వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందిస్తామంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన వాహనాలు తిరిగి అదే పార్టీ కార్యాలయానికి చేరుకోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది.
పార్టీ కార్యాలయం నుంచి ఆర్భాటంగా బయలుదేరిన ట్రక్కులు... తిరిగి అక్కడికే చేరుకున్న వైనం
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందిస్తామంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన వాహనాలు తిరిగి అదే పార్టీ కార్యాలయానికి చేరుకోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. వరద బాధితులకు సహాయం అందిస్తామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన తర్వాత కొంత సామగ్రిని బాధిత ప్రాంతాలకు పంపుతున్నామంటూ సోమవారం పార్టీ నేతలు హడావుడి చేశారు. వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నామంటూ కొన్ని ట్రక్కులను ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు జెండా ఊపి ప్రారంభించారు.
ఆ ట్రక్కులను ఎక్కడకు పంపుతున్నారో తెలుసుకుందామని ఒక మీడియా చానెల్ వాటిని వెంబడించగా అసలు సంగతి బయటపడింది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి బయలుదేరిన ఆ ట్రక్కులు పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు ఒకటి మీదుగా వెళ్లి, రోడ్డు నెంబరు 10, బసవతారకం కేన్సర్ ఆసుపత్రి మీదుగా తిరిగి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నాయి. టీడీపీ వైఖరిని, ద్రోహాన్ని ఆ చానెల్ బట్టబయలు చేయడంతో ఆ పార్టీ నేతలకు దిమ్మదిరిగింది. వెనువెంటనే రంగంలోకి దిగిన నేతలు ఆ వాహనాలను మళ్లీ పంపించే పనిలో పడ్డారు.