రుణమాఫీపై మరో డ్రామా | TDP Another drama In farm loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై మరో డ్రామా

Published Sun, Dec 9 2018 12:23 PM | Last Updated on Sun, Dec 9 2018 12:23 PM

TDP Another drama In farm loan waiver - Sakshi

రుణమాఫీ జరగని రైతులతో ప్రభుత్వం మరోమారు చెలగాటం ఆడనుంది. తనిఖీల పేరుతో తప్పులను చూపెట్టి వారి గొంతు నొక్కే ప్రయత్నానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారి కోపాన్ని చల్లార్చేందుకు ఇదో ఎత్తుగడగా ఎంచుకుంది. బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది చేసిన తప్పిదాల వల్లే తాము అర్హత కోల్పోయామని రైతులు గగ్గోలు పెడుతున్నా సర్కారు చెవులకెక్కడం లేదు. కేవలం కారణాలను చూపి వెనక్కు పంపేందుకు మాత్రమే మరోసారి వినతుల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. 

చిత్తూరు అగ్రికల్చర్‌: గత ఎన్నికల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని టీడీపీ ప్రకటించి అధికారం చేపట్టింది. తీరా చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక రుణమాఫీకి సవాలక్ష ఆంక్షలు విధించింది.  నిబంధనలతో రైతులను ముప్పుతిప్పలు పెట్టింది. మాఫీ అవుతుందని కలలుగన్న రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. 2013 డిసెంబరు నాటికి జిల్లాలో 8,69,721 మంది రైతులు రూ.7,693.75 కోట్ల మేరకు  బ్యాంకులకు రుణపడి ఉన్నారు. అందులో మాఫీకి విధించిన ఆంక్షల వడపోతలో 3,87,630 మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని తేల్చింది. కేవలం రూ.1,430 కోట్ల మేరకే మాఫీ కిందకు తీసుకువచ్చింది. ఈ రుణాలను కూడా ఐదు విడతల్లో మాఫీ చేసేవిధంగా ప్రణాళికలు రూపొం దించింది. ఇప్పటివరకు మూడు విడతలుగా రూ.1,126 కోట్లు మాఫీ చేసింది. మరో రూ.304 కోట్లు చేయాల్సి ఉంది. 

అర్హత ఉన్నా..
రుణమాఫీలో అర్హత ఉన్నా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల వల్ల సగానికి పైగా రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. వారంతా ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ వ్యతిరేకతను గమనించిన ప్రభుత్వం తప్పులుంటే సరిదిద్దుతామని చెప్పింది. రుణమాఫీ జాబితాలో లేని వారు వివరాలను అందించాలంటూ ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ను పెట్టింది. దీంతో రుణాలు మాఫీ అవుతాయని ఆశతో చాలామంది తమ వివరాలను అధికారులకు నివేదించారు. వీరి ఫిర్యాదులపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.  ప్రతి సోమవారమూ ప్రజావాణిలో రైతుల ఫిర్యాదులకూ ఇంతవరకు అతీగతీ లేదు.

మరోమారు ఆశల ఎర..
రుణమాఫీ జరగక ఆగ్రహంతో ఉన్న రైతులలో సర్కారు మరోమారు ఆశలను రేకెత్తిస్తోంది. ఈ నెల 11, 12 తేదీల్లో మరోమారు వినతులివ్వాలని చెబుతోంది. ఇందుకోసం ప్రత్యేక ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. చిత్తూరులోని నాగయ్య కళక్షేత్రంలో నిర్వహించే కేంద్రానికి అమరావతి రైతు సాధికార సంస్థ నుంచి కొందరు సిబ్బంది హాజరవుతారు. ఫిర్యాదులను మరోమారు పరిశీలిస్తారని చెబుతున్నారు. గతంలో బ్యాంకర్లు, రెవెన్యూ అధికా రుల తప్పిదాల వల్లే తాము రుణమాఫీ అర్హతకు దూరమయ్యామనే భావన రైతుల్లో ఉంది. నాలుగున్నరేళ్లుగా వాటిని సరిదిద్దిన పాపాన పోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్లీ తమలో ఆశలు కల్పించేందుకు ఈ కేంద్రం నిర్వహిస్తున్నారని కొందరు రైతులు విమర్శిస్తున్నారు. ఫిర్యాదుల కేంద్రంలో బ్యాంకర్లు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో తప్పులను సరిదిద్దాలని వీరు కోరుతున్నారు. ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోకుండా ఫిర్యాదు కేంద్రంలో బ్యాంకర్లు లేకుండానే రైతుల తప్పులను చూపెట్టి గొంతు నొక్కడమే పనిగా పెట్టుకుంది. ఇదో కంటితుడుపు చర్యగా ఇప్పటికే బాధిత రైతాంగం గుర్తించింది. 

మా ఊళ్లో ఎవరికీ వర్తించలేదు
మా గ్రామంలో 2009లో  16మంది రూ.50వేలు లోపే పుంగనూరు ఎస్‌బీఐ బ్యాంకులో పం ట రుణాలు తీసుకున్నాం. ఒక్కరికీ రుణమాఫీలో అర్హత రాలేదు. నాలుగేళ్లుగా అధికారులకు విన్నవిన్తున్నాం. విజయవాడకు వెళ్లాం. రాష్ట్ర రైతు సాధికార సంస్థలో కూడా కోరాం.  బ్యాంకర్లు, అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతున్నారే తప్ప మాఫీ చేయడం లేదు. వినతులకే ఒక్కొక్కరికి రూ.4వేలు చొప్పున ఖర్చు అయ్యింది. 
     బి.నారాయణరెడ్డితో పాటు     బాధిత రైతులు, పెద్దపంజాణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement