టాస్క్‘ఫోర్స్’ ఏదీ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదనడానికి ఇది నిదర్శనం. స్మగ్లింగ్‌కు చెక్ పెట్టడానికి ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నియామకాన్ని నిర్వీర్యం చేయడమే అందుకు తార్కాణం. ఇదే అదునుగా ఎర్ర’ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి.. స్మగ్లర్లను అణచివేయడానికి జూన్ 25, 2013న ప్రభుత్వం ఆర్భాటంగా టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
పోలీసు, అటవీశాఖ అధికారులను డెప్యుటేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌లో నియమంచింది. డీఎస్పీ స్థాయి అధికారిని టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా నియమించింది. ఇద్దరు సీఐలు, ఒక అసిస్టెంట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, నలుగురు ఎస్‌ఐలు, నలుగురు ఫారెస్ట్ రేంజర్లు, వందమంది ఏఆర్ విభాగం పోలీసులను టాస్క్‌ఫోర్స్‌కు కేటాయించింది. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా తనకు సన్నిహితుడైన ఉదయ్‌కుమార్‌ను అప్పటి సీఎం కిరణ్ నియమించారు.
మంజూరు చేసిన పోలీసు, అటవీ శాఖ నుంచి డెప్యుటేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌కు సి బ్బందిని కేటాయించారు. ఏడాదిపాటు పూర్తి స్థాయి సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ విధులను నిర్వర్తించినా.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోయింది. టాస్క్‌ఫోర్స్‌లోని కొందరు అధికారులు అప్పట్లో ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్త్తున్న నేత సోదరుడు సాగిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూర్తి స్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తా యి.
కానీ.. అప్పట్లో ప్రభుత్వం ఎ లాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలపై ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్ ఓఎస్డీగా ఏఆర్ డీఎస్పీ ఇలియాజ్ బాషా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వ కీలకనేత సోదరుడు సాగించిన ఎర్రచందనం దందాకు సహకరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యం లోనే టాస్క్‌ఫోర్స్ నుంచి సీఐ, ఎస్‌ఐ, పోలీసు సి బ్బంది, అటవీశాఖ సిబ్బంది డెప్యుటేషన్‌లను రద్దు చేసుకుని మాతృశాఖల్లో విధుల్లో చేరుతున్నారు. ఇద్దరు సీఐలు, ఎస్‌ఐలు ఇప్పటికే మాతృశాఖలో విధుల్లోకి చేరారు. మరో ఇద్దరు ఎస్‌ఐలు అదే బాట న పయనిస్తున్నారు. ఏఆర్ పోలీసులు సైతం టాస్క్‌ఫోర్స్‌లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు.
దీనికి ప్రధాన కారణం.. సరైన వేతనాలు, అధునాతన ఆయుధాలు, వాహనాలు, సదుపాయాలు లేకపోవడమే. అటవీశాఖ సిబ్బందిదీ అదే తీరు. ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యమైపోయింది. శేషాచలం అడవుల్లో దాదాపుగా కూంబింగ్ నిలిచిపోయింది. ఇదే అదునుగా తీసుకున్న ‘ఎర్ర’ స్మగ్లర్లు యథేచ్ఛగా స్మగ్లింగ్‌ను కానిచ్చేస్తున్నారు.