టార్గెట్ 60,00,00,000
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి సంపదను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఓ వైపు ఎర్రచందనం ద్వారా ఆదాయం గడించేందుకు కృషి చేస్తూనే, మరో వైపు ఇసుక ద్వారా గణనీయంగా ఆదాయం పొందాలనుకుంటోంది. నెలలో రూ.కోటి ఆదాయం రావడంతో మరో 15 ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సంసిద్ధంగా ఉంది. తద్వారా రూ.60 కోట్ల ఆదాయం పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆరు రీచ్‌ల ద్వారా ప్రభుత్వం ఇసుక విక్రయం చేస్తోంది.
ఆ మాటున జిల్లా వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లు ఇసుక అక్రమ రవాణాను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇసుక రీచ్‌లు ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. అయితే అంతకు వందరెట్లుకు పైగా పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్తోంది. ట్రక్కులు, టిప్పర్లు ద్వారా తెలుగుతమ్ముళ్లు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ట్రిప్పర్లకు ఎస్కార్టుగా ముందు వైపు నాయకులు వాహనంలో ఉంటూ రవాణా నిర్వహిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అడ్డుకునేవారు ఎవరో రండి... అంటూ అధికారులకు సవాల్ విసురుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది.
రూ.60 కోట్లు ఆదాయమే లక్ష్యంగా....
ఇసుక విక్రయం ద్వారా జిల్లాలో రూ.60 కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదులపై కన్నేశారు. చెయ్యేరులో 6 రీచ్‌లు, పెన్నాలో 5 రీచ్‌లు, పాపాఘ్నిలో 4 రీచ్‌లను గుర్తించారు. వాటి పరిధిలో దాదాపు 80 హెక్టార్లలో 9లక్షల 5వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవచ్చనే అంచనాకు వచ్చారు. ఇప్పటికే కొండాపురం, ఓబన్నపేట, నేదరపేట, చెరువుకిందపల్లె, ఏటూరు, కొమ్మరోనిపల్లె ఇసుక రీచ్‌ల నుంచి 18,846 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీశారు.
అందులో 16,298 క్యూబిక్ మీటర్లు విక్రయించారు. తద్వారా రూ. కోటి ఆదాయాన్ని గడించారు. ఈ ప్రక్రియను మరింత వేగంగా నిర్వహించి జిల్లా నుంచి ఇసుక ద్వారానే రూ.60 కోట్లు గడించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మీసేవా ద్వారా విక్రయాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. చెయ్యేరు నది పరిధిలోని శేషమాంబపురం, కోమంతరాజుపురం, టంగుటూరు-1, టంగుటూరు-2, రాయవరం పరిధిలోని కాలవపల్లె, బాలరాసపల్లెలలో నూతన రీచ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
అలాగే పెన్నా నది పరిధిలోని హనుమాన్‌గుత్తి, జ్యోతి, ములపాక, వేపరాల, గొరిగనూరు/ధర్మాపురంలలోనూ, పాపాఘ్ని నది పరిధిలోని కుమ్మరాంపల్లె, అనిమెల, యు.రాజుపాళెం పరిధిలోని ఉలవలపల్లె, పైడికాల్వ గ్రామాలల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వాటి నుంచి స్టాక్ యార్డులకు ఇసుకను తరలించి అక్కడి నుంచి అమ్మకాలు సాగిస్తారు. ఎక్కడ ఇసుక విక్రయించినా క్యూబిక్ మీటర్ రూ.650 చొప్పున అందుబాటులో ఉంచేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆదాయం సరే... తమ్ముళ్ల మాటేమిటో...
ప్రభుత్వానికి ఆదాయం సమాకూరడం వరకూ హర్షించదగ్గ పరిణామమే.. అయితే ఇసుక రీచ్‌ల మాటున తెలుగుతమ్ముళ్లు సాగిస్తున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నకిలీ ధృవపత్రాలతో ఇసుక అక్రమ రవాణాను యధేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమార్కులను సహించేది లేదని పేర్కొంటున్నా, జిల్లా స్థాయిలో సాధ్యం కావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇసుక టిప్పర్లకు ఎస్కార్టుగా నేతల వాహనాల్లో వారి అనుచరులు వెళుతుండటం ఇందుకు తాత్కారణంగా నిలుస్తోంది. ఈ తంతు వ్యవహారాన్ని ఇటీవల ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు పేర్కొంటున్నారు.