ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం
కడప రూరల్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయని టీడీపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశం ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి ఈ ప్రాంతం అనుకూలంగా లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి వ్యాఖ్యానించడం తగదన్నారు.
ఉక్కు ఫ్యాక్టరీకి ఇక్కడ ఉన్న అనుకూల అంశాలను వివరించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై స్పందించాలని సాయిప్రతాప్‌కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణమూర్తి, ఎల్.నాగసుబ్బారెడ్డి, వెంకటశివ, డబ్లు్య రాము, గంగా సురేష్ తదితరులు పాల్గొన్నారు.