తాలిబన్ రాజ్యమిది!
‘జన్మభూమి-మాఊరు కమిటీల ఎంపికే అప్రజాస్వామికం. ఆ క మిటీలు అడ్డగోలుగా సిఫార్సులు చేస్తే ఆమోదిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యున్నతాధికారులను నిమిషాల వ్యవధిలో కలుస్తున్నాము. జిల్లా కలెక్టర్‌ను కలవాలంటే మాత్రం రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది ప్రజాస్వామ్యమో.. తాలిబన్ రాజ్యమో అర్థం కావడం లేదు’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.
సాక్షి ప్రతినిధి, కడప :జిల్లా కలెక్టర్ కేవీ రమణ తీరు ప్రజాప్రతినిధులను తీవ్ర అవమానాలకు గురిచేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, కడప ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప సభాభవన్‌లో బుధవారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఆ కమిటీ చైర్మన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కెవి రమణ అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో కలెక్టర్ భాగస్వామి అన్న విషయం మరచి ప్రవర్తిస్తున్నారని వాపోయారు.
రాజ్యంగ బద్ధంగా పొందిన హక్కులకు భంగం కల్గిస్తున్నార న్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం ప్రజాప్రతినిధులకు పిలుపు లేకుండా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలుగా కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన ఉండదని, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంలో భాగం కాదా.. అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నిలదీశారు. ఏకపక్షంగా వ్యవహరించే ముసుగులో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వాపోయారు. అధికారులు వ్యవస్థను నిర్వీర్యం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని తెలిపారు. ఆర్డీఓ చిన్నరాముడు స్వయంగా రేషన్ డీలర్ల ప్రశ్నపత్రాన్ని జవాబులతో సహా లీక్ చేస్తే ఎలాంటి చర్యలు లేవనన్నారు.
కలెక్టర్ దళిత ద్రోహిగా మారారు: ఎమ్మెల్యే జయరాములు
దళితులంటే కలెక్టర్ కెవి రమణకు చిన్నచూపు ఉందని, దళితుల సమస్యల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు విమర్శించారు. అట్టడుగు వర్గాల పట్ల కనీస మానవీయ దృష్టి లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసి చర్చించాలంటే ప్రజాప్రతినిధులకు ప్రహసనంగా మారిందన్నారు. ఎమ్మెల్సీగా గోవిందరెడ్డి ఎన్నికయ్యాక మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ను కలవాలని ఉదయం 10.30 గంటల నుంచి ప్రయత్నిస్తే సాయంత్రం 5 గంటలకు అవకాశం ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఛీకొడుతున్నా కుర్చీ పట్టుకొని వేలాడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రిమ్స్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో స్థానిక ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకుండా రాయచోటి, రాజంపేట ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారని కడప ఎమ్మెల్యే అంజాద్‌భాష ధ్వజమెత్తారు. కమిషనర్‌కు వద్దకు వెళ్లి కలవాలని కోరితే నిమిషాలపై అనుమతి ఇస్తున్నారని, కలెక్టర్ రమణను కలవాలంటే వారం రోజులు పడుతోందని మండిపడ్డారు. అధికారంలో లేకపోతే ప్రజాప్రతినిధులకు అవమానం తప్పడం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి వాపోయారు.
ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకుండా మాజీ ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు కలెక్టర్.. నీరు-చెట్టు కార్యక్రమంలో పాల్గొనడం చట్టవిరుద్ధమని ఘాటగా స్పందించారు. కలెక్టరే ప్రజాప్రతినిధులను, రాజ్యంగాన్ని గౌరవించకపోతే కింది స్థాయి అధికారులు ఎలా గౌరవిస్తారని ధ్వజమెత్తారు. ఆర్టీపీపీ సిఎస్‌ఆర్ ఫండ్స్ వినియోగంలో కలెక్టర్ అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారని, అది కలెక్టర్ జాగీరు కాదన్న విషయాన్ని గ్రహించాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
ప్రజలచేత ఎన్నికైన వారి పట్ల నిర్లక్ష్యం చూపడం తీవ్రమైన నేరమని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. తాగునీటి నిధుల కేటాయింపుల్లోనూ నిర్లక్ష్యం చూపడం ఏమాత్రం సబబు కాదన్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, జిల్లా యంత్రాంగం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని జెడ్పీ చైర్మన్ రవి వాపోయారు.
కాగా ప్రజాప్రతినిధులు ఓవైపు ప్రశ్నలు సంధిస్తూ, నిలదీస్తున్నా జవాబు ఇచ్చేందుకు ఈ సమావేశం వేదిక కాదంటూ కలెక్టర్ కెవి రమణ పలు పర్యాయాలు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన పలు అభ్యంతరాలపై విచారణ చేయిస్తామని, తప్పులుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజల కోసమే హాజరవుతున్నాం: వైఎస్ అవినాష్‌రెడ్డి
జిల్లాలో కొంత మంది అధికారుల తీరు బాధిస్తున్నా, ప్రజల సమస్యల కోసమే ఇలాంటి సమావేశాలకు హాజరవుతున్నామని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వాపోయారు. చక్రాయపేట మండలంలో 19 చెక్‌డ్యాంలు నిర్మాణ ం కోసం అగ్రిమెంట్లు ఉంటే అధికారులు మార్కింగ్ ఇవ్వడం లేదని, గ్రామపంచాయితీల తీర్మానం ఉన్నా నిర్లక్ష్యం చూపుతున్నార న్నారు. సిబ్బంది అలసత్వంపై ఎస్‌ఈగా మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరేమి చర్యలు తీసుకున్నారని ఎస్‌ఈని నిలదీశారు. జవాబు చెప్పలేని స్థితిలో ఎస్‌ఈ నీళ్లు నమిలారు. మీ ధోరణి ఇలా ఉంటే కలెక్టర్ తీరు మరింత భిన్నంగా ఉందన్నారు. తన నిధుల నుంచి అధిక శాతం తాగునీటికి వెచ్చిస్తుంటే అనుమతి కోసం నెలల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
నిబంధనల పేరుతో కాలయాపన చేయడం తగదని, నిధుల అనుమతికి సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ మానిటరింగ్ కమిటీ చైర్మన్‌గా కడప ఎంపీని, కో చైర్మన్‌గా రాజంపేట ఎంపీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను నేషనల్ హెల్త్ మిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చి తమను అవమానపర్చారన్నారు.
ఒక్క వైఎస్సార్ జిల్లా కోసమే ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. అవమానాలతో సమావేశానికి రాకుడదనుకున్నా, ప్రజల కోసం, ప్రజాసమస్యల పరిష్కారం కోసం హాజరయ్యామని తెలిపారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా టీడీపీకి కొమ్ము కాస్తోందని, అధికారులు ఇబ్బంది పడితే కాపాడే మనస్థత్వం సీఎంకు లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీయార్ లాంటి మహోన్నత వ్యక్తికే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
పెన్షన్ల మంజూరులో అధికారులతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారని, లొసుగులకు జన్మభూమి కమిటీ బాధ్యత వహిస్తుందా అని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధారాలతో సహా నిలదీశారు. కలెక్టర్, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తుదకు అధికారులు సైతం ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారి ధోరణిలో మార్పులేదని వివరించారు.