భారీగా ఎర్రచందనం పట్టివేత
పెనుకొండ/అనంతపురం/తాడిపత్రి :
జిల్లాలో గురువారం భారీఎత్తున ఎర్రచందనం పట్టుబడింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో 185 దుంగలను అటవీ శాఖాధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉం టుందని అధికారులు తెలిపారు. పెనుకొండ మండలం రాంపురం- వెంకటరెడ్డిపల్లి మధ్య 44వ జాతీయ రహదారిపై రూ.10 లక్షల విలువచేసే 150 దుంగలను జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) రాఘవయ్య, అధికారులు చంద్ర బాలాజీ, శ్రీధర్‌రావు బృందం పట్టుకుంది.
వీటిని ఐచర్ వాహనంలో బెంగళూరు వైపు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ బృందం కాపు కాసింది. అక్రమ రవాణాదారులు రాప్తాడు మండలంలోని మరూరు టోల్‌గేట్ వద్ద సైతం వాహనాన్ని ఆపకుండా పక్కదారి గుండా తప్పించుకొని పెనుకొండ వైపు వెళ్లారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో అటవీ శాఖ అధికారులు ఆ వాహనాన్ని వెంటాడారు. పెనుకొండ సమీపంలో హైవే పెట్రోలింగ్ వాహనాన్ని చాకచక్యంగా అడ్డుపెట్టి ఐచర్‌ను ఆపారు.
అందులోని ముగ్గురు వ్యక్తులు కిందకు దూకి కంపచెట్లలోకి పారిపోయారు. హరిపురం గ్రామస్తుల సహాయంతో తమిళనాడుకు చెందిన సతీష్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు దొరకలేదు. వాహనంలో 150 దుంగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని వాహనంతో సహా అటవీ శాఖ పెనుకొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు. స్కార్పియో వాహనంలో సీట్ల కింద ఆరు ఎర్రచందనం దుంగలను దాచి .. నంద్యాల నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తుండగా మా రూరు టోల్‌గేట్ వద్ద అటవీ శాఖ మొబైల్ టీం సభ్యులు పట్టుకున్నారు. నలుగురు దొంగలను అరెస్టు చేశారు.
స్కార్పియో వాహనంతో పాటు దొంగలను అనంతపురం తరలించారు. దుంగలవిలువ రూ.3 లక్షల పైగా ఉంటుందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామచంద్రనాయక్ తెలిపారు. కర్నూలు జిల్లా మహాదేవపురం నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో తరలిస్తున్న రూ.2 లక్షల విలువ చేసే 605 కిలోల 29 ఎర్రచందనం దుంగలను తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు.
ఆరుగురిని అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇవి పట్టుబడినట్లు తాడిపత్రి రూరల్ సీఐ వెంకటరెడ్డి, ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు. మహాదేవపురం గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా, వైఎస్సార్ జిల్లా ముద్దునూరుకు చెందిన గుజరీ వ్యాపారి బాబ్జీ, డోన్ పట్టణానికి చెందిన వాహన డ్రైవర్ గురుమూర్తి, అంకిరెడ్డిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి, కూలీలు విజయరెడ్డి, బాషాను అరెస్టు చేశామన్నారు.