వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం
► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్త వాతావరణం
► పోడియం, చానల్స్ లోగోలను లాక్కున్న పీతల సుజాత, అనిత
► టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
సాక్షి, అమరావతి: అసెంబ్లీ మీడియా పాయిం ట్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యానికి దిగారు. మాట్లాడుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళా ఎమ్మెల్యేల నుంచి చానళ్ల లోగోలను లాక్కున్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగానే మంత్రి పీతల సుజాత వారి నుంచి లోగోలు లాక్కుని మాట్లడడానికి ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు మహిళా ఎమ్మెల్యేల మధ్యలోకి వచ్చి వారిని గెంటివేసి లోగోలు లాక్కునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు వారిని ప్రతిఘ టించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక దశలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్ధాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈశ్వరి వర్సెస్ అనిత: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో మీడియా పాయింట్‌లో మాట్లాడేందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సహచర ఎమ్మెల్యేలతో కలసి బయలుదేరారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనిత, సౌమ్య, మీసాల గీత వారికన్నా ముందుగా మీడియా పాయింట్‌కు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేశారు. చాలాసేపు వేచిచూసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పుష్పశ్రీవాణి, పి.రాజేశ్వరీ, కళావతి ఆ ఆరోపణలను ఖండించేందుకు ప్రయత్నిం చారు. సీఎం చంద్రబాబు తల నరకాలని తాను అన్నట్టు టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపిస్తున్నారని, తాను అన్నట్టు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని గిడ్డి ఈశ్వరి సవాల్ చేశారు. దీంతో ఈ అంశంపై అనిత, ఈశ్వరి మధ్య వాగ్వాదం జరిగింది.
టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం
మంత్రి పీతల సుజాత, టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఈశ్వరి నుంచి చానల్స్‌కు చెందిన లోగోలను తమ వైపునకు లాక్కుని ప్రసంగించడం ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, అప్పలనాయుడు సైతం మీడియా పోడియంను తమవైపునకు లాక్కున్నారు. పోడియంకు ఒకవైపున వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, మరోవైపున టీడీపీ ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించడంతో ఎవరేం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్ధితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, సునీల్‌కుమార్ తదితరులు మీడియా పాయింట్‌కు చేరుకుని తమ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తీసుకువెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది.