‘ఎర్ర' స్మగ్లింగ్‌లో మరో ఇంటి దొంగ
ఆత్మకూరు: ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో అటవీశాఖ ఉద్యోగి మరొకరు పోలీసులకు చిక్కారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ఏబీఓ) రంగయ్యను అరెస్ట్ చేశారు. వివరాలను ఆత్మకూరు ఎస్సై జి.వేణుగోపాల్‌రెడ్డి శనివారం స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే పలువురు అటవీశాఖ, పోలీసు సిబ్బందిని అరెస్ట్ చేశామని తెలిపారు.
ఈ క్రమంలోనే వరికుంటపాడు మండలం కడియంపాడుకు చెందిన రంగయ్య కృష్ణాపురం చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తూ స్మగ్లర్లకు సహకరిస్తుండటాన్ని గుర్తించామన్నారు. నిందితుడిని శనివారం నెల్లూరుపాళెం సెంటర్‌లో అరెస్ట్ చేసి ఆత్మకూరు కోర్టులో హాజరుపరిచామన్నారు. స్మగ్లింగ్ ను పూర్తిగా నిరోధించే చర్యలను కొనసాగిస్తున్నామని ఎస్సై చెప్పారు.