చికిత్స పొందుతున్న వర్క్ ఇన్‌స్పెక్టర్ రవినాయక్
అదొక ప్రభుత్వ కార్యాలయం. అప్పుడప్పుడే అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో అధికార పార్టీ నేత వచ్చారు. నేరుగా వర్క్ ఇన్‌స్పెక్టర్ వద్దకు వెళ్లి తాను చెప్పిన వ్యక్తి పేరిట ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసి ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయాలని హుకుం జారీ చేశాడు. తన పరిధి మేరకే నడుచోగలనని చెప్పిన వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహంతో ఊగిపోయాడు. అందరూ చూస్తుండగానే వర్క్ ఇన్‌స్పెక్టర్ చెంపను చెల్లుమనిపించాడు. బలంగా గుద్దడంతో గాయపడ్డాడు.
అనంతపురం, కొత్తచెరువు: కొత్తచెరువు హౌసింగ్ కార్యాలయంలో అధికారుల సాక్షిగా హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ రవినాయక్‌పై టీడీపీ మండల కన్వీనర్ దామెదర్‌నాయుడు దాడి చేశాడు. సోమవారం ఉదయం రవినాయక్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండగా దామెదర్ నాయుడు అక్కడకు వచ్చాడు. తన బంధువు ఎం.హరిప్రసాద్ ఇంటి నిర్మాణం పూర్తి అయిందని, ఫొటో తీసుకుని వెంటనే బిల్లులు మంజూరు చేయాలని చెప్పాడు. ఇంటి నిర్మాణంలో పునాది వరకు తన బాధ్యతని, తర్వాత ఏఓతో మాట్లాడండి అని వర్క్‌ఇన్‌స్పెక్టర్ సమాధానం చెప్పాడు. ‘నేను చెప్పినా వినవా’ అంటూ రవినాయక్ చెంపపై దామోదర్‌నాయుడు బలంగా గుద్దాడు. తోటి ఉద్యోగులు జోక్యం చేసుకుని విడిపించారు.
అయినా దామోదర్‌నాయుడు ఆగ్రహం చల్లారలేదు. వర్క్ ఇన్‌స్పెక్టర్ బ్యాగును ఆఫీసు నుంచి బయటకు విసిరేశాడు. కులం పేరును ప్రస్తావిస్తూ పత్రికలో రాయలేని పదజాలంతో దూషించాడు. దాడిలో గాయపడిన రవినాయక్‌ను తోటి ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పెనుకొండకు పంపించారు. టీడీపీ నాయకుల ఒత్తిడి కారణంగా తమ సార్ మల్లికార్జున ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని బాధితుడు రవినాయక్ ఆరోపించాడు. అనంతరం హౌసింగ్ అధికారి భాస్కర్‌రావు, లంబాడీ హక్కుల సంఘం నాయకులతో కలిసి బాధితుడు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నాడు. కులం పేరుతో దూషించి, దాడి చేసిన దామోదర్‌నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment