సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ విశాఖలో నిర్వహించుకుంటున్న మహానాడుకు వచ్చిన తమ్ముళ్లకు మహానాడు ప్రాంగణం, చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు విరక్తి పుట్టిస్తున్నాయి. దీంతో వారు సాగరతీరానికి వెళ్లిపోతున్నారు. శనివారం నుంచి విశాఖలో జరుగుతున్న మహానాడులో మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. దాదాపు గంటన్నర సేపు సుదీర్ఘంగా ఉపన్యసించారు. చంద్రబాబు ప్రసంగం ఆరంభించిన కాసేపటికే సభ నుంచి కార్యకర్తలు, నాయకులు బయటకు రావడం మొదలెట్టారు. దీంతో సభలో కుర్చీలు చాలావరకు ఖాళీ అయిపోయాయి. బయటకు వచ్చిన వారు భోజనాలు చేసి సాగరతీరానికి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు ఆందోళన చెందారు.
వెంటనే అప్రమత్తమై ‘తమ్ముళ్లూ..! ఇప్పుడే బయటకు వెళ్లకండి.. సాయంత్రం వేళ బీచ్‌కు వెళ్లండి.. మహానాడు ముగిశాక ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉండి బీచ్‌తో పాటు అరకు, బొర్రాగుహలు వంటివి చూడండి.. అంతేగాని సభ జరుగుతున్నప్పుడు బయటకు వెళ్లిపోకండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. అయినా అధినేత విన్నపాన్ని ‘తమ్ముళ్లు’ పట్టించుకోలేదు. కార్యకర్తలందరూ తొట్లకొండ, రుషికొండ, భీమిలి తదితర ప్రాంతాలకు వెళ్లిపోయి చీకటిపడే వరకూ అక్కడే గడిపారు. సాక్షాత్తూ అధినేత ప్రసంగాన్నే పట్టించుకోకుండా కార్యకర్తలు వెళ్లిపోతుండడంతో ఆ పార్టీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు కనిపించడం వారికి మింగుడు పడడం లేదు. ఆది, సోమవారాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తనుందన్న అనుమానంతో ‘తమ్ముళ్ల’ను కట్టడి చేసే పనిలో పడ్డారు. మరోవైపు తొలిరోజు మహానాడుకు చాలా తక్కువ సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 30 వేల మంది జనం నిలబడేందుకు వీలుంది. ఈ మైదానంలోని సగం స్థలంలోనే ఏర్పాట్లు చేశారు. అంటే ఈ స్థలంలో గరిష్టంగా చూసుకున్నా 15 వేల మందికి మించి కూర్చునే అవకాశం లేదు. మహానాడు ప్రాంగణంలో కుర్చీలన్నీ ఖాళీగానే కనిపించాయి. మొత్తమ్మీద మహానాడు ఆరంభమైన తొలిరోజున 12, 13 వేలకు మించి పార్టీ శ్రేణులు హాజరు కాలేదని అంచనా వేస్తున్నారు.
ఏపీ నేతల రుసరుసలు
ఇటీవలే హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ తెలంగాణ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు. విశాఖలో జరుగుతున్న మహానాడుకు తెలంగాణ నేతలతో సహా 3,500కు పైగా పార్టీ ప్రతినిధులు హాజరుకావడం.. తెలంగాణ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టడంతో ఏపీకి చెందిన పలువురు నేతలు రుసరుసలాడారు. హైదరాబాద్‌లో తెలంగాణ మహానాడు జరిగింది కదా? దానికి బాబు కూడా వెళ్లారు కదా? మళ్లీ ఇక్కడెందుకు వారి మెహర్బాని అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
బాబు స్పీచ్‌లో... తమ్ముళ్లు బీచ్‌లో
Published Sun, May 28 2017 3:23 AM | Last Updated on Sat, Jul 28 2018 2:46 PM
Advertisement
Advertisement