గృహనిర్మాణంలో... పక్కా దగా.. | tdp fails in housing construction on psr nellore | Sakshi
Sakshi News home page

గృహనిర్మాణంలో... పక్కా దగా..

Published Mon, Apr 1 2019 12:25 PM | Last Updated on Mon, Apr 1 2019 12:26 PM

tdp fails in housing construction on psr nellore  - Sakshi

నెల్లూరు(సెంట్రల్‌):  ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో పేదలకు ఇళ్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వం సొంతంగా పేదలకు ఇళ్లను ఇస్తున్నట్లు కేంద్ర పథకానికి ముందు ఎన్‌టీఆర్‌  గ్రామీణ గృహ నిర్మాణ పథకంగా మార్చేకుంది. ఈ పథకాల కింద 2016 నుంచి 2019 వరకు జిల్లాకు 37,046 ఇళ్లను ఇస్తామని ప్రకటించింది. ఇందులో యూనిట్‌ ఖరీదు రూ.3.50 లక్షలు కాగా లబ్ధిదారుడి వాటా కింద రూ.25 వేలు, బ్యాంకు నుంచి మరో రూ.75 వేలు ఇస్తామని, మిగిలిన రూ.2.50 లక్షలు సబ్సిడీ కింద ఇస్తామని చెప్పింది. ఈ పథకం కింద పలువురు బ్యాంకులకు వెళ్లి దరఖాస్తులు చేసుకోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లేక పోవడంతో బ్యాంకర్లు నిధులు మంజూరుకు నిరాకరించారు.   
20 శాతం కూడా పూర్తి కాని ఇళ్లు
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన హౌసింగ్‌కు సంబంధించి మొత్తం 37,046 ఇళ్లను కేటాయించారు. వీటిలో కేవలం 5 శాతం ఇళ్లు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. 20 శాతం ఇళ్లు పునాదుల్లోనే నిలిచిపోవడం గమనార్హం. మిగిలనవి కనీసం పునాదులకు కూడా నోచుకోలేదు.

ఇళ్ల నిధులు మళ్లింపు

జిల్లాలో నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ పథకం ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయగా,  చంద్రబాబు మాత్రం వాటిని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పసుపు–కుంకమ పథకానికి మళ్లించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటితోనే నెట్టుకుని వస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

 రూ.55 కోట్ల బకాయిలు
జిల్లాలో ప్రస్తుతం హెచ్‌ఎఫ్‌ఏ, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనా పథకం ద్వారా రూ.47 కోట్లు,  ఎన్‌టీఆర్‌ రూరల్‌ పథకం ద్వారా మరో రూ.8 కోట్లు మొత్తం రూ.55 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై అదిగో ఇదిగో అంటూ నాన్చుడు ధోరణి తప్ప నిధులు మాత్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా చంద్రబాబును నమ్మి ఇళ్ల నిర్మాణం చేపట్టినందుకు సరైన గుణపాఠం వచ్చిందని, ఇక మీదట ‘నిన్ము నమ్మం బాబూ’ అంటూ పలువురు లబ్ధిదారులు మండిపడుతున్నారు.

జిల్లాలో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ పథకం

నియోజకవర్గం    మండలాలు     పంచాయతీలు ఐదేళ్లలో మంజూరైన ఇల్లు
ఆత్మకూరు 6    123    4,512
కావలి  4   70       5,062
కోవూరు  5   79   4,188
నెల్లూరు రూరల్‌  1   31   1,550
గూడూరు  5   117  6,255
సూళ్లూరుపేట   6   122   3,663
సర్వేపల్లి   5     113 3,869
వెంకటగిరి  6     135   4,089
ఉదయగిరి 8 138  3,858
     మొత్తం 37,046 

పునాదులకే పరిమితం

ఆత్మకూరురూరల్‌:  తెలుగుదేళం పాలనలో పేదొడి పక్కా ఇళ్ల కల కల్లగా మారింది. అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన చంద్రబాబు విస్మరించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత పేదలకు ఇళ్లు మంజూరు చేసింది. నియోజకవర్గంలో ఆరు మండలాలలు ఉంటే.. వరుసగా మూడేళ్లు కాలంలో 4,515 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇందులో అత్యధిక శాతం ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు చాలా వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అరకొరగా కేటాయింపులు చేసి పేదల గృహ నిర్మాణాలను పునాదులు దాటకుండా పచ్చ పార్టీ నేతలు తమకు అన్యాయం చేశారని ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

మండలంలోని నువ్వూరుపాడు, అప్పారావుపాళెం, పమిడిపాడు, కరటంపాడు, దేపూరు, రామస్వామిపల్లి తదితర గ్రామాల్లో సుమారు 500 కుటుంబాల గిరిజనులు ఉండగా వారిలో అత్యధిక శాతం పూరిల్లు కూడా లేని వారు ఉన్నారు. పమిడిపాడులో 30 కుటుంబాల గిరిజనులు తాత్కాలిక నివాసాలు ఉండగా నువ్వూరుపాడు ఎస్టీకాలనీలో నాలుగేళ్ల క్రితం మంజూరైన 14 మంది గిరిజనుల కుటుంబాల పక్కా ఇళ్లు బేస్‌మెంట్‌ దశలో నయాపైసా బిల్లు కాక నిలిచిపోయింది. అనుమసముద్రంపేట మండలంలో దాదాపు 849 గృహాలు మంజూరు కాగా 90 గృహాలు మినహా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. లబ్ధిదారులకు ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో లబోదిబో అంటున్నారు. ఇందులో అధిక శాతం టీడీపీ అనుకూల వర్గానికే గహాలు మంజూరైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.  అనంతసాగరం మండలంలో ఎన్టీఆర్‌ గృహæ లబ్ధిదారులకు ఐదు నెలలుగా బిల్లులు రాక ఎదురు చూస్తున్నారు. మండలంలో 1,223 గృహాలు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాల లబ్ధిదారులు దాదాపు 236 మంది ఉన్నారు.  

పచ్చ ముద్ర ఉంటేనే ఇల్లు

సూళ్లూరుపేట:  ఐదేళ్ల టీడీపీ పాలనలో నిజమైన అర్హులకు పక్కా ఇళ్లు అందని ద్రాక్షలా తయారైంది. రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో ఆరు మండలాలు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో మొత్తం 3,663 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో సగం కూడా పూర్తి కాలేదు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నుడా కింద సుమారు 1,838 ఇళ్లు మంజూరు కాగా ఇవి కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి.  ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 17.3 శాతం, ఎస్టీలకు 5.3 శాతం ఇళ్లు ఇవ్వమని ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం కావడంతో సుమారు 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు పేదరికంలో ఉన్నారు. మంజూరు చేసిన ఇళ్లను సైతం అర్హులైన పేదలకు ఇవ్వలేదు. జన్మభూమి కమిటీ సభ్యులు నిర్ణయించిన వారికే, అది అధికార పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. బిల్లుల మంజూరులో సైతం నిర్లక్ష్యం ప్రదర్శించారు. పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు కాకపోవడంతో సగం ఇళ్లు కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. 

ఎన్టీఆర్‌ గృహ పథకం ఒక మిథ్య

ముత్తుకూరు : టీడీపీ పాలనలో ఎన్టీఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రెండేళ్ల వరకు పేదలకు పక్కా గృహాలు మంజూరు కానేలేదు. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటే.. ఐదేళ్లకు గాను 3,869 ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. 2016–17 సంవత్సరంలో సర్వేపల్లి నియోజకవర్గానికి 1,350 ఇళ్లు మంజూరురైతే అధికారుల లెక్కల ప్రకారం అన్నీ పూర్తయ్యాయి.  2017–19కి 1,221 ఇళ్లకు 770 పూర్తయ్యాయి. 2018–2019 సంవత్సరంలో 1,348 పక్కాగృహాలు మంజూరుకాగా 1,000 ఇళ్లు మాత్రమే నిర్మాణం ప్రారంభమయ్యాయి. ఒక మండలానికి ఏటా అరకొరగానే ఇళ్లు మంజూరు కావడంతో వందల సంఖ్యలో ఉన్న పేదలు నేటికీ పూరిపాకల్లో బతుకీడుస్తున్నారు. నుడా కింద 7,470 పక్కాగృహాలు మంజూరైనప్పటికీ 90 శాతం ఇళ్ల నిర్మాణం ప్రారంభంకాలేదు. హౌసింగ్‌ ఇంజినీర్ల అంచనాల ప్రకారం శ్లాబు నిర్మాణం, సిమెంట్‌ పూత పనులు జరిగితేనే పక్కా ఇల్లు పూర్తనట్టు లెక్క. దీంతో 70 శాతం తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్‌ లేని ఇళ్లే దర్శన మిస్తున్నాయి. ఒక ఇంటికి ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.35 లక్షలు, మరుగుదొడ్డికి రూ.15 వేలు చాలీచాలక పోవడమే దీనికి కారణం.

కలగా మారిన పక్కా ఇళ్లు

ఉదయగిరి: వైఎస్సార్‌ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ప్రస్తుత టీడీపీ పాలనలో పక్కా ఇళ్లు పచ్చతమ్ముళ్లు, జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలున్న వారికే మాత్రమే మంజూరయ్యాయి. ఈ ఐదేళ్ల ప్రభుత్వం హయాంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉంటే.. 3,858 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 270 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ కూడా వివిధ దశల్లోనూ, పునాదులకే పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్మించిన వాటికి కూడా పూర్తిస్థాయిలో బిల్లులు లబ్ధిదారులకు అందలేదు. మంజూరు చేసిన బిల్లులు కూడా జన్మభూమి కమిటీలకు, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే అందాయి.

అసలైన పేదలకు మాత్రం పక్కా ఇళ్లు మంజూరు కాలేదు. నియోజకవర్గంలో ఎక్కువ ఇళ్లు అధికార పార్టీ నేతలు, వారి బంధువులు, వారికి సమీపస్తులకు మాత్రమే మంజూరు కావడం విశేషం.  కొన్నిచోట్ల ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు కాజేశారు. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన ఏఈలను సస్పెండ్‌ చేశారు. ఉదయగిరి డీఈ కూడా సస్పెండ్‌ అయ్యారు. దీన్ని పక్కా ఇళ్ల నిర్మాణంలో అవినీతి ఏస్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. వరికుంటపాడు మండలం గణేశ్వరపురం, నార్తుకొండాయపాళెం, విరువూరు, రామాపురం, తదితర పంచాయతీల్లో పక్కా ఇళ్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి చోటు చేసుకుంది. దుత్తలూరు మండలంలో కొత్తపేట, వెంగనపాళెం, ముత్తరాశిపల్లి, నాయుడుపల్లి, దుత్తలూరు పంచాయతీల్లో బిల్లులు నిర్మించకుండానే అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై నిధులు భోంచేశారు. 

అసంపూర్తి.. అసంతృప్తి

బుచ్చిరెడ్డిపాళెం: ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లుగా అర్హులను మోస చేశారు. కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు..79 పంచాయతీలు ఉంటే  2014 నుంచి 2019 వరకు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద మొత్తం ఐదేళ్లలో 4,188 ఇళ్లు మంజూరు చేసింది. అయితే వీటిలో 3,196 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా 992 అసంపూర్తిగానే ఉన్నాయి. కొన్ని ఇళ్లు బేస్‌మట్టానికే పరిమితమయ్యాయి. దాదాపు రూ.3 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి నేటికీ ఖాతాల్లో బిల్లు బకాయిలు పడడం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. శ్లాబులు వేసుకుని బిల్లుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement