పాయకరావుపేటలోని తాండవ సుగర్ ఫ్యాక్టరీ
తుని : మూడు నియోజకవర్గాలకు చెందిన రైతులకు అన్నం పెడుతున్న తాండవ సుగర్ ఫ్యాక్టరీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా నష్టాలు పెరగడంతో సంబంధిత యాజమాన్యం రైతులకు ప్రోత్సాహకాలను కల్పించలేకపోతున్నాయి. సరఫరా చేసిన చెరకుకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేక అనుకున్న లక్ష్యానికి చేరుకోలేకపోతున్నారు. తూర్పు–విశాఖ జిల్లాల పరిధిలో ఉన్న తాండవ సుగర్ ఫ్యాక్టరీ రూ.40 కోట్ల నష్టంలో ఉంది. భవిష్యత్‌లో లాభాలు వచ్చే అవకాశం లేక పోగా తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లించే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా చెరకుకు మద్దతు ధర లేక పోవడంతో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకు పోతున్నారు. దీంతో చాలా మంది చెరకు సాగుకు స్వస్తి పలికారు.
రైతులకు బకాయిలు రూ.10 కోట్లు: 2017–18 సీజన్‌లో లక్ష టన్నుల మేర చెరకు క్రషింగ్ చేశారు. టన్నుకు మద్దతు ధర రూ.2,558 ప్రకటించారు. ఫ్యాక్టరీ పరిధిలో 4 వేల మంది రైతులు చెరకు సరఫరా చేశారు. వీరికి చివరి చెల్లింపు రూ.10 కోట్ల వరకు చెల్లించాలి. సహజంగా సీజన్ ముగిసే నాటికి రైతులకు సొమ్ము చెల్లించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పు కోసం ప్రయత్నిస్తోంది. అప్కాబ్‌కు రూ.7.5 కోట్లు రుణం కోసం పత్రాలను సమర్పించారు. దీంతో పాటు కార్మికులకు వేతనం రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంది. వచ్చే ఏడాది క్రషింగ్ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు తదితర వాటికి రూ.4 కోట్లు మేర అవసరం. ఫ్యాక్టరీలో 95 వేల బస్తాల పంచదారనిల్వలు ఉన్నాయి. వీటిని అమ్ముకోవడానికి అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం నెలకు 9,902 బస్తాలను మార్కెట్‌కు విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. బస్తా పంచదార తయారీకి రూ.3800లు ఖర్చు అవుతుండగా, మార్కెట్‌లో బస్తాకు రూ.3200లు వస్తుంది. దింతో బస్తాకు రూ.600 మేర నష్టం వస్తోంది.
తగ్గుతున్న చెరకు సాగు : గతంలో 2 లక్షల టన్నుల క్రషింగ్ చేయడానికి అవసరమైన చెరకును రైతులు పండించేవారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక రైతులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇవ్వక పోవడంతో సాగు తగ్గిపోయింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం ఫ్యాక్టరీలపై భారం లేకుండా టన్నుకు రూ.300లు ప్రోత్సాహాన్ని అందించింది. గడిచిన నాలుగేళ్లలో 2500 ఎకరాల్లో చెరకు సాగు చేయలేదు. అసలే టన్నుకు ఇచ్చే మద్దతు ధర అంతంత మాత్రమే, సకాలంలో చెల్లింపులు చేయకపోవడం తదితర కారణాలతో రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. 2018–19 సీజన్‌లో లక్ష టన్నులు క్రషింగ్ జరుగుతుందని యాజమాన్యం అంచనా వేస్తున్నారు.
వేతనాలు లేవు
ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. రెండేళ్ల బోనస్ ఇవ్వలేదు. పర్మనెంట్, సీజనల్, ఎన్‌ఎంఆర్‌లు కలిపి సుమారు 300 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులకు రూ.కోటి వరకూ బకాయిలు ఉన్నాయి. యాజమాన్యాన్ని అడిగితే నష్టాల్లో ఉందని చెబుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకువస్తున్నాం.–దేవవరపు నారాయణ స్వామి, కార్మిక యూనియన్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment