-defense

సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతున్న తరుణంలో జిల్లాలో చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర కాస్తా ఆత్మరక్షణయాత్రగా మారింది. విభజనకు అనుకూలమంటూ ఏ పరిస్థితుల్లో తాను లేఖ ఇచ్చిందీ తెలియజేసేందుకు చేపట్టిన ఈ యాత్ర జిల్లా నాయకులకు సవాలక్ష తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎక్కడ యాత్రకు అవరోధం కలుగుతుందోనన్న భయంతో బాబు ఆత్మరక్షణకోసమే ఎక్కువ తాపత్రయపడాల్సిన పరిస్థితులు దాపురించాయి. తొలిరోజు యాత్రలోనే జనం తనను సమర్థించే స్థితిలో లేరన్న వాస్తవం తేటతెల్లమయింది. ఆదినుంచీ యాత్ర వద్దని చెప్పిన జిల్లా నేతలు తమ నాయకునిపై మితిమీరిన విశ్వాసం పెంచుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల తమ అధినేత ప్రసంగాలు సీమాంధ్రులను కట్టిపడేస్తాయని పార్టీశ్రేణులు తలచారు.
 
 అదే ఊపుతో బస్సుయాత్ర అంగరంగ వైభవంగా జరిపించాలని ఏర్పాట్లు చేశారు. పల్నాడులోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో ప్రధాన రహదారుల్లో ఫ్లెక్సీలతో హడావుడి చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన బస్సుయాత్ర కాస్తా మధ్యాహ్నం 2.00 గంటలు దాటిపోయింది. ఆశించిన స్థాయిలో జనసమీకరణ జరగకపోవడమే దీనికి ప్రధాన కారణం. పర్యటనకు సీనియర్ పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కోడెల శివప్రసాద్, దూళిపాళ్ల నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు తదితరులు హాజరైనా.. జనసమీకరణ మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని చూసుకుంటారనుకున్నారు. 
 
 అయితే అనుకున్నదొకటి.. జరిగింది వేరొకటైంది. జనం లేకపోవడంపై అధినేత గెస్ట్‌హౌస్‌లోనే ఎక్కువసేపు ఉండిపోయారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దువద్దని చెప్పినా వినకుండా బస్సుయాత్రకని వచ్చి .. తీరా జనాల్లేరని తమను నిందించడం ఎంతవరకు సబబని తమలో తామే బాధపడినట్టు సమాచారం. దాచేపల్లి, పిడుగురాళ్ల, చిలకలూరిపేట నుంచి బస్సులు, లారీల్లో జనం అక్కడకు వచ్చినా .. బాబు ప్రసంగాలతీరుపై అధికశాతం మంది విసుగుచెంది వెనుదిరిగారు. యాత్రకు ఎక్కడ అవరోధంగా నిలుస్తారోనన్న భయంతో అనుమానితుల్ని బలవంతంగా యాత్రనుంచి బయటకు నెట్టేయడంతో వచ్చిన కొంతమంది కూడా భయంతో బిక్కచచ్చిపోయారు. ఎవరైనా అడ్డుపడితే వారి అంతు తేలుస్తామంటూ జిల్లా నాయకులు ఒకరిద్దరు చేసిన హెచ్చరికలు వారి ఆత్మవిశ్వాసంపైనే అనుమానాలు రేకెత్తించేలా చేశాయి. 
 
 హైదరాబాద్ అభివృద్ధి తనదేనంటూ బాబు గొప్పలు
 తొలిరోజు సభలన్నింట్లోనూ హైదరాబాద్ అభిృద్ధికి తానే కారకుడినంటూ తెగ గొప్పలు చెప్పారు బాబు. తీరా ఇప్పుడు విభజనవల్ల హైదరాబాద్ పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎన్‌డీఏ హయాంలో విభజనను అడ్డుకున్నది తానేనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విభజనకు అనుకూలంగా లేఖ ఎందుకు ఇచ్చారన్నది తెలియజేయలేకపోయారు. తెలుగువారి ఆత్మగౌరవానికి తన మామ ఎన్టీరామారావు చేసినకృషి ఏకరువు పెట్టారేగానీ, ఇప్పుడు తాను చేసిందేమిటో చెప్పలేదు. మొత్తమ్మీద ఆయనచేసిన ప్రసంగాలు ఎవరినీ ఆకట్టుకోలేకపోవడంతో యాత్రపై జిల్లా నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. 
 
 వేగంగా దూసుకెళ్తున్న బస్సు..
 చంద్రబాబు బస్సుయాత్ర గురజాల నియోజకవర్గం నుంచి ప్రారంభం కాగా, తొలిరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రానికే పొందుగుల, శ్రీనగర్, నారాయణపురం, దాచేపల్లి మీదుగా పిడుగురాళ్ల చేరింది. రాత్రికి అక్కడే బసచేసిన బాబు సోమవారం రెండోరోజు యాత్రను సత్తెనపల్లి నియోజకవర్గంలో కొనసాగించనున్నారు. బస్సులో కూర్చొని జనాలు ఉన్నచోట పైకివచ్చి అభివాదాలు చేయడం, ఒకటిరెండు చోట్ల మాత్రమే ప్రసంగాలివ్వడం చేస్తున్నారు. దీన్నిబట్టి యాత్ర షెడ్యూల్ చాలా వేగంగా జరగనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement