టీడీపీ ‘చౌక’ రాజకీయం !
నా పేరు దొరైరాజ్ గౌడ్, శ్రీకాళహస్తి మండలం మంగళపురి పంచాయతీలో పది సంవత్సరాల పాటు చౌకదుకాణ డీలర్‌గా పని చేశాను. సరుకుల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉన్నాను. నాపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాననే నెపంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అన్యాయుంగా తొలగించారు. అధికార పార్టీ నేతలకు కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ డీలర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. రాజకీయుంగా తొలగిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
⇒ కార్యకర్తలకు రేషన్‌షాపుల అప్పగింత
⇒ వందల సంఖ్యలో డీలర్ల మార్పు
⇒ జిల్లాలో మొత్తం దుకాణాలు 2,831
⇒ ఇన్‌చార్జ్‌లతో నడుస్తున్నవి 390
⇒ అస్తవ్యస్తంగా పౌరసరఫరాల వ్యవస్థ
⇒ పేదలకు అందని నిత్యావసర సరుకులు
⇒ బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న వైనం
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వ చౌకదుకాణాల్లో పేదలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదు. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను ఇన్‌చార్జ్ డీలర్లుగా నియమించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుత ప్రభుత్వం బియ్యం, చక్కెర, కిరోసిన్ మాత్రమే చౌక దుకాణాల ద్వారా అందిస్తోంది. గత ప్రభుత్వ హయంలో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, పసుపు, కారంపొడి, గోధుమపిండి తదితర వస్తువులను సరఫరా చేసే వారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్నీ కనుమరుగైపోయాయి.
బియ్యం, చక్కెర,అప్పుడప్పుడు కిరోసిన్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. అధిక శాతం చౌకదుకాణాల్లో డీలర్లు కిరోసిన్ సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. కొందరు డీలర్లు రెండు మూడు నెలలకొకసారి కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. చక్కెర సైతం పండుగ సమయాల్లో మాత్రమే అందిస్తున్నారు. కొంతమంది డీలర్లు డీడీలు ఆలస్యంగా చెల్లించి నెల చివరన బియ్యం తెచ్చి ఆ తరువాత నెలలో రెండు మూడు రోజులు మాత్రమే పంపిణీ చేసి మధ్యన ఒక నెల సరుకులు ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. మరికొందరు నెలమార్చి నెల బియ్యం పంపిణీ చేస్తూ మిగిలిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లందరూ దాదాపుగా మూడు రోజులకు మించి సరుకులు పంపిణీ చేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో వారానికి మించి పంపిణీ చేయడం లేదు.
అది కూడా రోజులో గంటో అరగంట సమయంలో మాత్రమే సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో సరుకులు తీసుకెళ్లకపోతే తరువాత వెళ్లినా ఇవ్వడం లేదు. ఎక్కువ మంది డీలర్లు ప్రభుత్వ గోడౌన్లలోనే అమ్మకానికి పెడుతున్నారు. డీలర్ల వద్ద సేకరించిన చౌకబియ్యాన్ని వ్యాపారులు పాలిష్ చేసి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. కిరోసిన్, చక్కెర సైతం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో అర్హులైన పేదలకు నిత్యావసరసరుకులు సక్రమంగా అందడం లేదు.
సరుకులు సక్రమంగా చూడాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ విభాగం, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు డీలర్ల వద్ద మామూళ్లు పుచ్చుకుంటూ తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోతున్నారు. మొక్కుబడిగా మాత్రమే 6 (ఏ) కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యంతో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గతంలో ఉన్న చౌకదుకాణాల డీలర్లలో చాలా మందిని తొలగించి వారి స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను ఇన్‌చార్జ్ డీలర్లుగా నియమించారు.
జిల్లాలో మొత్తం రేషన్‌షాపులు 2831, ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతున్నవి 390. తిరుపతి డివిజన్‌లో మొత్తం చౌకదుకాణాలు 703 ఉండగా, 113 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. చిత్తూరు డివిజన్‌లో 911 చౌకదుకాణాలుండగా, 91 షాపులు ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. మదనపల్లె డివిజన్‌లో 1217 షాపులకు గాను 186 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని చౌకదుకాణాలకు పర్మినెంట్ డీలర్లు నియమించాల్సిన అధికారులు నేతల ఒత్తిళ్లతో ఇన్‌చార్జ్ డీలర్లనే కొనసాగిస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా చౌకదుకాణాల పరిస్థితి
⇒ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం షాపులు 216, రెగ్యులర్ 143, ఇన్‌చార్జ్‌లు 63, టీడీపీ అధికారంలోకి వచ్చాక 37 చౌకదుకాణాలలో డీలర్లను మార్చి తన కార్యకర్తలకు అప్పగించారు.
⇒ నగరి నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో 200 చౌకదుకాణాలున్నాయి. 107 రెగ్యులర్ డీలర్లుండగా, 93 షాపులు ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిండ్ర మండలంలో 28 షాపులను టీడీపీ కార్యకర్తలకు అప్పగించారు.
⇒ మదనపల్లె నియోజకవర్గ పరిధిలో 171 షాపులుండగా, ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది 25. టీడీపీ అధికారంలోకి వచ్చాక 7 షాపులకు డీలర్లను మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు రోజులు మాత్రమే సరుకులు ఇస్తున్నారు. పట్టణాల్లో 12 రోజులు మాత్రం సరుకులను ఇస్తున్నారు. కిరోసిన్ సక్రమంగా ఇవ్వడం లేదు.
⇒ పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం షాపులు 233. ఇన్‌చార్జ్‌లతో ఉన్నవి 24 షాపులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పులిచెర్ల మండలంలో 10 చౌకదుకాణ డీలర్లను మార్చారు.
⇒ సత్యవేడు నియోజకవర్గంలో 261 షాపులుండగా, ఇన్‌చార్జ్‌లతో 28 కొనసాగుతోంది. సరుకులు పంపిణీ సక్రమంగా జరగడం లేదు.
⇒ పలమనేరు నియోజకవర్గంలో 181 షాపులుండగా, 26 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది.
⇒ గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 250 షాపులుండగా, 69 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది.
⇒ కుప్పం నియోజకవర్గంలో 178 షాపులకు గాను 69 షాపులకు ఇన్‌చార్జ్‌లు కొనసాగుతున్నారు.
⇒ పూతలపట్టు నియోజకవర్గంలో 235 షాపులకు గాను 189 రెగ్యులర్ డీలర్లుండగా, 35 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 11 షాపులను అధికార పార్టీ కార్యకర్తలకు అప్పగించారు.
⇒ పీలేరు నియోజకవర్గంలో ఆరు మండలాల పరిధిలో 265 చౌకుదుకాణాలున్నాయి. వీటిలో 60 దుకాణాలు ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 10 చౌకదుకాణాల పరిధిలో గతంలో ఉన్న వారిని తొలగించి టీడీపీ కార్యకర్తలకు అప్పగించారు. నియోజకవర్గంలో ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా లేదు. చంద్రగిరి, తంబళ్లపల్లె, చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాల్లోనూ పౌరసరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది.