తాండూరు, న్యూస్‌లైన్: తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి (బ్లడ్‌బ్యాంకు) ఏర్పాటు చేస్తామని ఎనిమిది నెలల క్రితం సీఎం కిరణ్ చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోవడంలేదు. దీంతో రక్తనిధి హుళక్కేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది. ఇందులో భాగంగా గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాండూరు పర్యటనలో జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. సీఎం ప్రకటన చేసి 8 నెలలు దాటినా ఇంత వరకూ రక్తనిధి అందుబాటులోకి రాలేదు. ఈ ఆలస్యానికి వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులు శ్రద్ధ కనబర్చకపోవడమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గర్భిణులకు, క్షతగాత్రులకు సహాయకారి..
200 పడకలున్న జిల్లా ఆస్పత్రిలో కాన్పుల కోసం నెలకు సుమారు 200 మంది గర్భిణులు వస్తుంటారు. ఇందులో రక్తహీనతతో బాధపడే గర్భిణులు 20 మంది ఉంటారని తెలుస్తోంది. వీరికి తెలిసి వారి నుంచి రక్తం సేకరించడమో లేదా హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం జరుగుతోంది. ఒక్కోసారి కాన్పు సమయం దగ్గర పడుతున్నా రక్తం లభించక ఇబ్బందులు పడాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కర్ణాటక సరిహద్దులోని తాండూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అధికంగానే జరుగుతుంటాయి.
ఈ క్రమంలో గాయపడ్డ వారికి తీవ్ర రక్తస్రావం వల్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్‌కు తరలించడానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది. రక్తం అధికంగా పోవడం వల్ల హైదరాబాద్‌కు తరలించేలోపు క్షతగాత్రుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోందనే వాదనలు ఉన్నాయి. రక్తనిధి అందుబాటులో ఉంటే గాయపడ్డవారికి అవసరమైన మేరకు రక్తం ఎక్కించి హైదరాబాద్ తరలించి చికిత్స అందించే వరకు ప్రాణాలకు ముప్పు తప్పే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు. గర్భిణులకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు, వైద్యవిధానపరిషత్ అధికారులు మాత్రం రక్తనిధిని అందుబాటులోకి తీసుకురావడానికి చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నీ సమకూర్చారు.. కానీ..
రెండు నెలలుగా లెసైన్స్ రావాల్సి ఉందని జిల్లా ఆస్పత్రి కో-ఆర్డినేటర్ హన్మంత్‌రావు, సూపరింటెండెంట్ వెంకటరమణప్పలు చెబుతున్నారు. డ్రగ్‌కంట్రోల్ అథారిటీ నుంచి రావాల్సిన రక్తనిధి లెసైన్స్‌లో జాప్యంతో రేపుమాపు అంటూ నెలలుగా జరుపుకొస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో రక్తనిధి ఏర్పాటుకు ప్రత్యేక గది, సౌకర్యాలు కల్పించారు. రక్తం నిల్వకు సంబంధించి సామగ్రి వచ్చింది. కానీ సేవలు మాత్రమే అందుబాటు రావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వైద్యవిధాన పరిషత్ అధికారులు, జిల్లా ఆసుపత్రి బాధ్యులు చొరవ చూపి రక్తనిధి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
‘రక్తనిధి’ ఏదీ!
Published Sat, Sep 7 2013 5:44 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement