రచ్చకెక్కిన టీడీపీ, బీజేపీ విబేధాలు
పాలకొల్లు : అధికార తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీహీరో పవన్‌కల్యాణ్ జన్మదిన వేడుక సందర్భంగా ఆయన అభిమానులు పాలకొల్లులో నరసాపురం ఎంపీ, బీజేపీ నేత గోకరాజు గంగరాజుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లు చేరుకున్న గంగరాజు ఈ విషయాన్ని తెలుసుకుని ఈ కార్యక్రమానికి హాజరుకాకుండానే వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. గంగరాజు గైర్హాజరీతో కంగుతిన్న పవన్ అభిమానులు బీజేపీ జెండాలను తొలగించి నిరసన వ్యక్తం చేశారు.
వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పవన్ కల్యాణ్ అభిమానులు పోశింశెట్టి బాబి, జానపాముల బాలకృష్ణ, మండెల జీజీ నేతృత్వంలో మంగళవారం రక్తదానం, వృద్ధాశ్రమం, అంజలి మానసిక వికలాంగుల స్కూల్ విద్యార్థులకు భోజనాలు, పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ, మారుతీ థియేటర్ సెంటర్‌లో అన్నసమారాధన తదితర సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగానే ఎంపీ గోకరాజు గంగరాజు అంగీకారంతో ఆయనకు సన్మానం చేయాలని నిర్ణయించారు. పవన్ జన్మదిన వేడుకలకు భారీ ప్రచారం కూడా నిర్వహించడంతో మంగళవారం పెద్దసంఖ్యలో అభిమానులతోపాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ఎంపీ గంగరాజును భారీ మోటారుసైకిళ్లతో ర్యాలీగా సన్మాన వేదిక వద్దకు తీసుకురావడానికి గాంధీబొమ్మల సెంటర్‌కు వెళ్లిన పవన్‌అభిమానులు ఎంపీ రావడం లేదని తెలుసుకుని నివ్వెరపోయారు. మోటార్‌సైకిళ్లకు కట్టిన బీజేపీ జెండాలను తొలగించి నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ రాకపోవడానికి గల కారణాలు ఆరా తీయగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల తాను లేకుండా సన్మానానికి ఎలా హాజరవుతారంటూ ఎంపీని నిలదీసినట్లు తెలిసింది. దీంతో బీజేపీ నాయకులు ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించే పవన్ జన్మదిన వేడుకల్లో ఎంపీని పాల్గొనకుండా ఎమ్మెల్యే అడ్డుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
పట్టణంలో అనేక సంఘాల నుంచి సన్మానాలు పొందిన ఎమ్మెల్యే ఎంపీ సన్మానంలో పాల్గొనకుండా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ కారణంగానే టీడీపీ అధికారంలోనికి వచ్చిన సంగతి మర్చిపోయిన ఎమ్మెల్యే రామానాయుడు పవన్ జన్మదిన వేడుకల్లో ఎంపీని పాల్గొనకుండా అడ్డుకుని పవన్ అభిమానులను కించపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బీజేపీ, టీడీపీ నేతల మధ్య విబేధాలు నెలకొనడంతో ఈ వివాదం మున్ముందు ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే ఇరు పార్టీల నేతల్లో చర్చనీయాంశమైంది.