red oak
-
టార్గెట్ 60,00,00,000
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి సంపదను సొమ్ము చేసుకునేందుకు ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఓ వైపు ఎర్రచందనం ద్వారా ఆదాయం గడించేందుకు కృషి చేస్తూనే, మరో వైపు ఇసుక ద్వారా గణనీయంగా ఆదాయం పొందాలనుకుంటోంది. నెలలో రూ.కోటి ఆదాయం రావడంతో మరో 15 ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు సంసిద్ధంగా ఉంది. తద్వారా రూ.60 కోట్ల ఆదాయం పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆరు రీచ్‌ల ద్వారా ప్రభుత్వం ఇసుక విక్రయం చేస్తోంది. ఆ మాటున జిల్లా వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్లు ఇసుక అక్రమ రవాణాను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇసుక రీచ్‌లు ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.కోటి ఆదాయం లభించింది. అయితే అంతకు వందరెట్లుకు పైగా పచ్చచొక్కాల జేబుల్లోకి వెళ్తోంది. ట్రక్కులు, టిప్పర్లు ద్వారా తెలుగుతమ్ముళ్లు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ట్రిప్పర్లకు ఎస్కార్టుగా ముందు వైపు నాయకులు వాహనంలో ఉంటూ రవాణా నిర్వహిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అడ్డుకునేవారు ఎవరో రండి... అంటూ అధికారులకు సవాల్ విసురుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. రూ.60 కోట్లు ఆదాయమే లక్ష్యంగా.... ఇసుక విక్రయం ద్వారా జిల్లాలో రూ.60 కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదులపై కన్నేశారు. చెయ్యేరులో 6 రీచ్‌లు, పెన్నాలో 5 రీచ్‌లు, పాపాఘ్నిలో 4 రీచ్‌లను గుర్తించారు. వాటి పరిధిలో దాదాపు 80 హెక్టార్లలో 9లక్షల 5వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించవచ్చనే అంచనాకు వచ్చారు. ఇప్పటికే కొండాపురం, ఓబన్నపేట, నేదరపేట, చెరువుకిందపల్లె, ఏటూరు, కొమ్మరోనిపల్లె ఇసుక రీచ్‌ల నుంచి 18,846 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీశారు. అందులో 16,298 క్యూబిక్ మీటర్లు విక్రయించారు. తద్వారా రూ. కోటి ఆదాయాన్ని గడించారు. ఈ ప్రక్రియను మరింత వేగంగా నిర్వహించి జిల్లా నుంచి ఇసుక ద్వారానే రూ.60 కోట్లు గడించడమే లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మీసేవా ద్వారా విక్రయాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతోంది. చెయ్యేరు నది పరిధిలోని శేషమాంబపురం, కోమంతరాజుపురం, టంగుటూరు-1, టంగుటూరు-2, రాయవరం పరిధిలోని కాలవపల్లె, బాలరాసపల్లెలలో నూతన రీచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పెన్నా నది పరిధిలోని హనుమాన్‌గుత్తి, జ్యోతి, ములపాక, వేపరాల, గొరిగనూరు/ధర్మాపురంలలోనూ, పాపాఘ్ని నది పరిధిలోని కుమ్మరాంపల్లె, అనిమెల, యు.రాజుపాళెం పరిధిలోని ఉలవలపల్లె, పైడికాల్వ గ్రామాలల్లో ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వాటి నుంచి స్టాక్ యార్డులకు ఇసుకను తరలించి అక్కడి నుంచి అమ్మకాలు సాగిస్తారు. ఎక్కడ ఇసుక విక్రయించినా క్యూబిక్ మీటర్ రూ.650 చొప్పున అందుబాటులో ఉంచేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయం సరే... తమ్ముళ్ల మాటేమిటో... ప్రభుత్వానికి ఆదాయం సమాకూరడం వరకూ హర్షించదగ్గ పరిణామమే.. అయితే ఇసుక రీచ్‌ల మాటున తెలుగుతమ్ముళ్లు సాగిస్తున్న అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నకిలీ ధృవపత్రాలతో ఇసుక అక్రమ రవాణాను యధేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమార్కులను సహించేది లేదని పేర్కొంటున్నా, జిల్లా స్థాయిలో సాధ్యం కావడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇసుక టిప్పర్లకు ఎస్కార్టుగా నేతల వాహనాల్లో వారి అనుచరులు వెళుతుండటం ఇందుకు తాత్కారణంగా నిలుస్తోంది. ఈ తంతు వ్యవహారాన్ని ఇటీవల ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు పేర్కొంటున్నారు. -
తమ్ముళ్లే స్మగ్లర్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కంచే చేను మేస్తుందన్న చందంగా ఎర్రచందనం అక్రమరవాణాలో అధికారపార్టీ నేతలే కీలక పాత్ర పోషిస్తున్నారు. అందులో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. మరో జెడ్పీటీసీ సభ్యుడు ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. వీరికి ఓ గ్రామం గ్రామమే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చిత్తూరు జిల్లాలో శేషాచలం, వైఎస్సార్ కడప జిల్లాలో లంకమల, ప్రకాశంలో నల్లమల, నెల్లూరు జిల్లాలో వెలుగొండ అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అత్యంత విలువైన ఎర్రచందనం సంపదకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో తెలుగుతమ్ముళ్లు వాటిపై దృష్టిపెట్టారు. అధికార బలంతో కొందరు పోలీసులు, మరి కొందరు అటవీ, ఇంకొందరు చెక్‌పోస్టు అధికారులను బెదిరించి దారిలోకి తెచ్చుకున్నట్లు సమాచారం. వారి సహకారంతో ఎర్ర బంగారాన్ని కొల్లగొడుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణే లక్ష్యంగా తమ్ముళ్లు, తమిళనాడుకు చెందిన కొందరు స్మగ్లర్లు బరితెగించారు. చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలో పోలీసులు, అటవీశాఖ అధికారులు నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తుండటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. నెల్లూరు జిల్లా నుంచి ఎర్రచందనం దుంగలను తరలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఇటీవలకాలంలో నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం అక్రమరవాణా అధికమైందని అధికార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరికి జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో జెడ్పీటీసీ సభ్యుడు, సర్పంచ్‌లు కొందరు సహకరిస్తున్నట్లు తెలిసింది. స్మగ్లర్లకు సహకరించటంతో పాటు జిల్లాపరిధిలోని వెంకటగిరి, రాపూరు, సోమశిల, సీతారామపురం, ఉదయగిరి అటవీ ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఎర్రచందనం చెట్లను నరకటం ప్రారంభించారు. విచ్చలవిడిగా నరికిన ఎర్రచందనం దుంగలను రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. అలా దాచి ఉంచిన ఎర్రబంగారాన్ని సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు పక్కా ప్రణాళికలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికార బలంతో అక్రమరవాణా టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే కొందరు ఎర్రచందనం అక్రమరవాణాపై దృష్టిసారించి నట్లు తెలుస్తోంది. ఓ గ్రామం మొత్తం ఎర్రచందనం అక్రమరవాణాపైనే ఆధారపడి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరంతా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుచుకుంటారని వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడ డంప్ చేసిన దుంగలతో పాటు వీరు నరికి దాచి ఉంచిన ఎర్రందనం దుంగలను కలిపి అధికార బలంతో సరిహద్దులు దాటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్రమ రవాణాలో అధికారపార్టీ ఎమ్మెల్యేకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నట్లు అటవీశాఖలో పనిచేసే ఓ అధికారి స్పష్టం చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేం దుకు అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యేనే ఎర్రచందనం దుంగలను తన వాహనంలో ఉంచుకుని అనుకున్న స్థావరానికి చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. అలా పలుమార్లు ఎమ్మెల్యేనే తాను ప్రయాణించే కారులోనే ఎర్రచందనం దుంగలను తరలించినట్లు ఓ అటవీ అధికారి వెల్లడిం చటం గమనార్హం. ఎమ్మెల్యే ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం సీఎం వద్దకు కూడా చేరింది. దీనిపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే గుట్టుచప్పుడు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అరెస్టులైనా బయటకు వస్తారు.. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే అనుచరులైన ఇద్దరు ప్రధాన స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఎమ్మెల్యే తన అధికార బలం ఉపయోగించి బయటకు రప్పించారు. ప్రస్తుతం వారు అడవుల్లోనే ఉంటూ స్మగ్లింగ్ పనిలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరుడైన జెడ్పీటీసీ సభ్యుడు ఒకరు తడ పరిధిలోని ఓ మెడికల్ షాపు యజమానికి ఎర్రచందనం సరఫరా చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు కొంత మొత్తాన్ని కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో మొత్తం 374 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసుల అంచనా. ఆ మేరకు వారిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
విభేదాలే అదనుగా ఎర్ర స్మగ్లింగ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఒకరికొకరు కలిసిమెలసి పనిచేయాల్సిన ఆ రెండు శాఖలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వారి మధ్య విభేదాలు ఎర్రదొంగలకు వరంగా మారాయి. అందుకే జిల్లా నుంచి ఎర్రబంగారం యథేచ్ఛగా తరలిపోతోంది. అందుకు ఆత్మకూరు, గూడూరు అటవీ డివిజన్ పరిధిలో నరికివేతకు గురవుతున్న ఎర్రచందనం చెట్లే నిదర్శనం. అలా నరికి దాచిపెట్టిన దుంగలు యథేచ్ఛగా సరిహద్దులు దాటి వెళ్తున్నాయి. అయినా జిల్లా అధికారులు అక్రమ రవాణాను నిలువరించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు పోలీసులు, అటవీశాఖ మధ్య సమన్వయ లోపమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల పోలీసులు, అటవీ అధికారుల మధ్య చిచ్చురేగిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఇరుశాఖల అధికారులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ప్రచారం ఉంది. దీంతో ఎర్రదొంగలకు మార్గం సుగమమైంది. జిల్లాలోని ఉదయగిరి నుంచి వెంకటగిరి వరకు విస్తరించిన అటవీప్రాంతంలో ఎర్రచందనం విస్తారంగా ఉంది. చిత్తూరు జిల్లాలో పోలీసు, అటవీ అధికారులు ఎర్రదొంగల కట్టడికి చేపట్టిన చర్యలు ఫలించడంతో అక్కడ అక్రమరవాణా తగ్గుముఖం పట్టింది. దీంతో నెల్లూరు జిల్లాలో ఉన్న ఎర్రబంగారంపై ఎర్రదొంగల కన్నుపడింది. సరిహద్దులు దాటుతున్న ఎర్రబంగారం జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణాపై నిఘా తగ్గడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అక్రమార్కులకు ఎర్రచందనం రవాణా లాభసాటిగా మారడంతో జిల్లాకు చెందిన కొందరు స్మగ్లర్ల అవతారమెత్తారు. కొంతకాలంగా అటవీ ప్రాంతంలోని ఎర్రచందనాన్ని నరికి ఇతర ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు. అదేవిధంగా ఉదయగిరి అడవుల్లో భారీగా ఎర్రచందనం దుంగలను నిల్వచేసినట్లు తెలిసింది. భారీగా డంప్‌చేసిన దుంగలను చిన్నగా జిల్లా సరిహద్దులు దాటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఇటీవల కాలంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు విజయవాడ, చెన్నై ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. అందుకు చిత్తూరు జిల్లాలో తరచూ పట్టుబడుతున్న ఎర్రదొంగలే నిదర్శనం. రెండు రోజుల క్రితం తిరుపతిలో పదిమంది స్మగ్లర్లు, భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిని దొంగల్లో జిల్లాకు చెందిన వారు ఐదుగురు ఉండడం గమనార్హం. ఈ ఐదుగురు ప్రధాన స్మగ్లర్లుగా అధికారులు చెబుతున్నారు. వీరి అనుచరులు ఇంకెంత మంది ఉన్నారనే దిశగా అధికారులు దృష్టిసారించినట్లు తెలిసింది. స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం మంగళవారం అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఇంటి దొంగలపైనా నిఘా పెట్టినట్లు తెలిసింది. ఇటీవల పట్టుబడిన ఒక పోలీసు, ఇద్దరు అటవీ అధికారులను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. -
‘ఎర్ర' స్మగ్లింగ్‌లో మరో ఇంటి దొంగ
ఆత్మకూరు: ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో అటవీశాఖ ఉద్యోగి మరొకరు పోలీసులకు చిక్కారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ఏబీఓ) రంగయ్యను అరెస్ట్ చేశారు. వివరాలను ఆత్మకూరు ఎస్సై జి.వేణుగోపాల్‌రెడ్డి శనివారం స్థానిక పోలీసుస్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే పలువురు అటవీశాఖ, పోలీసు సిబ్బందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే వరికుంటపాడు మండలం కడియంపాడుకు చెందిన రంగయ్య కృష్ణాపురం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తూ స్మగ్లర్లకు సహకరిస్తుండటాన్ని గుర్తించామన్నారు. నిందితుడిని శనివారం నెల్లూరుపాళెం సెంటర్లో అరెస్ట్ చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచామన్నారు. స్మగ్లింగ్ ను పూర్తిగా నిరోధించే చర్యలను కొనసాగిస్తున్నామని ఎస్సై చెప్పారు. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
పెనుకొండ/అనంతపురం/తాడిపత్రి : జిల్లాలో గురువారం భారీఎత్తున ఎర్రచందనం పట్టుబడింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో 185 దుంగలను అటవీ శాఖాధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉం టుందని అధికారులు తెలిపారు. పెనుకొండ మండలం రాంపురం- వెంకటరెడ్డిపల్లి మధ్య 44వ జాతీయ రహదారిపై రూ.10 లక్షల విలువచేసే 150 దుంగలను జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) రాఘవయ్య, అధికారులు చంద్ర బాలాజీ, శ్రీధర్‌రావు బృందం పట్టుకుంది. వీటిని ఐచర్ వాహనంలో బెంగళూరు వైపు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ బృందం కాపు కాసింది. అక్రమ రవాణాదారులు రాప్తాడు మండలంలోని మరూరు టోల్గేట్ వద్ద సైతం వాహనాన్ని ఆపకుండా పక్కదారి గుండా తప్పించుకొని పెనుకొండ వైపు వెళ్లారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో అటవీ శాఖ అధికారులు ఆ వాహనాన్ని వెంటాడారు. పెనుకొండ సమీపంలో హైవే పెట్రోలింగ్ వాహనాన్ని చాకచక్యంగా అడ్డుపెట్టి ఐచర్‌ను ఆపారు. అందులోని ముగ్గురు వ్యక్తులు కిందకు దూకి కంపచెట్లలోకి పారిపోయారు. హరిపురం గ్రామస్తుల సహాయంతో తమిళనాడుకు చెందిన సతీష్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు దొరకలేదు. వాహనంలో 150 దుంగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని వాహనంతో సహా అటవీ శాఖ పెనుకొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు. స్కార్పియో వాహనంలో సీట్ల కింద ఆరు ఎర్రచందనం దుంగలను దాచి .. నంద్యాల నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తుండగా మా రూరు టోల్గేట్ వద్ద అటవీ శాఖ మొబైల్ టీం సభ్యులు పట్టుకున్నారు. నలుగురు దొంగలను అరెస్టు చేశారు. స్కార్పియో వాహనంతో పాటు దొంగలను అనంతపురం తరలించారు. దుంగలవిలువ రూ.3 లక్షల పైగా ఉంటుందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామచంద్రనాయక్ తెలిపారు. కర్నూలు జిల్లా మహాదేవపురం నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో తరలిస్తున్న రూ.2 లక్షల విలువ చేసే 605 కిలోల 29 ఎర్రచందనం దుంగలను తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇవి పట్టుబడినట్లు తాడిపత్రి రూరల్ సీఐ వెంకటరెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. మహాదేవపురం గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా, వైఎస్సార్ జిల్లా ముద్దునూరుకు చెందిన గుజరీ వ్యాపారి బాబ్జీ, డోన్ పట్టణానికి చెందిన వాహన డ్రైవర్ గురుమూర్తి, అంకిరెడ్డిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి, కూలీలు విజయరెడ్డి, బాషాను అరెస్టు చేశామన్నారు. -
వీడిన హత్యకేసు మిస్టరీ
తాడుతో గొంతు బిగించి హత్యచేసి రైలు పట్టాలపై పడేసిన వైనం.. ఎర్రచందనం రవాణాలో విభేదాలే కారణం నలుగురు నిందితుల అరెస్టు వడమాలపేట: గత ఏడాది నవంబర్ 15వ తేదీన పూడి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడిని హత్య చేసి పడేసిన సంఘటనకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు తిరుపతి అదనపు ఎస్పీ త్రిమూర్తులు తెలిపారు. శుక్రవారం వడమాలపేట పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 15వతేదీన ఓ యువకుడిని హత్యచేసి పూడి రైల్యేస్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై పడేశారు. హతుడి వేలిముద్రల ఆధారంగా పలమనేరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన జి. రాజేంద్రగా (23) గుర్తించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించే బాధ్యతను స్వీకరించిన రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, వడమాలపేట ఎస్ఐ ఈశ్వరయ్యలు రాజేంద్ర కుటుంబ సభ్యులను కలసి కొంత సమాచారం సేకరించారు. కొంతమంది అనుమానితుల పేర్లు తీసుకొని వారిపై నిఘావేశారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన జ్ఞానేంద్ర, చిన్నగొట్టిగల్లు మండలం పిచ్చికుంట్లపల్లికి చెందిన వెంకటరమణ, పాపానాయుడుపేటకు చెందిన టి.రవి, తిరుపతి ఎస్టీయు కాలనీకి చెందిన హరిలు రాజేంద్రతో కలసి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు. వ్యాపారంలో గొడవలు రావడంతో రాజేంద్ర వారి నుంచి విడిపోయాడు. ఆ తర్వాత జ్ఞానేంద్ర తదితరులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు దొరికారు. తమ గురించి రాజేంద్రనే పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకొన్నారు. గొడవలు మరచి పోయి అందరం కలిసి వ్యాపారం చే ద్దామని రాజేంద్రను నమ్మించి పులిచర్లకు రప్పించారు. అక్కడ అందరూ కలసి మద్యం తాగారు. తరువాత కారులో తిరుపతికి బయలు దేరారు. రాజేంద్ర మత్తులో ఉండగా తాడుతో గొంతు బిగించి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. తమకు అందిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్య తామే చేసినట్లు వారు అంగీకరించారు. నిందితుల్లో ఒకడైన జ్ఞానేంద్రకు తమిళనాడు లోనూ పలు దోపిడీలు, దొంగతనాలతో సంబంధం ఉందని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను పుత్తూరు కోర్టుకు తరలించగా రిమాండ్‌కు ఆదేశించారు. మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐలకు రివార్డులు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
అన్నిటికీ ఎర్ర చం‘ధన’మే
ఖజానాను ఎర్రచం‘ధనం’తో నింపుకోవడానికి సర్కారు ఎత్తుగడ! 60 ఏళ్లు నిండిన వృక్షాలను నరికివేసి, వేలం వేయాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో ఎర్రచందనం వృక్షాలను కుదవబెట్టి రుణం పొందే ప్రయత్నం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచం‘ధనం’తో ఖజానాను సుసంపన్నం చేసుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తొలుత శేషాచలం అడవుల్లో 60 ఏళ్లు నిండిన ఎర్రచందనం వృక్షాలను నరికివేసి.. టెండర్ల ద్వారా విక్రయించి నిధులను సమీకరించాలని భావిం చింది. కానీ.. చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుతో వ్యూహం మార్చింది. 60 ఏళ్లు నిండిన ఎర్రచందనం వృక్షాలను బ్యాంకుల్లో కుదవబెట్టి రుణాలు తీసుకోవడం ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించింది. కానీ.. వృక్షాలను కుదువబెట్టుకుని రుణాలు ఇచ్చే సంప్రదాయం ఎక్క డా లేదని బ్యాంకర్లు కొట్టిపారేస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పని చేయాలన్నా ఎర్రచందనం దుంగలను విక్రయించి.. నిధులను సమీకరిస్తామని సీఎం చంద్రబా బు పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో 4,755.997 చదరపు కి.మీ మేర శేషాచలం కొండలు వ్యాపించి ఉన్నాయి. ఈ కొండల్లో 174 కుటుం బాలకు చెందిన 1,500రకాల జాతుల మొక్కలు ఉన్నాయి. ఇందులో ఎర్రచందనం అత్యంత విలువైనది. శేషాచలం కొండల్లో 3,640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం(8.99 లక్షల ఎకరాల)లో ఎర్రచందనం వృక్ష సంపద విస్తరించి ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఎర్రచందనం విక్రయాలను కేంద్రం నిషేధించడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా తీసుకున్న స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికివేస్తూ.. మయన్మార్, బ్యాంకాక్, చైనా, మలేషియా, థాయ్‌లాండ్‌లకు అక్రమంగా చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలించే క్రమంలో చేసిన తనిఖీల్లో పోలీసు, అటవీశాఖ అధికారులు 8584.1353 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఆ దుంగలను విక్రయించి నిధులను సమీకరిస్తామని జూన్ 10న సీఎం చంద్రబాబు ప్రకటించారు. పనిలో పనిగా శేషాచలం అడవుల్లో 60 ఏళ్లు నిండిన వృక్షాలను ప్రభుత్వమే నరికివేయించి.. టెండర్ల ద్వారా విక్రయిస్తుందని సెలవిచ్చారు. తద్వారా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని చెప్పుకొచ్చారు. ఎర్రచందనం విక్రయంలో భాగంగా తొలి దశలో 4,159.693 టన్నులను ఈ-టెండర్ కమ్ వేలం పద్ధతిలో అమ్మే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థయిన మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్(ఎమ్‌ఎస్‌టీసీ)కి జూలై 25న ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు ఎస్‌ఎస్‌టీసీ ఆగస్టు 8న ఎమ్‌ఎస్‌టీసీ ఈ-టెండర్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్ర.. అడవుల్లో ఎర్రచందనం వృక్షాలను నరికివేసి, టెండర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విక్రయిస్తోందని చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యం విచారణ ప్రారంభించిన గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఎర్రచందనం వృక్షాలను నరికివేసి, ఎలా విక్రయిస్తారని వివరణ కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. తాము ఎర్రచందనం వృక్షాలను నరికివేయడం లేదని, స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దుంగలనే టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని గ్రీన్ ట్రిబ్యునల్‌కు వివరించింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్రచందనం విక్రయ టెండర్లపై స్టే విధించింది. గ్రీన్ ట్రిబ్యునల్ కన్నెర్రతో ప్రభుత్వం రూటు మార్చింది. అడవుల్లో ఉన్న వృక్షాలను నరికివేయడం పర్యావరణానికి విఘాతం కల్పించడమేనని గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టీకరించిన నేపథ్యంలో.. ఎర్రచందనం వృక్షాలను నరికివేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. 60 ఏళ్లు నిండిన ఎర్రచందనం వృక్షాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ వృక్షాలను జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల్లో కుదవ పెట్టి రుణాలు తీసుకోవడం ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవంబర్ 2 నుంచి సర్వే.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్ష సంపదపై సర్వే చేయాలని అటవీశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అటవీశాఖ అధికారులు బృందాలుగా విడిపోయి ఎర్రచందనం వృక్షాలను లెక్కించనున్నారు. ఆ వృక్షాల వయసు ఆధారంగా వర్గీకరించనున్నారు. ఏ ఏ బ్లాకుల్లో ఏ మేరకు వృక్షాలు ఉన్నాయన్న లెక్కను పక్కాగా తేల్చనున్నారు. ఆ తర్వాత శాటిలైట్‌తో సర్వే చేయించి.. వృక్షసంపదను గుర్తించనున్నారు. ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. తిరుపతిలో ఏర్పాటుచేసే సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థతో వాటిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎర్రచందనం వృక్షాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టి.. స్మగ్లర్ల బారిన పడకుండా చూడవచ్చునన్నది ప్రభుత్వ ఆలోచన. వృక్షాల సంఖ్య పక్కాగా తేలాక.. వాటిని జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల్లో కుదవ పెట్టి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 2 నుంచి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాల సర్వేను ప్రారంభిస్తామని అటవీ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఎర్రచందనం నిల్వకు.. అధునాతన గోదాములు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుం గలను నిల్వ చేసేందుకు తిరుపతిలో అధునాతన గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఎర్రచందనం నాణ్యతను పరిరక్షించడంతో పాటు ఇంటిదొంగల బారిన పడకుండా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆరు గోదాములు నిర్మించనున్నా రు. ఇందుకు రూ.21 కోట్లను మంజూరు చేస్తూ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 351) జారీ చేశారు. శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనాన్ని కొల్లగొట్టి సరిహద్దులు దాటిస్తున్న విషయం విదితమే. పోలీసులు, అటవీశాఖ అధికారులు నిఘా వేసి, తనిఖీలు చేసి అడపాదడపా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న దుంగలను అటవీశాఖ కార్యాల యాల ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఎండకు ఎండి.. వానకు నానడం వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యత తగ్గిపోతూ వస్తోంది. ఏ-గ్రేడ్ ఎర్రచందనం దుంగల నాణ్యత కూడా సీ-గ్రేడ్‌కు తగ్గిపోతోంది. అటవీశాఖలో ఇంటిదొంగలు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అటవీశాఖ ఉన్నతాధికారులు అధునాతన గోదాములు నిర్మించి.. ఎర్రచందనాన్ని నిల్వ చేయాలని నిర్ణయించారు. 8 వేల టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో ఆరు గోదాములు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ గోదాముల ఆవరణలోనే సెంట్రల్ యాక్షన్ హాల్, అడ్మినిస్ట్రేటివ్, సర్వీసు, సెక్యూరిటీ బ్లాక్‌లు, సీసీ కెమెరాలతో కూడిన సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ, సోలార్ లైటింగ్ సిస్టమ్, వేబ్రిడ్జి, అంతర్గత రహదారులు ఏర్పాటుచేయాలని సూచించారు. దీని వల్ల ఎర్రచందనం దుంగల నాణ్యతను కాపాడటంతో పాటు భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రతిపాదించారు. వీటిపై అటవీశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆమోదముద్ర వేశారు. తొలి దశలో 4,500 టన్నుల ఎర్రచందనం నిల్వ సామర్థ్యంతో గోదాముల నిర్మాణానికి రూ.పది కోట్లను.. రెండో దశలో 3,500 టన్నుల నిల్వ సామర్థ్యం, అధునాతన సదుపాయాలు కల్పించడానికి మరో రూ.11 కోట్లను విడుదల చేసేలా ఉత్తర్వులు జారీచేశారు. ఈ అధునాతన గోదాము నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించడంతో నెలాఖరులోగా టెండర్ నోటిఫికేషన్ జారీచేసేందుకు అటవీశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో బ్రాంచ్ పోస్టుమాస్టర్
వరికుంటపాడు (ఉదయగిరి): మండలంలోని గువ్వాడి బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఆవుల బాలయ్య వైఎస్సార్ జిల్లా పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఈయనకు సంబంధం ఉండటంతో పోలీసులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు తూర్పుచెన్నంపల్లికి చెందిన ఆయన సమీప బంధువు మరొకరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వీరికి గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ముఠా సభ్యులతో సంబంధం ఉండి అడపాదడపా వారికి ఎర్రచందనం దుంగలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీరితో సంబంధం ఉన్న ఎర్ర దొంగలు కడప పోలీసులకు చిక్కడంతో వారిచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బద్వేలుకు చెందిన ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఒక బృందంగా ఏర్పడి వీరితో ఎర్రచందనం కొనుగోలుపై ఒప్పందం చేసుకొని వారితోనే మూడురోజులు కలిసి మెలిసి తిరిగి దుంగలను లోడుచేసిన అనంతరం వాహనంతోసహా అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. భైరవకోన అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికేందుకు పెద్దిరెడ్డిపల్లికి చెందిన కొంతమంది గిరిజనులను వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారంతో పూర్తిగా సంబంధమున్న వీరిద్దరినీ బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకొని కూలీలను వది లివేశారు. జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌తో 81 మందికి సంబంధం ఉన్నట్లుగా ఎస్పీ గుర్తించారని సమా చారం. ఇందులో ఉదయగిరి, దుత్తలూరు, నందిపాడు, సీతారామపురం మండలాలకు చెందిన పలువురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్‌తో సంబంధమున్న పలువురు వ్యక్తుల గుం డెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
‘ఎర్ర’ దొంగల వేటలో..సీన్ రివర్స్
‘ఆపరేషన్ రెడ్’ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న స్మగ్లర్ల బంధుగణం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులపై కిడ్నాప్ కేసులు పెడుతున్న వైనం ‘ఎర్ర’ దొంగల వేటలో స్మగ్లర్ల బంధుగణం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకోగానే సమీపంలోని పోలీసుస్టేషన్లో బంధుగణం తమ మనిషి అదృశ్యమైనట్లు కేసు పెడుతోంది. ఆ వెంటనే చిత్తూరు జిల్లా పోలీసులు తమ మనిషిని కిడ్నాప్ చేశారంటూ మరో కేసు పెడుతోంది. వరుసగా కేసులు చుట్టుముట్టుతుండడంతో పోలీసులు బెంబేలెత్తుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, కర్నూలు, వైఎస్ఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ రెడ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి.. పీడీ యాక్ట్‌ను ప్రయోగించి కటకటాల వెనుకకు పంపిస్తున్నారు. తొలుత ఎదురులేకుండా ఆపరేషన్ రెడ్ కొనసాగినా ఇప్పుడు పోలీసులు వెనుకంజ వేస్తున్నా రు. తమిళనాడు, కర్ణాటక పోలీసులు సహకరిం చకపోవడం ఒక కారణమైతే.. స్మగ్లర్ల అనుచరు ల దాడులు, బంధువులు పెట్టే కేసులు మరొక కారణం. దేశంలో పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రియాజ్‌ది కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కటికినహళ్లి. ఆ గ్రామంలో రియాజ్ బంధుగణంలో 21 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపు పొందారు. ఇందులో రియాజ్తోపాటూ మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రియాజ్‌ను అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీసులు కటికినహళ్లికి వెళ్లినప్పుడు.. ఆ గ్రామంలో స్మగ్లర్ల అనుచరులు వీరిపై దాడి చేశారు. ఆ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికి సమీపంలోని హొస్కోట పోలీసుస్టేషన్‌కు మన జిల్లా పోలీసులు సమాచారం అందించినా స్పందన కరువైంది. చివరకు ఎలాగోలా రియాజ్‌ను అరెస్టు చేసి.. పీడీ యాక్ట్‌ను ప్రయోగించి కటాకటాల వెనుకకు పంపడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. కానీ.. ఇప్పుడు కటికినహళ్లిలో మిగిలిన 16 మందిని అరెస్టు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. నాలుగు రోజుల కిత్రం చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక పోలీసు బృందం మారువేషాల్లో కటికినహళ్లికి వెళ్లింది. రియాజ్ అనుచరుడైన నౌషద్ అనే అంతర్జాతీయ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని, చిత్తూరుకు తరలించింది. ఇది పసిగట్టిన నౌషద్ బంధుగణం.. హొస్కోట పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ మనిషి కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. హొస్కోట పోలీసుస్టేషన్లో నౌషద్‌ను చిత్తూరు పోలీసులు కిడ్నాప్ చేసినట్లు స్మగ్లర్ల అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు పోలీసులపై హొస్కోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో కర్ణాటక, తమిళనాడలోని పలు స్టేషన్లలో మన జిల్లా పోలీసులపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. కర్ణాటక, తమిళనాడు పోలీసులు సహకరించాల్సింది పోయి కేసులు బనాయిస్తుండటం‘ఆపరేషన్ రెడ్’కు ప్రతిబంధకంగా మారుతోందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
టాస్క్‘ఫోర్స్’ ఏదీ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదనడానికి ఇది నిదర్శనం. స్మగ్లింగ్‌కు చెక్ పెట్టడానికి ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నియామకాన్ని నిర్వీర్యం చేయడమే అందుకు తార్కాణం. ఇదే అదునుగా ఎర్ర’ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి.. స్మగ్లర్లను అణచివేయడానికి జూన్ 25, 2013న ప్రభుత్వం ఆర్భాటంగా టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. పోలీసు, అటవీశాఖ అధికారులను డెప్యుటేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌లో నియమంచింది. డీఎస్పీ స్థాయి అధికారిని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా నియమించింది. ఇద్దరు సీఐలు, ఒక అసిస్టెంట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, నలుగురు ఎస్ఐలు, నలుగురు ఫారెస్ట్ రేంజర్లు, వందమంది ఏఆర్ విభాగం పోలీసులను టాస్క్‌ఫోర్స్‌కు కేటాయించింది. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా తనకు సన్నిహితుడైన ఉదయ్‌కుమార్‌ను అప్పటి సీఎం కిరణ్ నియమించారు. మంజూరు చేసిన పోలీసు, అటవీ శాఖ నుంచి డెప్యుటేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌కు సి బ్బందిని కేటాయించారు. ఏడాదిపాటు పూర్తి స్థాయి సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ విధులను నిర్వర్తించినా.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయింది. టాస్క్‌ఫోర్స్‌లోని కొందరు అధికారులు అప్పట్లో ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్త్తున్న నేత సోదరుడు సాగిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూర్తి స్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తా యి. కానీ.. అప్పట్లో ప్రభుత్వం ఎ లాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఇన్చార్జ్ ఓఎస్డీగా ఏఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వ కీలకనేత సోదరుడు సాగించిన ఎర్రచందనం దందాకు సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యం లోనే టాస్క్‌ఫోర్స్ నుంచి సీఐ, ఎస్ఐ, పోలీసు సి బ్బంది, అటవీశాఖ సిబ్బంది డెప్యుటేషన్లను రద్దు చేసుకుని మాతృశాఖల్లో విధుల్లో చేరుతున్నారు. ఇద్దరు సీఐలు, ఎస్ఐలు ఇప్పటికే మాతృశాఖలో విధుల్లోకి చేరారు. మరో ఇద్దరు ఎస్ఐలు అదే బాట న పయనిస్తున్నారు. ఏఆర్ పోలీసులు సైతం టాస్క్‌ఫోర్స్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం.. సరైన వేతనాలు, అధునాతన ఆయుధాలు, వాహనాలు, సదుపాయాలు లేకపోవడమే. అటవీశాఖ సిబ్బందిదీ అదే తీరు. ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యమైపోయింది. శేషాచలం అడవుల్లో దాదాపుగా కూంబింగ్ నిలిచిపోయింది. ఇదే అదునుగా తీసుకున్న ‘ఎర్ర’ స్మగ్లర్లు యథేచ్ఛగా స్మగ్లింగ్‌ను కానిచ్చేస్తున్నారు. -
దుంగలు తరలిస్తూ పట్టుబడ్డ ప్రొటెక్షన్ వాచర్
బద్వేలు అర్బన్ః ద్విచక్రవాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రొటెక్షన్ వాచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక అర్బన్ స్టేషన్లో సీఐ వెంకటప్ప వివరాలు వెళ్లడించారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్బి ఎస్ఐ రామాంజ నేయుడు, అర్బన్, రూరల్ ఎస్ఐలు నాగమురళి, నరసింహారెడ్డి, సిబ్బంది కలసి మైదుకూరు రోడ్డులోని గుంతపల్లె క్రాస్‌రోడ్డు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా గుంతపల్లె వైపు నుంచి ఏపీ04 ఏఎఫ్3752 నంబరు గల ద్విచక్రవాహనంలో ఇద్దరు వ్యక్తులు వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానంతో వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వారి దగ్గర ఉన్న బ్యాగులో ఐదు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అరెస్టు అయిన వారిలో బి.కోడూరు మండలం తంగేడుపల్లెకు చెందిన చెల్లా గురుప్రసాద్ అలియాస్ ప్రసాద్, నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన పత్తిరత్నం ఉన్నారు. వీరిలో గురుప్రసాద్ బద్వేలు రేంజ్ పరిధిలోని లక్కవారిపల్లె బీటులో 2013 నుంచి ప్రొటెక్షన్ వాచర్‌గా పనిచేస్తున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అలవాటుపడిన గురుప్రసాద్, రత్నం అనే వ్యక్త్తితో కలసి ఎర్రచందనం అక్రమ రవాణా సాగిస్తుండేవాడు. రత్నంపై ఇది వరకే నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసుస్టేషన్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. దుంగలతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం దుంగలు స్వాధీనం లక్కిరెడ్డిపల్లె మండలంలోని పాళెంగొల్లపల్లె పంచాయతీ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ హుస్సేన్ వారి సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. దుంగలు స్వాధీనం చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒకరు అదుపులో ఉన్నట్లు తెలిసింది.