Tandava sugar factory
-
అప్పుల తాండవం
తుని : మూడు నియోజకవర్గాలకు చెందిన రైతులకు అన్నం పెడుతున్న తాండవ సుగర్ ఫ్యాక్టరీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా నష్టాలు పెరగడంతో సంబంధిత యాజమాన్యం రైతులకు ప్రోత్సాహకాలను కల్పించలేకపోతున్నాయి. సరఫరా చేసిన చెరకుకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేక అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోతున్నారు. తూర్పు–విశాఖ జిల్లాల పరిధిలో ఉన్న తాండవ సుగర్ ఫ్యాక్టరీ రూ.40 కోట్ల నష్టంలో ఉంది. భవిష్యత్‌లో లాభాలు వచ్చే అవకాశం లేక పోగా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా చెరకుకు మద్దతు ధర లేక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకు పోతున్నారు. దీంతో చాలా మంది చెరకు సాగుకు స్వస్తి పలికారు. రైతులకు బకాయిలు రూ.10 కోట్లు: 2017–18 సీజన్లో లక్ష టన్నుల మేర చెరకు క్రషింగ్ చేశారు. టన్నుకు మద్దతు ధర రూ.2,558 ప్రకటించారు. ఫ్యాక్టరీ పరిధిలో 4 వేల మంది రైతులు చెరకు సరఫరా చేశారు. వీరికి చివరి చెల్లింపు రూ.10 కోట్ల వరకు చెల్లించాలి. సహజంగా సీజన్ ముగిసే నాటికి రైతులకు సొమ్ము చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పు కోసం ప్రయత్నిస్తోంది. అప్కాబ్‌కు రూ.7.5 కోట్లు రుణం కోసం పత్రాలను సమర్పించారు. దీంతో పాటు కార్మికులకు వేతనం రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. వచ్చే ఏడాది క్రషింగ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు తదితర వాటికి రూ.4 కోట్లు మేర అవసరం. ఫ్యాక్టరీలో 95 వేల బస్తాల పంచదారనిల్వలు ఉన్నాయి. వీటిని అమ్ముకోవడానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం నెలకు 9,902 బస్తాలను మార్కెట్‌కు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. బస్తా పంచదార తయారీకి రూ.3800లు ఖర్చు అవుతుండగా, మార్కెట్లో బస్తాకు రూ.3200లు వస్తుంది. దింతో బస్తాకు రూ.600 మేర నష్టం వస్తోంది. తగ్గుతున్న చెరకు సాగు : గతంలో 2 లక్షల టన్నుల క్రషింగ్ చేయడానికి అవసరమైన చెరకును రైతులు పండించేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక రైతులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వక పోవడంతో సాగు తగ్గిపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం ఫ్యాక్టరీలపై భారం లేకుండా టన్నుకు రూ.300లు ప్రోత్సాహాన్ని అందించింది. గడిచిన నాలుగేళ్లలో 2500 ఎకరాల్లో చెరకు సాగు చేయలేదు. అసలే టన్నుకు ఇచ్చే మద్దతు ధర అంతంత మాత్రమే, సకాలంలో చెల్లింపులు చేయకపోవడం తదితర కారణాలతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. 2018–19 సీజన్లో లక్ష టన్నులు క్రషింగ్ జరుగుతుందని యాజమాన్యం అంచనా వేస్తున్నారు. వేతనాలు లేవు ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. రెండేళ్ల బోనస్ ఇవ్వలేదు. పర్మనెంట్, సీజనల్, ఎన్‌ఎంఆర్‌లు కలిపి సుమారు 300 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులకు రూ.కోటి వరకూ బకాయిలు ఉన్నాయి. యాజమాన్యాన్ని అడిగితే నష్టాల్లో ఉందని చెబుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకువస్తున్నాం.–దేవవరపు నారాయణ స్వామి, కార్మిక యూనియన్ కార్యదర్శి -
తాండవ టీడీపీ కైవసం
తుని : తాండవ సుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ ప్యానల్ విజయం సాధించింది. వైఎస్సార్ సీపీ గట్టి పోటీ ఇచ్చింది. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల పరిధిలోని తాండవ సుగర్ ఫ్యాక్టరీకి మంగళవారం ఉదయం ఎన్నిక జరిగింది. మొత్తం 15 సెగ్మెంట్లకు గాను నాలుగు ఏకగ్రీవం కాగా 11 సెగ్మెంట్లకు ఎన్నిక జరిగింది. సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. పది స్థానాలు రైతులు, ఒక వర్కుమేన్ డెరైక్టర్‌ను కార్మికులు ఎన్నుకున్నారు. ఫ్యాక్టరీ పరిధిలో తుని, ప్రత్తిపాడు, పాయకరావు పేట, నర్సీపట్నం నియోజకవర్గాలున్నాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగు ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం ఫ్యాక్టరీ ఆవరణలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మొత్తం 4,180 మంది రైతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వర్కుమేన్ డెరైక్టర్‌కు 70 మంది కార్మికులు ఓట్లు వేశారు. పాయకరావు పేట, పీఆర్. పురం, ఎస్బీ పేట, ఎన్ఎస్వీ నగరం, పాత కొట్టాం, కోటనందూరు, గుమ్మిడి కొండ, నర్సీపట్నం సెగ్మెంట్లలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. గిడజాం, బొద్దవరం సెగ్మెంట్లలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచారు. డి. పోలవరం, ఎస్ఆర్. పేట, కొడవటి పూడి, చిన బొడ్డేపల్లి సెగ్మంట్లు ఏకగ్రీవం అయిన సంగతి విదితమే. టీడీపీ చైర్మన్ అభ్యర్థి సుర్ల లోవరాజు డి. పోలవరం సెగ్మెంట్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. కొడవటి పూడి అనాల సత్యనారాయణ (టీడీపీ), ఎస్ఆర్. పేట లాలం బాబ్జి (వైఎస్సార్ సీపీ), చిన్న బొడ్డేపల్లి అల్లూరి సూర్యనారాయణ రాజు (వైఎస్సార్ సీపీ)లు ఏకగ్రీవంగా గెలిచారు. పాయకరావుపేట సెగ్మెంట్ నుంచి కంద నూకరాజు (టీడీపీ) 24 ఓట్లతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగం వెంకట వాసు దొరప్పపై విజయం సాధించారు. పీఆర్ పురం సెగ్మెంట్లో మందపాటి శ్రీనివాసరాజు చెక్కల వెంకటరమణపై 87 ఓట్ల మెజార్టీ సాధించారు. గిడజాం సెగ్మెంట్ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బలిజి సత్యనారాయణ టీడీపీ అభ్యర్థి కాట్రెడ్డి రాంబాబుపై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎస్బీ పేట సెగ్మెంట్లో బీమిశెట్టి నాగేశ్వరరావు (టీడీపీ) వేగి తులసీరావుపై రెండు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎన్ఎస్వీ నగరం నుంచి పోటీ చేసిన మోర్త కృష్ణ (టీడీపీ) చిట్టిమూరి సత్యనారాయణపై వంద ఓట్ల మెజార్టీ సాధించారు. పి. కొట్టాం సెగ్మెంట్లో సాలాది దేముడు (టీడీపీ) తొలెం రాజులుపై మూడు ఓట్ల తేడాతో గెలిచారు. గుమ్మిడి కొండలో కురపల్లి పోతురాజు (టీడీపీ) రేగాటి సత్తిబాబుపై 13 ఓట్ల మెజార్టీ సాధించారు. నర్సీపట్నంలో కలిమి శ్రీను (టీడీపీ) కొరుప్రోలు కన్నయ్యనాయుడుపై 13 ఓట్ల మెజార్టీని సాధించారు. కోటనందూరులో కోరుప్రోలు నాగేశ్వరరావు (టీడీపీ) గొర్లి జగ్గునాయుడుపై 15 ఓట్ల మెజార్టీ సాధించారు. బొద్దవరంలో యల్లపు రమణ (వైఎస్సార్ సీపీ) వేగి గౌరినాయుడుపై 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వర్కుమేన్ డెరైక్టర్ కొల్లు సురేంద్రకుమార్ 21 తేడాతో కర్రి వెంకటేశ్వరరావుపై గెలుపొందినట్టు ఎన్నికల అధికారి మోషే ప్రకటించారు. నేడు పాలకవర్గం సమావేశం తాండవ సుగర్ ఫ్యాక్టరీ పాలకవర్గం సమావేశం బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి మోషే మంగళవారం తెలిపారు. ఎన్నికైన 15 మంది డెరైక్టర్లకు ధ్రువీకరణ పత్రాలు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరుకావాలని నోటీసులను అందజేశారు. టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సుర్ల లోవరాజును ప్రకటించిన సంగతి విదితమే. నూతనంగా ఎన్నికైన డెరైక్టర్లను ఫ్యాక్టరీ ఎండీ ఎస్. నాయుడు, ఎన్నికల అధికారి మోషే, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు యనమల కృష్ణుడు అభినందించారు. -
‘తాండవ’ ఎన్నికలు నేడు
నలుగురు డెరైక్టర్లు ఏకగ్రీవం 11 సెగ్మెంట్లకు పోటీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ సాయంత్రం ఓట్ల లెక్కింపు పాయకరావుపేట: తాండవ చక్కెర కర్మాగారం పాలక వర్గం ఎన్నికలు మంగళవారం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫ్యాక్టరీ పరిధిలో 15 డెరైక్టర్ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. కొడవటిపూడి సెగ్మెంట్‌కు ఆనాల సత్యనారాయణ, డి.పోలవరం సెగ్మెంట్‌కు సుర్లలోవరాజు, చినబొడ్డేపల్లికి అల్లూరి సూర్యనారాయణరాజు,ఎస్ఆర్పేటకు లాలం బాబ్జీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 11నియోజకవర్గాల డెరైక్టర్ పదవులకు 23 మంది బరిలో ఉన్నారు. పాయకరావుపేట సెగ్మెంట్‌కు కంద నూకరాజు,నాగం వెంకటవాసు దొరప్ప,పెదరామభద్రపురానికి మందపాటి శ్రీనివాసరాజు, చెక్కల వెంకటరమణ,గిడజాంకు కాట్రెడ్డి రాంబాబు,బలిజ సత్యన్నారాయణ, పి.రామకృష్ణ, కోటేశ్వరరావు,సుబద్రయ్యమ్మపేటకు బి. నాగేశ్వరరావు, వేగి తులసీరావు, ఎన్.ఎస్. వెంకటనగరానికి చిట్టుమూరి సత్యన్నారాయణ,మోర్త కృష్ణ,పి.కొట్టాంకు తోలెం రాజులు, సాలాది దేముడు, గుమ్మిడిగొండకు కురపల్లి పోతురాజు, రేగాటి సత్తి బాబు, నర్సీపట్నానికి కలిమి శ్రీను, కె,కన్నయ్యనాయుడు, కోటనందూరుకు కె.నాగేశ్వరరావు,జి. జగ్గునాయుడు, బొద్దవరానికి యల్లపు రమణ,వేగి గౌరినాయుడు, వర్క్‌మెన్ గ్రూపు నుంచి కర్రి వెంకటేశ్వరరావు, కొల్లు సురేంద్ర కుమార్ డైరక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాలివే.... 11సెగ్మెంట్ల డెరైక్టర్ల ఎన్నికకు 4వేల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బి. మోషా తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను ప్యాక్టరీ ఆవరణకు తరలించాక లెక్కింపు చేపడతారు.