► టీడీపీ జిల్లా కమిటీ ఎన్నిక వాయిదా
► అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వరకే పరిమితం
► చివరి క్షణంలో ప్రధాన కార్యదర్శి మార్పు
► నేతలపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి
► కమిటీ ఎంపిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేల సుదీర్ఘ చర్చ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ జిల్లా కమిటీ ఎంపికపై ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వరకే పరిమితం చేశారు. మిగిలిన కమిటీ సభ్యుల ఎంపికకు మరో రెండు రోజులు పడుతుందని పార్టీ నాయకులు ప్రకటించారు. ఎంతో ఆశతో సమావేశానికి వచ్చిన తమ్ముళ్లు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళ్లటం కనిపించింది. అయితే దాదాపు అనుబంధ సంఘాల అధ్యక్షులను ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల్లో మిగిలిన సభ్యుల కూర్పు సరిగా లేకపోవటంతో ప్రస్తుతానికి ఎంపికను వాయిదా వేసినట్లు తెలిసింది.
అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ.. ఆయా అనుబంధ సంఘాల అధ్యక్షుల ఎంపికపై తెలుగుతమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పార్టీ కోసం జెండాలు మోసిన వారిని పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వటంపై తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికల కోసం శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్‌చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. పదవులు వస్తాయని ఎంతో ఆశతో సమావేశానికి వచ్చిన కొందరు నాయకులకు నిరాశ ఎదురైంది.
పదేళ్లు జెండా మోసినందుకు ప్రతిఫలం దక్కుతుందని భావించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది.. పదవులు తప్పక లభిస్తాయని ఆశించిన తమ్ముళ్లు కొందరికి కమిటీలో చోటు లేదని తెలుసుకుని సమావేశం మధ్యలోనే వెళ్లిపోవటం కనిపించింది. మరికొందరు చివరి దాకా ఉండి నిరుత్సాహంతో తిరిగి వెళ్లారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేరు శనివారం ఉదయం 10 గంటలకు కమిటీ జాబితాలో ఉంది. అయితే కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నివాసంలో జరిగిన సమావేశం తరువాత అనూహ్యంగా చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డినే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
పట్టాభి పేరును ఎమ్మెల్యే, కోవూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా నేతలు కొందరు వ్యతిరేకించటంతో మంత్రి నారాయణ చేజర్లనే తిరిగి కొనసాగించాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలుగుయువత జిల్లా అధ్యక్షుడుగా ఎంపికైన శింగంశెట్టి రవిచంద్రను ఆ పదవిని ఆశిస్తున్న కొందరు వ్యతిరేకించారు. శింగంశెట్టి 2011లో పార్టీలో చేరారని, అయితే తాము అంతకంటే ముందు నుంచి పనిచేస్తున్నా తమకు గుర్తింపు ఇవ్వరెందుకని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే జిల్లా అధ్యక్షుడు బీద శింగంశెట్టికే కట్టబెట్టేందుకు పట్టుబట్టినట్లు తెలిసింది.
అదేవిధంగా ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన పొత్తూరు శైలజకు తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని కట్టబెట్టుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పొత్తూరుకు అధ్యక్ష పదవిని ఇవ్వటాన్ని కొందరు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం తాము మొదటి నుంచి పనిచేస్తున్నా.. తమను కాదని కొత్తవారికి ఇవ్వటాన్ని వ్యతిరేకించి కొందరు మహిళలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులుగా జన్ని రమణయ్య పేరు దాదాపు ఖరారైంది. అయితే ఇతను ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఆదాల ప్రభాకరరెడ్డితో పార్టీలో చేరారు. పార్టీలో సీనియర్లను కాదని రమణయ్యకు అధ్యక్షపదవి కట్టబెట్టటంపై కొందరు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో మరి కొన్ని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శ పదవులపై గందరగోళం నెలకొంది. కమిటీ ఎంపిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అర్థరాత్రి వరకు పార్టీ కార్యాలయంలోనూ తిష్టవేసి కసరత్తు చేశారు. అయితే ఏకాభిప్రాయం కుదురకపోవటంతో కమిటీ ఎంపికను వాయిదా వేయటం గమనార్హం.
ఎంతకీ కుదర్లే..
Published Sun, May 17 2015 5:02 AM | Last Updated on Sat, Aug 11 2018 3:37 PM
Advertisement