దయనీయంగా దర్జీల జీవితం | Talior business becameing low | Sakshi
Sakshi News home page

దయనీయంగా దర్జీల జీవితం

Published Fri, Feb 28 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

Talior business becameing low

విడవలూరు/ గూడూరు టౌన్/  కోట, న్యూస్‌లైన్: ‘ఏరా పండక్కి కొత్త బట్టలు కుట్టించుకున్నావా. ఇంకా లేదా. టైలర్ రాము దగ్గరకెళ్లి నీ ఆల్తి బట్టలివ్వు. పండగొచ్చేస్తుంది. వాళ్లు మళ్లీ బిజీ అయిపోతారు’ ఇవి గతంలో విన్పించే మాటలు. పండగైనా, శుభకార్యమైనా ప్రతి ఇంట్లో అందరూ టైలర్(ద ర్జీ) వద్ద కొత్త దుస్తులు కుట్టించుకునే వారు. ఇదంతా పదేళ్ల క్రితం నాటి హడావుడి. ప్రస్తుతం కాలం మారింది. మార్కెట్‌ను ముంచెత్తుతున్న రెడిమేడ్ దుస్తులపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో టైలర్లకు ఆదరణ కరువవుతోంది.
 
  ఈ క్రమంలో ఎప్పుడూ బిజీగా ఉండే టైలర్లు పండగలు, శుభకార్యాల సీజన్‌లోనూ చేతి నిండా పనిలేక దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఏరోజుకారోజు అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు రెడిమేడ్ దుస్తుల దుకాణాలను ఆశ్రయిస్తుండటంతో టైలర్లకు ఏడాదిలో మూడు నెలలు కూడా పని దొరకని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఎక్కువ మంది నమ్ముకున్న వృత్తిని వదులుకోలేకపోవడంతో ఉన్నవారిలో పోటీ పెరిగింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా దుస్తులు కుడుతున్న వారికే ఆదరణ లభిస్తోంది.

 బూట్‌కట్, పెన్సిల్ కట్ అని యువత కోరినవిధంగా దుస్తులు కుట్టిన వారికే పని దొరుకుతోంది. ఈ క్రమంలో పల్లెల్లోని టైలర్ల పరిస్థితి దారుణంగా మారింది. పల్లెల్లో ఎక్కువ మంది మహిళలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఆధునిక పోకడలకు అనుగుణంగా మహిళా దుస్తులు కుడుతున్న వారికి ఆదరణ లభిస్తోంది. నెల్లూరు, గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాళెం, కోట, కోవూరు తదితర ప్రాం తాల్లో మహిళల దుస్తులు కుట్టే టైలర్లు కొంతమేర ఆదరణ పొందుతున్నారు. మొత్తం మీద జిల్లాలో సుమారు 13,500 మంది టైలర్లు ఉన్నారు.
 
 
 వీరిలో సగం మందికి కూడా చేతి నిండా పని దొరకని పరిస్థితి. ఏళ్ల తరబడి మిషన్లకే పరిమితం కావడంతో కొందరు దృష్టి లోపం, కీళ్ల నెప్పుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరి గోడును పట్టించుకునే పాలకులు కరువయ్యారు. మహానేత  డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టైలర్ల సమస్యలను గుర్తిం చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేలోపే ఆయన మృతిచెందడంతో టైలర్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికైనా పాలకులు తమ సంక్షేమంపై దృష్టిపెట్టాలని టైలర్లు కోరుతున్నారు.
 
 ప్రభుత్వం స్పందించాలి
 పూర్తిగా ఆదరణ కోల్పోతున్న మా సంక్షేమంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రెడిమేడ్ దుస్తుల కారణంగా మేము జీవనాధారం కోల్పోతున్నాం. ఇప్పటికైనా పాలకులు స్పందించి మాకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలి.
 శ్రీనివాసులు
 (టైలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు)
 
 పని కరువైంది
 ఇటీవల కాలంలో మా వద్ద దుస్తులు కుట్టించుకునే వారు తగ్గిపోయారు. గతంలో కళకళలాడిన దుకాణాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. పనులు లేకపోవడంతో కొందరినే పనికి రమ్మంటున్నా. మిగిలిన మిషన్లు ఖాళీగా ఉంటున్నాయి.
 మల్లికార్జున్, టైలర్, గూడూరు
 
 మోడల్ టైలరింగ్‌కే గిరాకి
 నేను 30 ఏళ్లుగా టైలరింగ్‌తో ఉపాధి పొందుతున్నా. అప్పట్లో చీరలకు అంచు,ఫాల్స్‌తో పాటు జాకెట్లు కుట్టేవాళ్లం. ఇప్పుడు వర్క్‌శారీస్ అంటూ మహిళలు ప్రత్యేకత కనబరుస్తున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దుస్తులు కుడితేనే ఆదరిస్తున్నారు.
 గుణ, టైలరింగ్ శిక్షకురాలు, కోట
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement