టీడీపీలో ఉక్కు ఫ్యాక్టరీ సెగలు రగులుతున్నాయి. కంబాలదిన్నెలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించడాన్ని ఆ ముగ్గురు మినహా తక్కిన నాయకులంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాప్రయోజనం లేదు.. పార్టీ ప్రయోజనం అంతకన్నా కాదు... వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడుతున్నారు.’ ముందువచ్చిన చెవుల కంటే వెనుకవచ్చిన కొమ్ములు వాడీ’ అన్నట్లుగా అధిష్టానం ఏకపక్ష చర్యలకు మొగ్గు చూపడంపై ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి కడప: ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నది జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారం పంచుకున్న టీడీపీ నాలుగున్నరేళ్లు పరిశ్రమ నెలకొల్పేందుకు కనీస చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. విభజన చట్టంలోని ఓ అంశంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఉన్నా, అమలు పర్చేందుకు ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. పైగా ఎన్నికల గడువు సమీపించడంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సరికొత్త నాటకం తెరపైకి తెచ్చారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో దీక్ష చేయించడం, ఆపై ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించడం అంతా నాటకీయ పరిణామమేనని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈనెల 27న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కంబాలదిన్నెలో ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జిల్లా టీడీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు మంత్రి ఆదినారాయణరెడ్డి వైఖరిపై భగ్గుమంటున్నారు.
మంత్రిపై భగ్గుమంటున్న శ్రేణులు..
జిల్లాలో మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న వారికంటే కూడా ఇటీవల టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి అన్ని విధాలుగా లబ్ధిపొందుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై పులివెందుల ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి అంతర్గత సమావేశంలో నిలదీసినట్లు తెలుస్తోంది. కంబాలదిన్నెలో ఉక్కుపరిశ్రమ శంకుస్థాపన జమ్మలమడుగు నియోజకవర్గానికి మినహా మరెవ్వరికైనా ప్రయోజనం ఉంటుందా అని నిలదీసినట్లు సమాచారం. ఎంపీ రమేష్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మినహా తక్కిన నాయకులంతా సతీష్‌రెడ్డి వాదనను బలపరుస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, విశ్వనాథనాయుడు, పుత్తానరసింహారెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు కంబాలదిన్నెలో శంకుస్థాపనకు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా అన్ని విధాలుగా లబ్ధిపొందిన దేవగుడి కుటుంబం అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ కుటుంబాన్ని దూషిస్తూ, టీడీపీలో చేరితే భుజానికి ఎత్తుకొని జిల్లాలో అగ్రపీఠం వేస్తున్నారని పలువురు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆదికి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం అధికారం అనుభవించేందుకు వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పార్టీ కార్యక్రమంలో కాలు ఫ్యాక్చర్ అయితే కనీస పరామర్శకు కూడా నోచుకోలేదని పలువురు ఉదహరిస్తున్నారు. పార్టీలోని ఇతర జిల్లాల ప్రముఖులు పరామర్శించినా జిల్లా మంత్రిగా ఆది పార్టీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతుండడం విశేషం.
వాసుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రేణులు..
మంత్రి ఆది నియంతృత్వపోకడలను అధ్యక్షుడుగా మీరైనా అడ్డుకట్ట వేయాలి కదా., అంటూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై మండిపడుతున్నట్లు సమాచారం. వాస్తవాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు నియంత్రించే చర్యలు చేయకుండా వెనుకేసుక రావడం ఏమిటనీ నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి చర్యలను నియంత్రించాల్సిన ఎంపీ, ఎమ్మెల్సీలు ఎవరివాటా వారికి ఉంటుందనే రీతిలో‘నిమ్మకు నీరెత్తినట్లు’గా వ్యవహరిస్తుంటే అధ్యక్షుడు సరైన రీతిలో మీరైనా నడిపించాలి కదా...అంటూ ప్రశ్నల సంధిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారం కోల్పోతే, ఆదినారాయణరెడ్డి కొనసాగుతారా.. జిల్లాలో పార్టీని ఏమి చేయాలనుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పైగా ఇప్పుడిప్పుడే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే అవకాశం లేనప్పుడు, కడప సమీపంలో శంకుస్థాపన ఏర్పాటు చేసింటే పార్టీకి ప్రయోజనం అధికంగా ఉండేదని పలువురు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment