టీడీపీ, బీజేపీలు ప్రమాదకరం | TDP, BJP dangerous | Sakshi
Sakshi News home page

టీడీపీ, బీజేపీలు ప్రమాదకరం

Published Fri, Apr 11 2014 3:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

టీడీపీ, బీజేపీలు ప్రమాదకరం - Sakshi

టీడీపీ, బీజేపీలు ప్రమాదకరం

అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే అందుకు తెరవెనుక సహకరించిన బీజేపీ, టీడీపీలే ప్రమాదకరం... అంతటితో ఆగకుండా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు మరింత ప్రమాదకరమని జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షులు, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జి.వి.హర్షకుమార్‌లు అన్నారు. అమలాపురంలోని నల్లవంతెన సమీపంలో జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ఎంపీలు ఇద్దరూ గురువారం సాయంత్రం ప్రారంభించారు.
 
అనంతరం ఆ కార్యాలయ ఆవరణలో జరిగిన సభలో వారు మాట్లాడారు. సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేల మెజార్టీ వాదనను పరిగణలోకి తీసుకోకుండా కేవలం టీఆర్‌ఎస్ గొంతెమ్మ కోర్కెలకు కాంగ్రెస్ సాగిలబడి రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఎంపీలు అన్నారు. అందుకు బీజేపీ పార్లమెంటులో సహకరిస్తే... రాష్ట్రంలో చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీ రాష్ట్ర విభజనలో భాగస్వాములయ్యాయని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు ఇప్పుడు తగుదునమ్మా అంటూ పొత్తులు పెట్టుకుని ఉమ్మడిగా ఓట్లడగడం విడ్డూరంగా ఉందన్నారు.
 
ఈ పొత్తుతో టీడీపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు మరింత ప్రమాదమని ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన రాష్ట్ర విభజన అంశాన్ని సుప్రీంకోర్టులో విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆంధ్రప్రజల మనోభావాలకు అనుగుణంగానే తీర్పు ఇస్తుందని ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ఎంపీలు ఇద్దరూ తమ తమ ప్రసంగాల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఏ పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిందో... మేమంతా ఆయన వెనుక ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సభకు వివరించే ప్రయత్నం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమంది తమ పార్టీ వెనుక వస్తారనుకున్నామని... తమ దిష్టిబొమ్మలు తగలేసినా తాము సమైక్యాంధ్ర కోసమే పాటుపడ్డామని చెబుతూ వారంతా ఇప్పుడేమయ్యారని సభలో ఎంపీలు ప్రశ్నించారు.
 
అంతకుముందు వారు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభావేదికపై అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లుగా నెల్లి కిరణ్‌కుమార్, జి.వి.శ్రీరాజ్, స్వామినాయక్‌లను పరిచయం చేస్తూ వారే అభ్యర్థులని ప్రకటించారు.

అమలాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ నెల్లి కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అల్లు బాబి, రాజమండ్రి సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు చెరుకూరి
రామారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement