iron factory
-
బలైపోతున్న కార్మికులు
సాక్షి, కొత్తూరు: కార్మికుల భద్రత కోసం ఎన్నో చట్టాలు ఉన్నా ఎక్కడా సరిగా అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేమి నిర్వాహకులకు వరంగా మారింది. ఎప్పుడైనా ప్రమాదాలు జరిగితే నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని పరిశ్రమల్లో ఏమాత్రం అనుభవం లేని కార్మికులతో పనులు చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు జరగడం, కార్మికులు మృత్యుఒడికి చేరడం సాధారణ విషయంగా మారిపోయింది. తమ ప్రాంతంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు కొత్తూరు పారిశ్రామిక వాడలో పనిచేసేందుకు వస్తున్నారు. పొట్టకూటి కోసం వస్తున్న వారు తరచూ ప్రమాదాలు జరగడంతో ఇక్కడే బలైపోతూ సొంత ప్రాంతాలకు విగతజీవులుగా వెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాంట్రాక్టర్లు, పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నచందంగా మారింది. పరిశ్రమల్లో తరచూ తనిఖీలు చేసి కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లాలోని కొత్తూరు, నందిగామ మండలాల్లో ఐరన్, స్పాంజ్ ఇనుము పరిశ్రమలు పదులసంఖ్యలో ఉన్నాయి. ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. భద్రత ఎండమావే.. ముఖ్యంగా ఐరన్, స్పాంజ్ ఇనుము పరిశ్రమల నిర్వాహకులు కార్మికుల కోసం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. యంత్రాల వద్ద పనిచేసే కార్మికులకు రక్షణ పరికరాలను సైతం సమకూర్చడం లేదు. అనుభవం ఉన్న కార్మికులను విధుల్లో పెట్టుకుంటే ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుందనే దురుద్దేశంతో ఏమాత్రం అనుభవం లేని కార్మికులను పనలో పెట్టుకోవడంతో ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. కార్మికులకు రక్షణ పరికరాలను ఇవ్వకపోవడం, యంత్రాల పనితీరుపై అవగాహన లేకపోవడం, ప్రమాదాలు సంభవిస్తే తప్పించుకునే జాగ్రత్తలు తెలియక చిన్నచిన్న ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినా సంబంధిత కంపెనీల నిర్వాహకులు ఏమాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. ఎంతోకొంత బాధితులకు పరిహారం ముట్టజెప్పి చేతులెత్తేస్తున్నారు. విషయం వెలుగులోకి రాకుండా మిగతా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకా రం ప్రతి పరిశ్రమలో భద్రతా అధికారి (సెఫ్టీ ఆఫీసర్) నిత్యం కార్మికులకు భద్రతపై అవగాహన కల్పించాలి. అనుకోకుండా ప్రమాదాలు సంభవిస్తే ఎలా వ్యవహరించాలి.. ప్రమాదాలను ఎలా నివారించాలి అనే అంశాలపై తర చూ ప్రదర్శనలు(మాక్ డ్రిల్) నిర్వహించాలి. అంతేకాకుండా యంత్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి కార్మికుడు తప్పకుండా రక్షణ పరికరాలను వినియోగించే విధం గా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఎక్కడా అమ లు కావడం లేదు. ఇక్కడి పారిశ్రామికవాడలో పదుల సంఖ్యలో కంపెనీలు ఉన్నా రెండుమూడు పరిశ్రమల్లోనే సెఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు ఐరన్ పరిశ్రమల్లో ఎక్కువగా ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారికి కార్మిక చట్టాలు.. రక్షణ పరికరాల గురించి అంతగా అవగాహన లేదు. ఇదే అదనుగా భావిస్తున్న పరిశ్రమల యాజమాన్యాలు తమ కంపెనీల్లో 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తే అందులో 40 మందికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్, తదితర సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను కూడా అమలు చేయడం లేదు. క్వాటర్స్‌లో ఉండే కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ అంశాలను పరిశ్రమల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తరచూ తనిఖీలు చేస్తున్నా కార్మికుల భద్రతపై చర్యలు తీసుకోకున్న దాఖలాలు లేవు. పరిహారం అంతంతే నిబంధనల ప్రకారం ఏదైనా పరిశ్రమలో ప్రమాదం జరిగితే వెంటనే నిర్వాహకులు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారులతోపాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కాగా ఇక్కడి నిర్వాహకులు మాత్రం ప్రమాదాలు జరిగితే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ కార్మికులు ప్రమాదాల బారినపడి మృతిచెందితే వారి మృతదేహాలను ఆస్పత్రి నుంచే వారి బంధువులకు అప్పగించడం.. స్వస్థలాలకు చేరవేయడం హడావిడిగా చేస్తున్నారు. ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. అంతేతప్ప నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఇవ్వడం లేదు. ఒకవేళ విషయం బయటకు వచ్చి బాధితులు కార్మిక సంఘాలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేస్తే తప్ప వారికి న్యాయం జరగడం లేదు. జరిగిన ప్రమాదాలు ఇవీ.. కొత్తూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ ఐరన్ పరిశ్రమలో (ఫర్నస్)బాయిలర్ పేలిన ప్రమాదంలో ఐదేళ్ల క్రితం పదిమంది మృతి చెందారు. పారిశ్రామికవాడలోని రాయలసీమ ఇండస్ట్రీస్‌లో నాలుగేళ్ల కాలంలో పలు ప్రమాదాలు జరిగాయి. నలుగురు కార్మికులు మృతిచెందగా పలువురు గాయపడ్డారు తీగాపూర్ శివారులో పాత టైర్లను కాల్చే పరిశ్రమలో ఆరేళ్ల క్రితం బాయిలర్ఢ్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోయారు. నందిగామ మండలంలోని శివశక్తి, జాగృతి పరిశ్రమల్లో బాయిలర్ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. తాజాగా గురువారం రాత్రి తీగపూర్ శివారులోని మానసరోవర్ పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు నేను విధులు నిర్వహిస్తున్న ఐరన్ పరిశ్రమలో యాజమాన్యాలు కనీస వసతులు కల్పించడం లేదు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు లేనేలేవు. చివరకు పనికితగిన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. రేకుల షెడ్డులే క్వాటర్స్గా మార్చారు. అనారోగ్యానికి గురైనా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. వేతనాలు, సౌకర్యాల గురించి ప్రశ్నిస్తే యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు వేధిస్తున్నారు. – ఓ కార్మికుడి ఆవేదన తనిఖీ అధికారం మాకు లేదు పరిశ్రమలు కార్మికుల సేఫ్టీకి చర్యలు తీసుకుంటున్నారో లేదో తనిఖీ చేసే అధికారం మాకు లేదు. ఒక జిల్లా అధికారులు.. మరో జిల్లాకు వెళ్లి ర్యాండమ్‌గా పరిశీలిస్తారు. ఈమేరకు ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. ఫిర్యాదులు వస్తేనే మేము క్షేత్రస్థాయి కి వెళ్లి ఆరా తీయాల్సి ఉంటుంది. కొత్తూ రు మండలంలోని మానస సరోవర్ పరి శ్రమలో బాయిలర్ పేలడంతో కార్మికుడి మృతికి కారణమైన కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాగే ఘటన విషయాన్ని మాకు తెలియజేయకపోవడమూ నేరమే. దీనిపైనా చర్యలు ఉంటాయి. – కె.శ్రీనివాస్, ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ -
టీడీపీలో రగులుతున్న ఉక్కు సెగలు!
టీడీపీలో ఉక్కు ఫ్యాక్టరీ సెగలు రగులుతున్నాయి. కంబాలదిన్నెలో శంకుస్థాపన చేయాలని నిర్ణయించడాన్ని ఆ ముగ్గురు మినహా తక్కిన నాయకులంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రజాప్రయోజనం లేదు.. పార్టీ ప్రయోజనం అంతకన్నా కాదు... వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడుతున్నారు.’ ముందువచ్చిన చెవుల కంటే వెనుకవచ్చిన కొమ్ములు వాడీ’ అన్నట్లుగా అధిష్టానం ఏకపక్ష చర్యలకు మొగ్గు చూపడంపై ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి కడప: ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నది జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారం పంచుకున్న టీడీపీ నాలుగున్నరేళ్లు పరిశ్రమ నెలకొల్పేందుకు కనీస చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. విభజన చట్టంలోని ఓ అంశంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఉన్నా, అమలు పర్చేందుకు ఎలాంటి ఒత్తిడి పెంచలేదు. పైగా ఎన్నికల గడువు సమీపించడంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సరికొత్త నాటకం తెరపైకి తెచ్చారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌తో దీక్ష చేయించడం, ఆపై ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ప్రకటించడం అంతా నాటకీయ పరిణామమేనని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈనెల 27న ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కంబాలదిన్నెలో ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జిల్లా టీడీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు మంత్రి ఆదినారాయణరెడ్డి వైఖరిపై భగ్గుమంటున్నారు. మంత్రిపై భగ్గుమంటున్న శ్రేణులు.. జిల్లాలో మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న వారికంటే కూడా ఇటీవల టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డి అన్ని విధాలుగా లబ్ధిపొందుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై పులివెందుల ఇన్చార్జి సతీష్‌రెడ్డి అంతర్గత సమావేశంలో నిలదీసినట్లు తెలుస్తోంది. కంబాలదిన్నెలో ఉక్కుపరిశ్రమ శంకుస్థాపన జమ్మలమడుగు నియోజకవర్గానికి మినహా మరెవ్వరికైనా ప్రయోజనం ఉంటుందా అని నిలదీసినట్లు సమాచారం. ఎంపీ రమేష్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మినహా తక్కిన నాయకులంతా సతీష్‌రెడ్డి వాదనను బలపరుస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, విశ్వనాథనాయుడు, పుత్తానరసింహారెడ్డి, రమేష్‌రెడ్డి తదితరులు కంబాలదిన్నెలో శంకుస్థాపనకు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా అన్ని విధాలుగా లబ్ధిపొందిన దేవగుడి కుటుంబం అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ కుటుంబాన్ని దూషిస్తూ, టీడీపీలో చేరితే భుజానికి ఎత్తుకొని జిల్లాలో అగ్రపీఠం వేస్తున్నారని పలువురు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆదికి టీడీపీ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కేవలం అధికారం అనుభవించేందుకు వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ పార్టీ కార్యక్రమంలో కాలు ఫ్యాక్చర్ అయితే కనీస పరామర్శకు కూడా నోచుకోలేదని పలువురు ఉదహరిస్తున్నారు. పార్టీలోని ఇతర జిల్లాల ప్రముఖులు పరామర్శించినా జిల్లా మంత్రిగా ఆది పార్టీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించకపోవడాన్ని పలువురు ఎత్తిచూపుతుండడం విశేషం. వాసుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రేణులు.. మంత్రి ఆది నియంతృత్వపోకడలను అధ్యక్షుడుగా మీరైనా అడ్డుకట్ట వేయాలి కదా., అంటూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై మండిపడుతున్నట్లు సమాచారం. వాస్తవాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు నియంత్రించే చర్యలు చేయకుండా వెనుకేసుక రావడం ఏమిటనీ నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి చర్యలను నియంత్రించాల్సిన ఎంపీ, ఎమ్మెల్సీలు ఎవరివాటా వారికి ఉంటుందనే రీతిలో‘నిమ్మకు నీరెత్తినట్లు’గా వ్యవహరిస్తుంటే అధ్యక్షుడు సరైన రీతిలో మీరైనా నడిపించాలి కదా...అంటూ ప్రశ్నల సంధిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారం కోల్పోతే, ఆదినారాయణరెడ్డి కొనసాగుతారా.. జిల్లాలో పార్టీని ఏమి చేయాలనుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పైగా ఇప్పుడిప్పుడే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే అవకాశం లేనప్పుడు, కడప సమీపంలో శంకుస్థాపన ఏర్పాటు చేసింటే పార్టీకి ప్రయోజనం అధికంగా ఉండేదని పలువురు నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. -
రాయలసీమ హక్కుల కోసం పోరాడుతాం
కడప కోటిరెడ్డి సర్కిల్ : రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, రాయలసీమ హక్కుల కోసం పోరాటం సాగిస్తామని రాయలసీమ అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ ఓబుల్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాలలో రాయలసీమ వెనుకబడి ఉందని, ఇందుకోసం రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు చేశామని, ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. అనంతరం జనార్దన్ మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కమిటీని ఎన్నుకున్నారు. నగర కమిటీ అధ్యక్షులుగా ఉరిమి జనార్దన్, కో కన్వీనర్‌గా దావుద్దీన్, చంద్రమోహన్‌రెడ్డి, సభ్యులుగా కుమార్, శివ నాయక్, శ్యాంసన్, ముక్తియార్బాష, రవి చక్రవర్తి, రమేష్, వెంకటరాజు, గంగన్న, ఈశ్వరయ్య, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, నాగార్జుననాయక్, సుబ్బరాయుడులను ఎన్నుకున్నారు. -
రాయలసీమకు ప్రత్యక ప్యాకేజీ ఇవ్వాలి
ప్రొద్దుటూరు కల్చరల్: అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ, రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ గేయానంద్ కోరారు. మంగళవారం ప్రొద్దుటూరులో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో రాయలసీమకు పొందుపరిచిన ఉక్కు కర్మాగారం, రూ.24వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజి, యూనివర్సిటీలు, పరిశ్రమలు, ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినప్పుడు నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. సీమకు నీరు, నిధులు విస్తృతంగా లభించినప్పుడే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్‌రెడ్డి, సీపీఎం నాయకులు సత్యనారాయణ, అన్వేష్, రచయిత జింకా సుబ్రమణ్యం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం
కడప రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయని టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశం ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఈ ప్రాంతం అనుకూలంగా లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యానించడం తగదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఇక్కడ ఉన్న అనుకూల అంశాలను వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై స్పందించాలని సాయిప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎల్.నాగసుబ్బారెడ్డి, వెంకటశివ, డబ్లు్య రాము, గంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.