తాండవ టీడీపీ కైవసం
తాండవ టీడీపీ కైవసం
Published Wed, Jun 25 2014 1:30 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
తుని : తాండవ సుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ ప్యానల్ విజయం సాధించింది. వైఎస్సార్ సీపీ గట్టి పోటీ ఇచ్చింది. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలోని తాండవ సుగర్ ఫ్యాక్టరీకి మంగళవారం ఉదయం ఎన్నిక జరిగింది. మొత్తం 15 సెగ్మెంట్లకు గాను నాలుగు ఏకగ్రీవం కాగా 11 సెగ్మెంట్లకు ఎన్నిక జరిగింది. సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. పది స్థానాలు రైతులు, ఒక వర్కుమేన్ డెరైక్టర్‌ను కార్మికులు ఎన్నుకున్నారు. ఫ్యాక్టరీ పరిధిలో తుని, ప్రత్తిపాడు, పాయకరావు పేట, నర్సీపట్నం నియోజకవర్గాలున్నాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగు ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం ఫ్యాక్టరీ ఆవరణలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 4,180 మంది రైతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వర్కుమేన్ డెరైక్టర్‌కు 70 మంది కార్మికులు ఓట్లు వేశారు. పాయకరావు పేట, పీఆర్. పురం, ఎస్‌బీ పేట, ఎన్‌ఎస్‌వీ నగరం, పాత కొట్టాం, కోటనందూరు, గుమ్మిడి కొండ, నర్సీపట్నం సెగ్మెంట్లలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. గిడజాం, బొద్దవరం సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. డి. పోలవరం, ఎస్‌ఆర్. పేట, కొడవటి పూడి, చిన బొడ్డేపల్లి సెగ్మంట్లు ఏకగ్రీవం అయిన సంగతి విదితమే. టీడీపీ చైర్మన్ అభ్యర్థి సుర్ల లోవరాజు డి. పోలవరం సెగ్మెంట్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. కొడవటి పూడి అనాల సత్యనారాయణ (టీడీపీ), ఎస్‌ఆర్. పేట లాలం బాబ్జి (వైఎస్సార్ సీపీ), చిన్న బొడ్డేపల్లి అల్లూరి సూర్యనారాయణ రాజు (వైఎస్సార్ సీపీ)లు ఏకగ్రీవంగా గెలిచారు.
పాయకరావుపేట సెగ్మెంట్ నుంచి కంద నూకరాజు (టీడీపీ) 24 ఓట్లతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగం వెంకట వాసు దొరప్పపై విజయం సాధించారు. పీఆర్ పురం సెగ్మెంట్‌లో మందపాటి శ్రీనివాసరాజు చెక్కల వెంకటరమణపై 87 ఓట్ల మెజార్టీ సాధించారు. గిడజాం సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బలిజి సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి కాట్రెడ్డి రాంబాబుపై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎస్‌బీ పేట సెగ్మెంట్‌లో బీమిశెట్టి నాగేశ్వరరావు (టీడీపీ) వేగి తులసీరావుపై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్‌ఎస్‌వీ నగరం నుంచి పోటీ చేసిన మోర్త కృష్ణ (టీడీపీ) చిట్టిమూరి సత్యనారాయణపై వంద ఓట్ల మెజార్టీ సాధించారు. పి. కొట్టాం సెగ్మెంట్‌లో సాలాది దేముడు (టీడీపీ) తొలెం రాజులుపై మూడు ఓట్ల తేడాతో గెలిచారు.
గుమ్మిడి కొండలో కురపల్లి పోతురాజు (టీడీపీ) రేగాటి సత్తిబాబుపై 13 ఓట్ల మెజార్టీ సాధించారు. నర్సీపట్నంలో కలిమి శ్రీను (టీడీపీ) కొరుప్రోలు కన్నయ్యనాయుడుపై 13 ఓట్ల మెజార్టీని సాధించారు. కోటనందూరులో కోరుప్రోలు నాగేశ్వరరావు (టీడీపీ) గొర్లి జగ్గునాయుడుపై 15 ఓట్ల మెజార్టీ సాధించారు. బొద్దవరంలో యల్లపు రమణ (వైఎస్సార్ సీపీ) వేగి గౌరినాయుడుపై 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వర్కుమేన్ డెరైక్టర్ కొల్లు సురేంద్రకుమార్ 21 తేడాతో కర్రి వెంకటేశ్వరరావుపై గెలుపొందినట్టు ఎన్నికల అధికారి మోషే ప్రకటించారు.
నేడు పాలకవర్గం సమావేశం
తాండవ సుగర్ ఫ్యాక్టరీ పాలకవర్గం సమావేశం బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి మోషే మంగళవారం తెలిపారు. ఎన్నికైన 15 మంది డెరైక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరుకావాలని నోటీసులను అందజేశారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సుర్ల లోవరాజును ప్రకటించిన సంగతి విదితమే. నూతనంగా ఎన్నికైన డెరైక్టర్లను ఫ్యాక్టరీ ఎండీ ఎస్. నాయుడు, ఎన్నికల అధికారి మోషే, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యనమల కృష్ణుడు అభినందించారు.
Advertisement
Advertisement