- తాడుతో గొంతు బిగించి హత్యచేసి రైలు పట్టాలపై పడేసిన వైనం..
- ఎర్రచందనం రవాణాలో విభేదాలే కారణం
- నలుగురు నిందితుల అరెస్టు
వడమాలపేట: గత ఏడాది నవంబర్ 15వ తేదీన పూడి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ యువకుడిని హత్య చేసి పడేసిన సంఘటనకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు తిరుపతి అదనపు ఎస్పీ త్రిమూర్తులు తెలిపారు. శుక్రవారం వడమాలపేట పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు.
గత ఏడాది నవంబర్ 15వతేదీన ఓ యువకుడిని హత్యచేసి పూడి రైల్యేస్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై పడేశారు. హతుడి వేలిముద్రల ఆధారంగా పలమనేరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన జి. రాజేంద్రగా (23) గుర్తించారు. ఈ కేసు మిస్టరీని ఛేదించే బాధ్యతను స్వీకరించిన రేణిగుంట రూరల్ సీఐ సాయినాథ్, వడమాలపేట ఎస్‌ఐ ఈశ్వరయ్యలు రాజేంద్ర కుటుంబ సభ్యులను కలసి కొంత సమాచారం సేకరించారు.
కొంతమంది అనుమానితుల పేర్లు తీసుకొని వారిపై నిఘావేశారు. కృష్ణాపురం గ్రామానికి చెందిన జ్ఞానేంద్ర, చిన్నగొట్టిగల్లు మండలం పిచ్చికుంట్లపల్లికి చెందిన వెంకటరమణ, పాపానాయుడుపేటకు చెందిన టి.రవి, తిరుపతి ఎస్టీయు కాలనీకి చెందిన హరిలు రాజేంద్రతో కలసి ఎర్రచందనం అక్రమ రవాణా చేసేవారు. వ్యాపారంలో గొడవలు రావడంతో రాజేంద్ర వారి నుంచి విడిపోయాడు. ఆ తర్వాత జ్ఞానేంద్ర తదితరులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు దొరికారు.
తమ గురించి రాజేంద్రనే పోలీసులకు సమాచారం అందిస్తున్నాడని అనుమానించి అతన్ని హతమార్చాలని నిర్ణయించుకొన్నారు. గొడవలు మరచి పోయి అందరం కలిసి వ్యాపారం చే ద్దామని రాజేంద్రను నమ్మించి పులిచర్లకు రప్పించారు. అక్కడ అందరూ కలసి మద్యం తాగారు. తరువాత కారులో తిరుపతికి బయలు దేరారు. రాజేంద్ర మత్తులో ఉండగా తాడుతో గొంతు బిగించి చంపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు.
తమకు అందిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్య తామే చేసినట్లు వారు అంగీకరించారు. నిందితుల్లో ఒకడైన జ్ఞానేంద్రకు తమిళనాడు లోనూ పలు దోపిడీలు, దొంగతనాలతో సంబంధం ఉందని అదనపు ఎస్పీ తెలిపారు. నిందితులను పుత్తూరు కోర్టుకు తరలించగా రిమాండ్‌కు ఆదేశించారు. మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్‌ఐలకు రివార్డులు ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు.