అగ్రనేతలే లక్ష్యంగా..
- పోలీసుల మెరుపుదాడి
- తప్పించుకున్న మావోయిస్టులు
- నడింవీథి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
గూడెంకొత్తవీధి: మన్యంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగలింది. ఆ పార్టీ అగ్రనేతలు లక్ష్యంగా పోలీసులు జరిపిన మెరుపుదాడిలో మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతలు ఏజెన్సీలోని జీకేవీధి మండలం సిరిబాల అటవీ ప్రాంతంలో రెండు మూడు రోజులుగా గిరిజనులతో సమావేశమవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని భద్రత బలగాలు జల్లెడ పట్టాయి. నడింవీధి అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి గాలిస్తున్న పోలీసులకు సమావేశం ముగించుకొని వస్తున్న దళసభ్యులు తారస పడ్డారు.
ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. చీకటిగా ఉండటంతో మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకున్నారు. దీంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఇరువర్గాల ఎదురుకాల్పుల్లో భారీ నష్టం జరిగిందనే ప్రచారం సాగింది. సంఘటన ప్రదేశం మారుమూల ప్రాంతం కావడం, రాత్రి సమయంతో పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.పోలీసులు శనివారం ఉదయం ఆ ప్రాంతంలో గాలించగా దళసభ్యులకు సంబంధించిన సామగ్రి దొరికింది. 303 తుపాకీ, 3 కిట్‌బ్యాగులు, 2 మందుపాత్రలు, 12 రౌండ్ల తూటాలు, మావోయిస్టుల దుస్తులు, కత్తులు, మందుపాత్రకు ఉపయోగించే వైరు బండిల్, తొడుగులు, మాత్రలు, విప్లవసాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
తప్పిన ముప్పు..: మావోయిస్టులకు పెను ముప్పు తప్పింది. రాత్రిపూట కాల్పులతో తప్పించుకున్నారు. మన్యంలో బాక్సైట్ ఉద్యమం ఉధృతం చేసే క్రమంలో తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈనేపథ్యంలో గత నెల 26న ఒడిశా జాంబాయ్ వద్ద కూంబింగ్ చేస్తున్న బీఎస్‌ఎఫ్ బలగాలపై మెరుపుదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లోకి వారు మకాం మార్చినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు గ్రామాల్లో గిరిజనులతో దళసభ్యులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు లేఖలతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాక్సైట్ ఉద్యమం ఉధృతికి సన్నాహాలు ముమ్మరం చేశారు. ఒకే ప్రాంతంలో రెండు మూడు రోజులుగా ఉంటూ గిరిజనులతో భారీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దళసభ్యులతోపాటు, మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు భావించిన పోలీసులు తమదైన శైలిలో శుక్రవారం రాత్రి గాలింపు ముమ్మరం చేశారు.
పక్కా సమాచారంతోనే గాలింపు
జీకేవీధి/చింతపల్లిరూరల్: ఏజెన్సీలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతోనే గాలింపు కొనసాగిస్తున్నామని ఎస్పీ కోయ ప్రవీణ్ అన్నారు. శనివారం జీకేవీధి, చింతపల్లి పోలీసు స్టేషన్‌లను సందర్శించారు. అనంతరం పోలీసు అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత నెల 26న ఒడిశాలో బీఎస్‌ఎఫ్ జవాన్లపై దాడి అనంతరం దళసభ్యులు బృందాలు గాలికొండ ఏరియావైపు వచ్చినట్టు సమాచారం ఉందన్నారు. దీంతో గాలింపు చేపట్టామన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఏ ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. అంతకు ముందు జీకేవీధి నుంచి ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశానికి బైక్‌పై వెళ్లారు.
సంఘటన చోటు చేసుకున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనలో మావోయిస్టులకు గట్టిదెబ్బ తగిలేదని, చీకటి కావడంతో తమ బలగాల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నట్టుఎస్పీ తెలిపారు. ఈ సంఘటనలో ఒకరిద్దరు దళసభ్యులకు గాయాలయినట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు వదిలి వెళ్లిన సామాగ్రిని పరిశీలించారు. ఎటువంటి పోలీసు బందోబస్తు లేకుండా స్థానిక సీఐ,ఎస్పీ ఆ ప్రాంతంలో పర్యటించడం పలువురిని ఆశ్ఛర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఏఎస్పీ సత్య ఏసుబాబు, సీఐ వెంకటరావు, స్థానిక సీఐ రుద్రశేఖర్, ఎస్‌ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.