శ్రీకాకుళం టౌన్ : నగర పాలక సంస్థగా శ్రీకాకుళం రూపుదిద్దుకున్న తరువాత కూడా ఎన్నికలు నిర్వహించే దమ్ము తెలుగుదేశం ప్రభుత్వానికి లేకపోవడం వల్ల అవినీతి రాజ్యమేలుతోందని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. కలెక్టరేట్‌లో నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జాయింట్ కలెక్టర్ వివేక్‌యూదవ్‌ను ఆయన చాంబరులో శనివారం కలిసిన ఆయన కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు. అవినీతిపై వినతిపత్రం అందజేశారు.
పాలకవర్గం గడువు ముగిసి రెండేళ్లు పూర్తవుతున్నా ఎన్నికలంటే చంద్రబాబు ప్రభుత్వానికి భయమేస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్దం గా ఎన్నికలు జరపకుండా అడ్డదారిలో దోపిడీకి తెర తీసిందన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు గుర్తించి క్రమబద్దీకరణకు ప్రభుత్వం పలు విధానాలు అవలంభించిందని, నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి పన్నుల పేరిట భారీ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డుల్లో ప్రతి ఇంటికీ మూడు రెట్లు వంతున పన్నులు పెంచి టీడీపీ నేతల జోక్యంతో బేరాలు కుదుర్చుకొని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
చెల్లిస్తున్న పన్నులకు కొంత మాత్ర మే రసీదు ఇచ్చి మిగతా మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని చెప్పారు. దీనికి సంబంధించి తక్షణమే విచారణ చేయూలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.40కోట్లు నిధులు తీసుకువచ్చి జనానికి తాగునీటి అవసరాలు తీర్చామని, గత రెండేళ్లలో ఆ పథకాన్ని మూలకు చేర్చారని ధర్మాన తన ఫిర్యాదులో జేసీకి వివరించారు. దీనిపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సత్వరమే లోపాలు సరిదిద్దకపోతే ప్రజలతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఆయన వెంట వైఎస్‌ఆర్ సీపీ నేతలు మాజీ జెడ్పీ చైర్మన్ వై.వి.సూర్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎంవీ పద్మావతి, మాజీ కౌన్సిలర్లు గుమ్మా నగేష్, ధర్మాన రఘునాథనాయుడు, అంధవరపు సూరిబాబు , ఎంఏ రఫీ, బలగ పండరీనాథ్, కర్నేని పద్మావతి, కెల్ల కొండలరావు, కస్పా శ్యామలరావుతో పాటు శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, సాధు వైకుంఠరావు, కేఎల్ ప్రసాద్, మండవల్లి రవి, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, పి.జీవరత్నం, టి.కామేశ్వరి, ఆర్‌ఆర్ మూర్తి, కోరాడ రమేష్, వూన నాగరాజు, భైరి మురళి, కె.సీజ్, పాలిశెట్టి మధుబాబు, కిల్లాన సాయి, తంగుడు నాగేశ్వరరావు, కోణార్క్ శ్రీను, పోతల రామారావు, ఎన్.శ్రీను, రావాడ జోగినాయుడు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ బాధ్యతారాహిత్యం : ధర్మాన
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత లేని పాలన సాగిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. కలెక్టరేట్ వద్ద విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతుందని చంద్రబాబు చెబుతున్న మాటలకు పాలనకు ఎక్కడా పొంతన లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 16 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించామని చెబుతున్నారే తప్ప ఆచరణలో శూన్యంగా కనిపిస్తుందన్నారు. రైతులు, మహిళలు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో కూడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు.
కార్పొరేషన్‌లో టీడీపీ దందా
Published Sun, Apr 3 2016 12:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement