రైలుపేట (గుంటూరు): తనను చంపడానికి రాష్ట్ర ప్రభుత్వం గూండాలను పంపిందని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తన ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించిన నేపథ్యంలో కన్నా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. వివరాలు.. గుంటూరు కన్నావారితోటలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసాన్ని విజయవాడ నుంచి వచ్చిన టీడీపీ నేతలు శనివారం ఉదయం ముట్టడించారు. సుమారు గంటసేపు ఆయన ఇంటి ఎదుట బైఠాయించి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో కన్నాతో పాటు మరో ఇద్దరు మాత్రమే ఇంటిలో ఉన్నారు. ముట్టడి విషయం తెలిసి పోలీసులు వచ్చినా.. టీడీపీ వారిని అదుపు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో కన్నా కూడా వారికి ఎదురుగా కూర్చున్నారు.
బీజేపీ యువమోర్చా నేతలు టీడీపీ నేతలను అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో మరింత మంది పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని లాడ్జిసెంటర్ నుంచి శంకర్‌విలాస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం నగరంపాలెం పోలీసు స్టేషన్ వద్ద నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, కన్నాను చంపుతామంటూ బెదిరిస్తూ.. ఇంటిపైకి రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు నగరంపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, ఈ ఘటనను కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రతిపక్ష నేతలు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్‌పై విశాఖలో కత్తితో దాడిచేశారని నేడు తనను చంపేందుకు ప్రయత్నించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment