ఉరూరా తిరగాలి.. హోదా కోసం చంద్రబాబునాయుడు కృషిని వివరించాలి.. ప్రతిఒక్కరినీ కలసి హోదా కోసం టీడీపీ చేస్తున్న కార్యక్రమాలను వివరిం చాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలి. ఇది టీడీపీ రూపొందించిన సైకిల్ యాత్ర కార్యక్రమ సారాంశం. అయితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో తెలియకో.. బీజీగా ఉన్నారో కానీ జిల్లాలో సైకిల్ యాత్రలు కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయి. పర్యవసానంగా జిల్లాలో పార్టీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతుందనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకు రోజుకో రీతిలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయు డు మొదలుకుని నియోజకవర్గ ఇన్‌చార్జిల వరకు అందరూ మాట్లాడారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో సష్టమైన అవగాహన ఉంది. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని నీరుగార్చారు. దీనిపై గ్రామస్థాయిలో కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత అధికార పార్టీ మూటగట్టుకుంది. ఈ క్రమంలో సైకిల్ యాత్ర ద్వారా అయినా జనాల్లోకి వెళ్లాలని భారీ షెడ్యూల్‌ను రూపొందించి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలపై కార్యక్రమాన్ని రుద్దారు.
ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జిల్లాలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని షెడ్యూల్ రూపొందించారు. ఈ షెడ్యూల్ జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవటం పార్టీ పరిస్థితికి నిదర్శనం. జిల్లాలో యాత్రలు సరిగా జరగకపోతే మరో వారం రోజులు పొడిగించాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో సైకిల్ యాత్రలు నిర్వహిస్తున్న నేతలకు స్థానిక పరిస్థితులు కత్తిమీద సాములా మారాయి. మరోవైపు కొందరు ఇన్‌చార్జిలు, ఎమ్మెల్యేలు అయితే అసలు ఈ యాత్రల గోల ఏంటని నియోజకవర్గాలకే పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
ప్రజలకేం చెప్పాలి?
టీడీపీ నేతల్లో ప్రజల వ్యతిరేకత భయం వెంటాడుతోంది. నాలుగేళ్లుగా ఏమీ చే యకుం డా బీజేపీతో దోస్తీ కట్టి ఇప్పుడు తప్పు అంతా బీజేపీపై రుద్ది ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందాలన్నదే సైకిల్ యాత్ర అంతిమ లక్ష్యం. ప్రజల్లోకి వెళితే వారు ప్రశ్నిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వారికి ఏం చెప్పాలి.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కొందరు నాయకులు ఈ యాత్రలు మనకొద్దని నిర్ణయించినట్లు సమాచారం.
3 నియోజకవర్గాల్లో ప్రారంభంకాని యాత్రలు
జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో గత వారం రోజుల్లో సైకిల్ యాత్రలు మొక్కుబడిగా జరగ్గా, మిగిలిన మూడు నియోజకవర్గాలైన ఆత్మకూరు, సూళ్లూరుపేట, కావలిలో అసలు ప్రారంభం కాని పరిస్థితి. బిజీ షెడ్యూల్ తర్వాత మంత్రి సోమిరెడ్డి శనివారం పొదలకూరులో సైకిల్‌యాత్ర నిర్వహించారు. వెంకటగిరిలో కార్యకర్తలే సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. కనీసం ఒక్కచోట కూడా ఎమ్మెల్యే కురుగుండ్ల పాల్గొన్న దాఖాలాల్లేవు. నెల్లూరులో సిటీ ఇన్‌చార్జి శ్రీధరకృష్ణారెడ్డితో పాటు మంత్రి నారాయణ పాల్గొన్నారు.
ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆయన సోదరుడు వివేకానందరెడ్డి మరణంతో నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కావలి ఇన్‌చార్జిగా ఉన్న బీద మస్తానరావు వ్యాపారాల పనిమీద విదేశాల్లో బిజీగా ఉండి శనివారం స్వదేశానికి వచ్చారు. సూళ్లూరుపేట ఇన్‌చార్జి పరసా రత్నం ఇంతవరకు యాత్ర ఆలోచనే చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment