బాహాబాహీకి దిగిన టీడీపీ నాయకులు
రామసముద్రం: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తినాని సాక్షిగా నాయకులు బాహాబాహీకి దిగారు. శుక్రవారం స్థానిక జనార్థనస్వామి ఆలయంలో టీడీపీ సమావేశం నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా నాని హాజరయ్యారు. టీడీపీ నాయకులు రమణ, శ్రీనివాసులు, తిప్పన్న తదితరులు మండల టీడీపీ అధ్యక్షుడు కృష్ణమరాజుపై విరుచుకుపడ్డారు. పార్టీని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీరు–చెట్టులో ఆదాయం ఉన్నపనులను మండలాధ్యక్షుడు కృష్ణమరాజు రూ.3 కోట్ల వరకు పనులు చేశారని, ఆదాయం లేని పనులను ఇతర నాయకులు, కార్యకర్తలకు కట్టబెడుతున్నాడని మండిపడ్డారు. దీంతో సమావేశంలోనే ఒకరికొకరు బాహాబాహీకి దిగడంతో పులివర్తినాని కంగుతిన్నారు.
ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఎవరూ తగ్గలేదు. అరుపులు, కేకలతో సమావేశం మార్మోగింది. జేబులు నింపుకోవడానికే నాయకులు కుమ్ములాడుకుంటున్నారని, తమ గురించి పట్టించుకోవడం లేదంటూ మరోవైపు కార్యకర్తలు నిరసన గళం వినిపించారు. ఎట్టకేలకు నాని వారిని శాంతింపజేసి మాట్లాడారు. ఈనెల 28న గుంటూరులో జరిగే టీడీపీ ‘మారా హమారా టీడీపీ హమారా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రప్పనాయుడు, నియోజకవర్గ నాయకులు రాందాస్‌చౌదరి, బోడిపాటి శ్రీనివాసులు, మధుబాబు, స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment