కుళాయిల్లో అక్రమాల ధార | Tap the illegality flux | Sakshi
Sakshi News home page

కుళాయిల్లో అక్రమాల ధార

Published Sat, May 24 2014 2:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Tap the illegality flux

నెల్లూరు నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. ప్రజల తాగునీటి అవసరాలు కూడా పెరిగిపోతున్నాయి. నెల్లూరు నగర పాలక సంస్థ సరఫరా చేసే నీటి మీదే ప్రజలు ఆధారపడుతున్నారు. ప్రజల అవసరాలను కొంత మంది వాటర్ వర్క్స్ ఉద్యోగులు తమ ఆదాయ వనరుగా మార్చుకుని అక్రమాలకు తెరలేపారు. అక్రమ కుళాయి కనెక్షన్ల వ్యవహారంలో ఫిట్టర్లదే కీలకపాత్ర. వారే దళారుల పాత్ర ఎత్తి అక్రమంగా కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. వీరి నిర్వాకంతో కార్పొరేషన్ ఆదాయానికి ఏటా రూ.కోట్లలో గండి పడుతోంది.
 
 నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్ : నగరంలో జనరల్  కనెక్షన్లు 24,538, బీపీఎల్ కనెక్షన్లు 9,759, కమర్షియల్ కనెక్షన్లు 637, ఓవైటీ కనెక్షన్లు 3,446 ఉన్నాయి. కుళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ముందుగా నగర పాలక సంస్థలోని పౌర సేవ కేంద్రంలో చలానా కట్టాలి. బీపీఎల్ కనెక్షన్‌కు అయితే రూ.265 చెల్లించాలి. తొమ్మిది అంకణాల రేకుల ఇల్లు లేదా పూరిగుడిసె, లేదా మూడు అంకణాల శ్లాబు ఇల్లు కలిగిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారుగా గుర్తిస్తారు. వీరే బీపీఎల్ కనెక్షన్ తీసుకునేందుకు అర్హులు.
 
 వారికి ప్రభుత్వమే పైపులు కూడా అందజేస్తోంది. జనరల్ కనెక్షన్ అయితే రూ.6,065 డిపాజిట్ రూపంలో, రూ.2 వేలు ఎస్టిమేషన్ చార్జీలు, ఏడాది పన్ను చెల్లించాలి. కమర్షియల్ కనెక్షన్‌కు రూ.15,065 చలానా చెల్లించాలి. పౌరసేవ కేంద్రంలో చలానా చెల్లించిన తర్వాత వినియోగదారుడి దరఖాస్తు సంబంధిత విభాగం గుమస్తాకు చేరుతుంది. ఆ దరఖాస్తుకు నంబరు వేసిన తర్వాత ట్యాప్ ఇన్‌స్పెక్టర్ పరిశీలనకు పంపాలి. ట్యాప్ ఇన్‌స్పెక్టర్ కుళాయి వేయాల్సిన ఇంటిని పరిశీలించి నివేదికను ఏఈ, డీఈలకు పంపుతారు. నివేదికల పరిశీలన అనంతరం వర్క్ ఆర్డర్ ఇస్తారు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే కుళాయి వేయాల్సి ఉంటుంది. ఈ వ్యవహారమంతా 15 రోజుల్లో పూర్తి చేయాలి.
 
 జరుగుతోందిలా..: ఫిట్టర్లు, అధికారులు కుమ్మక్కై ఇష్టానుసారం కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారు. ఫిట్టర్లు నేరుగా వినియోగదారులను ఆశ్రయించి కుళాయిలు వేసేస్తున్నారు. ఫిట్టర్లు ఓ రకంగా అక్రమ కుళాయిల మాఫియాగా తయారయ్యారు. బీపీఎల్ కనెక్షన్‌కు వ్యక్తులను బట్టి రూ.4 వేలు నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. జనరల్ కనెక్షన్‌కు రూ.12 వేలు నుంచి రూ.18 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇక కమర్షియల్ కనెక్షన్ అంటే వీరికి పండగే.. నిబంధనల ప్రకారం చలానా చెల్లిస్తే 3/4 ఇంచ్ పైప్ వేయాలి. దీనికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారు. అయితే వీరు ఒక ఇంచ్ పైప్ వేస్తామని చెప్పి రూ.70 వేలు కూడా వసూలు చేస్తున్నారు. నగరంలో అధికారుల లెక్కలకు తేలకుండా సుమారు 20 వేలకు పైన కుళాయి కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిట్టర్ల నిర్వాకం కారణంగా ఏటా కార్పొరేషన్‌కు రూ. 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోంది.
 
 అక్రమాలివిగో..
  వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఫత్తేఖాన్‌పేట, హరనాథపురం, జెండావీధి, ఖుద్దూస్‌నగర్, మన్సూర్ నగర్, వాకర్స్‌రోడ్డు, కోటమిట్ట తదితర ప్రాంతాల్లో అక్రమ కుళాయిల దందా యథేచ్ఛగా సాగుతోంది.
 
  కోటమిట్ట, ఖుద్దూస్‌నగర్, మన్సూర్‌నగర్, వాకర్స్‌రోడ్డు ప్రాంతంలో పంపింగ్ మైన్‌లైన్‌కు విచ్చలవిడిగా కనెక్షన్లు ఇచ్చారు. దీనివల్ల ఎక్కడైనా లీకేజీలు ఉన్నా మరమ్మతులు చేసేందుకు వీలుకాదు. దీంతో తాగునీరు వృథా అవుతూ ఉంటుంది.
 
  ఖుద్దూస్‌నగర్‌లో ఖాళీ స్థలాలకు కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేశారు. ఒక్కో ఇంటికి రెండు, మూడు కనెక్షన్లు కూడా ఇచ్చి ఉండటం విశేషం.
 
  ఫత్తేఖాన్‌పేటలో ఓ మహిళ నుంచి అక్రమంగా రూ.10 వేల వసూలు చేసి కుళాయి కనెక్షన్ ఇచ్చినట్లు సమాచారం. కార్పొరేషన్‌లో చలానా చెల్లిస్తామని చెప్పి నమ్మబలికి ఆమె వద్ద నుంచి ఆ డబ్బును వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే నగర పాలక సంస్థ ఖజానాలో ఆ మొత్తం జమకాలేదు. చలానా రశీదు కోసం ఆమె ప్రతి రోజు ఆ ప్రాంతంలోని వాటర్‌వర్క్స్ సిబ్బందిని తరచూ నిలదీస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలోని వాటర్‌వర్క్స్ సిబ్బంది ఆమెకు కన్పించకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
  ఉయ్యాలకాలువ కట్ట ప్రాంతంలో విచ్చలవిడిగా కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. వారంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారే. ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు చేసి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిసింది. ఒక్కరికి కూడా ఇంత వరకు కుళా యి పన్ను రాకపోవడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement