
రాజధాని కోసం టీడీపీలో రెండు వర్గాలు!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ఏర్పాటు చేసిన భూసేకరణ కమిటీలో సీనియర్ మంత్రులను పక్కనపెట్టారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి విమర్శించారు. సోమవారం రాజధాని కమిటీపై మాట్లాడిన ఆయన.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేబినెట్ లో బీసీ మంత్రులకు అవమానం జరుగుతోందన్నారు. కొత్త రాజధానిలో బడుగు, బలహీన వర్గాలు కూడా బతికేలా ప్రభుత్వం అనుకూల వాతావరణాన్ని సృష్టించాలన్నారు.విజయవాడ పరిసరాల్లో టీడీపీ రియల్ ఎస్టేట్ కంపెనీలు 10వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోందన్నారు.
టీడీపీ రియలెస్టేట్ వ్యాపారల్లో లాభనష్టాలు బేరీజు వేసుకున్నాకే కొత్త రాజధాని ఎక్కడనే విషయంపై స్పష్టత వస్తుందన్నారు. పోలవరం టెండర్ ఫైనలేజషన్‌లో పెదబాబుకు, చినబాబుకు దక్కిన వాటాలెంతో చెప్పాలని పార్థసారధి డిమాండ్ చేశారు. పోలవరం టెండర్‌లో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని ఆయన సూచించారు. ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ చేతగాని దద్దమలా వ్యవహరిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణంలో భూమి ఇచ్చిన రైతులకు .. అదే విస్తీర్ణంలో భూములు ఇవ్వాలన్నారు. రాజధాని కోసం టీడీపీలో రెండు వర్గాలు పోటీపడుతున్నాయన్నారు. సుజనాచౌదరి గ్రూపు అమలాపురం కావాలిని, సీఎం రమేష్ వర్గం నూజివీడును చేయాలని పట్టుబడుతున్నాయన్నారు.